లాడెన్‌తో జవహరీ(ఫైల్)
వాషింగ్టన్: అల్–జవహరీ ఈజిప్టు రాజధాని ౖకైరోలో 1951లో ఓ సంపన్న కుటుంబంలో జన్మించాడు. కేవలం 15 ఏళ్ల చిన్న వయసులోనే ‘జమాత్ అల్–జిహాద్’ పేరిట సొంతంగా ఒక సంస్థను స్థాపించాడు. విరోధులను అంతం చేయడమే దీని లక్ష్యం. ఇది ఈజిప్టులో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థగా రూపాంతరం చెందింది. 1981 అక్టోబర్ 6న ఉగ్రవాద దాడుల్లో ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్ బలయ్యారు. ఈ దాడుల్లో ‘జమాత్ అల్–జిహాద్’ హస్తం ఉన్నట్లు తేలింది.
జవహరీ వైద్య విద్య అభ్యసించాడు. కొన్నాళ్లు సర్జన్‌గా పనిచేశాడు. జీవ ఆయుధాలను అభివృద్ధి చేయడానికి ఒక ల్యాబ్‌ను నడిపించాడు. గతంలో ఓ కేసు విచారణలో భాగంగా జవహరీ కోర్టుకు హాజరయ్యాడు. ‘‘మేము త్యాగాలు చేశాం. ఇస్లాం విజయం సాధించేవరకూ ఎన్ని త్యాగాలు చేయడానిౖకైనా సిద్ధంగా ఉన్నాం’’ అంటూ కోర్టు గదిలో గట్టిగా అరిచాడు.
లాడెన్‌కు వ్యక్తిగత వైద్యుడిగా సేవలు
అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు గాను జవహరీకి మూడేళ్ల జైలు శిక్ష పడింది. జైలు నుంచి విడుదలయ్యాక దక్షిణాసియాకు చేరుకున్నాడు. ఒసామా బిన్ లాడెన్‌కు వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించాడు. 1988లో ఒసామా బిన్ లాడెన్ అల్‌ఖైదాను స్థాపించాక అందులో చేరాడు. చురుగ్గా కార్యకలాపాలు సాగించాడు. 1990 తర్వాత తన ‘జమాత్ అల్–జిహాద్’ సంస్థను అల్‌ఖైదాలో విలీనం చేశాడు. అతి తక్కువ కాలంలోనే లాడెన్‌కు నమ్మిన బంటుగా మారాడు. 1990వ దశకంలో పశ్చిమ దేశాల నిఘా సంస్థలు తొలిసారిగా జవహరీపై దృష్టి పెట్టాయి. అల్‌ఖైదా ముఠాలో అతడి ప్రతిష్ట విపరీతంగా పెరిగిపోయింది. అల్‌ఖైదా నిర్వహించే విలేకరుల సమావేశాల్లో లాడెన్ పక్కనే జవహరీ తప్పనిసరిగా కనిపించేవాడు. 1997లో అఫ్గానిస్తాన్‌లో ఉన్నప్పుడు ఈజిప్టు పర్యాటకులను చంపేందుకు ప్లాన్ చేశాడు. 1998లో లాడెన్ అల్‌ఖైదా ఉప నాయకుడిగా జవహరీ పేరును ప్రకటించాడు. అంటే ఉగ్రముఠాలో లాడెన్ తర్వాతి స్థానం జవహరీదే కావడం గమనార్హం. అణ్వాయుధాలు సంపాదించుకోవాలన్న అల్‌ఖైదా ఆశయం వెనుక జవహరీ ప్రోత్సాహం ఉంది.
ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో..
ఆత్మాహుతి దాడులకు వ్యూహాలు రచించడంలో జవహరీ దిట్ట. నిధులు సేకరించడంలోనూ నేర్పరి. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా నిఘా దర్యాప్తు సంస్థ ‘ఎఫ్‌బీఐ’ అల్–జవహరీని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అతడి తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. పదేళ్ల క్రితం అమెరికా నేవీ సీల్స్ దాడుల్లో లాడెన్ హతమయ్యాక జవహరీ అల్‌ఖైదా పగ్గాలు తన చేతుల్లోకి తీసుకున్నాడు. చెల్లాచెదురైన అల్‌ఖైదాను బలోపేతం చేసేందుకు ప్రయత్నించాడు. ఇస్లామిక్ దేశాల్లో ఉన్న అల్‌ఖైదా సభ్యులకు సుప్రీంలీడర్‌గా దిశానిర్దేశం చేశాడు. అఫ్గాన్‌పై అమెరికా సేనలు పట్టు బిగించడంతో జవహరీ కార్యకలాపాలకు బ్రేక్ పడింది. అతడి ఆచూకీ తెలియకుండా పోయింది. వేర్వేరు దేశాల్లో తలదాచుకున్నట్లు వార్తలు వచ్చాయి. జవహరీ చనిపోయాడన్న వాదనలు సైతం వినిపించాయి. కానీ, అమెరికా నిఘా సంస్థలు నమ్మలేదు. ఓపికగా వేట కొనసాగించాయి. చివరకు అఫ్గానిస్తాన్‌లోనే అంతం చేశాయి.
అమెరికన్లను హతమార్చడమే లక్ష్యం
1998 ఆగస్టు ఏడో తేదీన టాంజానియా, కెన్యాలోని అమెరికా రాయబార కార్యాలయాలపై బాంబు దాడులు జరిగాయి. జవహరీ నేతృత్వంలోనే ఈ దాడులకు వ్యూహాలు రూపొందించారు. అప్పుడు అతడి వయసు 47 సంవత్సరాలు. ఇక అగ్రరాజ్యం అమెరికాను వణికించిన ‘2001 సెప్టెంబర్ 11’ దాడుల వెనుక లాడెన్‌తో కలిసి కీలక పాత్ర పోషించారు. ‘‘అమెరికన్లను, వారి మిత్రులను అంతం చేయడమే ప్రతి ముస్లిం వ్యక్తిగత విధి. అమెరికన్లు ప్రపంచంలో ఎక్కడున్నా సరే హతమార్చాలి’’ అని 1998లో తన మేనిఫెస్టోలో జవహరీ స్పష్టంగా రాసుకున్నాడు. ‘సెప్టెంబర్ 11’ దాడుల తర్వాత అమెరికాలో మరిన్ని దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించాడు. అఫ్గానిస్తాన్‌లో జీవ ఆయుధాల తయారీకి శ్రీకారం చుట్టాడు. కానీ, అఫ్గాన్‌పై అమెరికా దండెత్తడంతో అతడి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
వారసుడు ఆదెల్?
జవహరీ మరణంతో అల్ ఖైదా నాయకునిగా ఈజిప్టు మాజీ సైనికాధికారి మహ్మద్ సలాహ్ అల్ దిన్ జైదన్ అలియాస్ సైఫ్ అల్ ఆదెల్ (60) పేరు గట్టిగా వినవస్తోంది. అల్ ఖైదా అగ్ర నేతల్లో పిన్న వయస్కుడితడే.
ఎవరీ ఆదెల్?
ఈజిప్టుకు చెందిన ఆదెల్ మాజీ కల్నల్. అల్‌ఖైదా వ్యవస్థాపక సభ్యుడు. అమెరికా, బ్రిటిష్ సైనికులనెందరినో చంపాడు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర రిక్రూట్‌మెంట్లు, నిధుల కోసం 1980ల్లో ఒసామా బిన్ లాడెన్ నెలకొల్పిన మక్తాబ్ అల్ ఖిద్మత్ (ఎంఏకే)తో కూడా అనుబంధముంది. లాడెన్ సెక్యూరిటీ చీఫ్‌గానూ వ్యవహరించాడు. అప్పుడే జవహరీతోనూ పరిచయమేర్పడింది. 1993లో సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు 19 మంది అమెరికా సైనికులను చంపి మృతదేహాలను వీధుల గుండా ఈడ్చుకెళ్లారు. ఈ దాడి ఆదెల్ కనుసన్నల్లోనే జరిగింది.
కెన్యా, టాంజానియాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలపై 1998లో జరిగిన దాడులు, పెంటగాన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై జరిగిన దాడులతోనూ ఇతడికి సంబంధముంది. దీంతో అమెరికా ఆదెల్ పేరును మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చి అతడి తలపై కోటి డాలర్ల నజరానా ప్రకటించింది. లాడెన్ మరణం తర్వాత కీలక వ్యూహకర్తగా ఎదిగాడు. 20 ఏళ్లుగా ఇరాన్‌లోనే ఉన్నట్టు అనుమానం. సిరియాలోని ఉగ్ర ముఠాలకు టెలిగ్రాం ద్వారా సూచనలిస్తాడని చెబుతారు. లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్‌ను కూడా 2019లో అమెరికా సైన్యం మట్టుబెట్టింది. అల్‌ఖైదా పగ్గాలు ఇతని చేతుల్లోకే వెళ్తాయని మిడిల్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment