'మీదే అసహనం.. కల్పిత నిరసన!'
న్యూఢిల్లీ: నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో అహసనం పెరిగిపోయిందంటూ పలువురు రచయితలు సాహిత్య అకాడమీ పురస్కారాలను వాపస్ ఇవ్వడాన్ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తప్పుబట్టారు. తమ భావజాలంలోని అసహనం చేతనే వారు కల్పిత నిరసనతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం జైట్లీ విలేకరులతో మాట్లాడుతూ ఆవుమాంసం తిన్నారనే ఆరోపణలపై దాద్రిలో మహ్మద్ అఖ్లాఖ్ను చంపడం తీవ్ర దురదృష్టకరమని, గర్హనీయమని పేర్కొన్నారు.
దాద్రి ఘటన నేపథ్యంలో పలువరు రచయితలు సాహిత్య అకాడమీ అవార్డులు వెనక్కి ఇవ్వడం వెనుక వారి ఉద్దేశాలు ఏమిటని ప్రశ్నించారు. 'ఇది నిజమైన నిరసనా? లేక సృష్టించినదా? ఇది భావజాల అసహనం కాదా?' అని జైట్లీ ప్రశ్నించారు. వామపక్ష వాద, నెహ్రూవియన్ రచయితలు మోదీ ప్రభుత్వంతో తమకు సరిపడటం లేదనే నిరసనలకు పూనుకుంటున్నారని విమర్శించారు.