Sahitya Akademi awards
-
సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీలకు చెందిన రచయితలు బండి నారాయణ స్వామి, పెన్నా మధుసూదన్‌లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. 23 భారతీయ భాషల్లో రచనలకు గాను ఏటా ప్రకటించే సాహిత్య అకాడమీ అవార్డులను డిసెంబర్ 18న ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాకు చెందిన బండి నారాయణ స్వామి రాయలసీమ చరిత్ర ఆధారంగా తెలుగులో రాసిన శప్తభూమికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించగా.. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబర్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. కాగా, సంస్కృత భాషలో పెన్నా మధుసూదన్ రాసిన ప్రజ్ఞాచాక్షుషం కావ్యానికి కూడా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆయన కూడా మంగళవారం జరిగిన కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకున్నారు. పెన్నా మధుసూదన్ జడ్చర్లకు చెందినవారు. గతంలో ఆయన సోమనాథ్ సంస్కృత పండిట్ అవార్డు, పండిట్ లట్కర్‌శాస్త్రి మెమోరియల్ అవార్డు తదితర పురస్కారాలు అందుకున్నారు. మహారాష్ట్రకు చెందిన సాధువు గులాబ్‌రావు మహారాజ్ ఆధ్యాత్మిక తత్వబోధనలపై ప్రజ్ఞాచాక్షుషం రచించారు. కార్యక్రమంలో అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు స్వాగతోపన్యాసం చేశారు. చాలా ఆనందంగా ఉంది అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మహారాష్ట్రలో ఒక రైతు కుటుంబంలో ఒక నిర్దన పరివారంలో పుట్టిన ఒక గొప్ప మహాత్ముడి జీవితాన్ని 850 శ్లోకాల్లో రాశాను. ఆయన జీవితం, ఆయన దార్శనిక విచారాలు, తత్వజ్ఞానాలు ప్రస్తావించాను. ఆ మహాత్ముడి జీవితం తెలియాలి. 34 ఏళ్లు మాత్రమే జీవించారు. 134 పుస్తకాలు,4 భాషల్లో రాశారు. భారతీయ ధర్మాన్ని స్థాపించాలని ప్రయత్నించారు. మరిన్ని రచనలు చేసేందుకు ఈ అవార్డు ప్రోత్సాహాన్నిస్తుంది. –పెన్నా మధుసూదన్ అవార్డు రావడం సంతోషకరం నేను రాసిన శప్తభూమి నవలకు ఈ అవార్డు రావడం పాఠకులకు ఎక్కువ సంతోషాన్నిచ్చింది. దాని ఆధారంగా నాకూ సంతోషాన్నిచ్చింది. తెలంగాణ విడిపోయిన క్రమంలో రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. రాయలసీమకు కూడా తనకంటూ ఒక భాష, సంస్కృతి ఉందని వివిధ ప్రాంతాలకు తెలియపరిచేందుకు ఈ శప్తభూమి రాశాను. రాయలసీమ చారిత్రక మూలాలు 18వ శతాబ్దం నుంచి తీసుకుని ఈ నవల రాశాను. రాయలసీమ కరువు, కరువుల పరంపరలను నవలలో రాశాను. రాయలసీమ కరువు కాటకాలను, సుఖదుఃఖాలను వివిధ ప్రాంతాలతో పంచుకునే అవకాశం లభించింది. – బండి నారాయణ స్వామి -
తెలుగు రచయితలకు సాహిత్య అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ /పార్వతీపురం: కేంద్ర సాహిత్య అకాడమీ శుక్రవారం ఈ ఏడాదికి గాను బాల సాహిత్య పురస్కారాలు, యువ పురస్కారాలు ప్రకటించింది. పురస్కార గ్రహీతల ఎంపికకు అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబర్ నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్ బోర్డు అగర్తలాలో ఆమోదముద్ర వేసింది. ఇద్దరు తెలుగు రచయితలు అకాడమీ పురస్కారాలకు ఎంపికయ్యారు. డాక్టర్ గడ్డం మోహన్‌రావుకు ‘కొంగవాలు కత్తి’ తెలుగు నవలా రచనకు గాను సాహిత్య అకాడమీ యువ పురస్కారం–2019 లభించింది. ‘తాత మాట వరాల మూట’ కథా సంపుటి రచించిన బెలగం భీమేశ్వరరావును బాల సాహిత్య పురస్కారం దక్కింది. చిందు ‘కళ’కు అక్షర రూపమిచ్చిన గడ్డం నల్గొండ జిల్లాకు చెందిన గడ్డం మోహన్‌రావు ఉస్మానియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. చిందు భాగవతం కళాకారుల జీవితాలకు అక్షర రూపం ఇస్తూ మోహన్‌రావు కొంగవాలు కత్తి, చిందు జాంబవ పురాణం, నేను చిందేస్తే.. అనే మూడు పుస్తకాలను రచించారు. అంతరించిపోతున్న చిందు కళను, ఈ కళను వృత్తిగా స్వీకరించిన వారి జీవితాలను ఈ పుస్తకాల ద్వారా భావితరాలకు పరిచయం చేశారు. బాల సాహిత్యంలో ‘భీముడు’: విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన భీమేశ్వరరావు నాలుగు దశాబ్దాలుగా బాల సాహిత్యంపై విశేష కృషి చేస్తున్నారు. ఈయన గతంలో మంచిపల్లి సత్యవతి స్మారక బాల సాహిత్య పురస్కారం, డాక్టర్ ఎన్.మంగాదేవి బాల సాహిత్య పురస్కారం, విజ్ఞాన వివర్థిని బాల సాహిత్య పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి బాల సాహిత్య కీర్తి పురస్కారాలను అందుకున్నారు. భీమేశ్వరరావు రచించిన కొన్ని రచనలను మహారాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశాలుగా చేర్చింది. పురస్కారాన్ని అందుకున్న కృష్ణారావు ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు ఎ.కృష్ణారావు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని అందుకున్నారు. 2018 ఏడాదికి గానూ కృష్ణారావు అనువదించిన ‘గుప్పెడు సూర్యుడు మరికొన్ని కవితలు’ కవితాసంపుటికి కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం వరించింది. శుక్రవారం త్రిపుర రాజధాని అగర్తలాలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ చంద్రశేఖర్ కంబర్ చేతుల మీదుగా కృష్ణారావు అవార్డుతో పాటు రూ.50 వేల నగదు బహుమానాన్ని అందుకున్నారు. భీమేశ్వరరావు, గడ్డం మోహన్‌రావు -
రచయితలపై తస్లీమా ఫైర్
దేశంలో అసహనం పెరిగిపోతున్నదని నిరసన వ్యక్తం చేస్తూ సాహిత్య అకాడమీ అవార్డులు తిరిగి ఇచ్చేసిన రచయితల సంఖ్య 30కి చేరింది. ఒకవైపు రచయితలు వరుసపెట్టి తమ పురస్కారాలను వాపస్ ఇస్తుండగా.. మరోవైపు ప్రభుత్వం వారి నిరసన కల్పితమైనదని కొట్టిపారేసింది. ఈ వివాదంపై తాజాగా భారత్‌లో ప్రవాసముంటున్న బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా స్పందించారు. అసమ్మతి తెలియజేయడంలోనూ భారతీయ రచయితలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఆమె విమర్శించారు. తనపై దాడి జరిగినప్పుడు వారు ఎందుకు మౌనంగా ఉండిపోయారని ప్రశ్నించారు. అవార్డులను తిరిగి ఇవ్వడం ద్వారా అన్యాయాలపై నిరసన తెలియజేయడం తప్పేమీ కాదన్నారు. ఇది కల్పిత నిరసన అని ప్రభుత్వం చేస్తున్న వాదనతో తాను ఏకీభవించడం లేదని, రచయితలు రాజకీయంగా, సామాజికంగా స్పృహ కలిగిన వ్యక్తులని పేర్కొన్నారు. 'నా పుస్తకం పశ్చిమ బెంగాల్లో నిషేధించినప్పుడు, నాపై భారత్‌లో ఐదు ఫత్వాలు జారీచేసినప్పుడు, బెంగాల్ నుంచి నన్ను వెళ్లగొట్టినప్పుడు, ఢిల్లీలో నెలపాటు నన్ను గృహనిర్బంధంలో ఉంచినప్పుడు చాలామంది రచయితలు మౌనంగా ఉండిపోయారు. ఇక్కడ జీవించడానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం నేను ఒంటరిగానే పోరాడుతున్నాను. ఈ విషయంలో రచయితలు మౌనంగా ఉండటమే కాకుండా.. సునీల్ గంగూలీ, శంఖా ఘోష్ వంటి రచయితలు నా పుస్తకాన్ని నిషేధించాలని అప్పటి సీఎం బుద్ధదేవ్ భట్టచార్యకు కోరారు కూడా' అని తస్లీమా పేర్కొన్నారు. అసమ్మతి తెలియజేయడంలోనూ భారత రచయితలవి ద్వంద్వ ప్రమాణాలని విమర్శించారు. ఇక్కడ లౌకికవాదమూ సమస్యే! భారత్‌లో లౌకికవాదం అనుసరించే విధానంలోనూ సమస్య ఉందని, చాలామంది లౌకికవాదులు ముస్లింలకు అనుకూలంగా, హిందూ వ్యతిరేకులుగా వ్యవహరిస్తున్నారని తస్లీమా పేర్కొన్నారు. వారు హిందూ ఛాందసవాదుల చర్యలను నిరసిస్తారు.. అదేసమయంలో ముస్లిం ఛాందసవాదుల దారుణమైన చర్యలను సమర్థిస్తారని తెలిపారు. -
'మీదే అసహనం.. కల్పిత నిరసన!'
న్యూఢిల్లీ: నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో అహసనం పెరిగిపోయిందంటూ పలువురు రచయితలు సాహిత్య అకాడమీ పురస్కారాలను వాపస్ ఇవ్వడాన్ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తప్పుబట్టారు. తమ భావజాలంలోని అసహనం చేతనే వారు కల్పిత నిరసనతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం జైట్లీ విలేకరులతో మాట్లాడుతూ ఆవుమాంసం తిన్నారనే ఆరోపణలపై దాద్రిలో మహ్మద్ అఖ్లాఖ్ను చంపడం తీవ్ర దురదృష్టకరమని, గర్హనీయమని పేర్కొన్నారు. దాద్రి ఘటన నేపథ్యంలో పలువరు రచయితలు సాహిత్య అకాడమీ అవార్డులు వెనక్కి ఇవ్వడం వెనుక వారి ఉద్దేశాలు ఏమిటని ప్రశ్నించారు. 'ఇది నిజమైన నిరసనా? లేక సృష్టించినదా? ఇది భావజాల అసహనం కాదా?' అని జైట్లీ ప్రశ్నించారు. వామపక్ష వాద, నెహ్రూవియన్ రచయితలు మోదీ ప్రభుత్వంతో తమకు సరిపడటం లేదనే నిరసనలకు పూనుకుంటున్నారని విమర్శించారు.