అవార్డు అందుకుంటున్న కృష్ణారావు
సాక్షి, న్యూఢిల్లీ /పార్వతీపురం: కేంద్ర సాహిత్య అకాడమీ శుక్రవారం ఈ ఏడాదికి గాను బాల సాహిత్య పురస్కారాలు, యువ పురస్కారాలు ప్రకటించింది. పురస్కార గ్రహీతల ఎంపికకు అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబర్ నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్ బోర్డు అగర్తలాలో ఆమోదముద్ర వేసింది. ఇద్దరు తెలుగు రచయితలు అకాడమీ పురస్కారాలకు ఎంపికయ్యారు. డాక్టర్ గడ్డం మోహన్‌రావుకు ‘కొంగవాలు కత్తి’ తెలుగు నవలా రచనకు గాను సాహిత్య అకాడమీ యువ పురస్కారం–2019 లభించింది. ‘తాత మాట వరాల మూట’ కథా సంపుటి రచించిన బెలగం భీమేశ్వరరావును బాల సాహిత్య పురస్కారం దక్కింది.
చిందు ‘కళ’కు అక్షర రూపమిచ్చిన గడ్డం
నల్గొండ జిల్లాకు చెందిన గడ్డం మోహన్‌రావు ఉస్మానియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. చిందు భాగవతం కళాకారుల జీవితాలకు అక్షర రూపం ఇస్తూ మోహన్‌రావు కొంగవాలు కత్తి, చిందు జాంబవ పురాణం, నేను చిందేస్తే.. అనే మూడు పుస్తకాలను రచించారు. అంతరించిపోతున్న చిందు కళను, ఈ కళను వృత్తిగా స్వీకరించిన వారి జీవితాలను ఈ పుస్తకాల ద్వారా భావితరాలకు పరిచయం చేశారు.
బాల సాహిత్యంలో ‘భీముడు’: విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన భీమేశ్వరరావు నాలుగు దశాబ్దాలుగా బాల సాహిత్యంపై విశేష కృషి చేస్తున్నారు. ఈయన గతంలో మంచిపల్లి సత్యవతి స్మారక బాల సాహిత్య పురస్కారం, డాక్టర్ ఎన్.మంగాదేవి బాల సాహిత్య పురస్కారం, విజ్ఞాన వివర్థిని బాల సాహిత్య పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి బాల సాహిత్య కీర్తి పురస్కారాలను అందుకున్నారు. భీమేశ్వరరావు రచించిన కొన్ని రచనలను మహారాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశాలుగా చేర్చింది.
పురస్కారాన్ని అందుకున్న కృష్ణారావు
ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు ఎ.కృష్ణారావు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని అందుకున్నారు. 2018 ఏడాదికి గానూ కృష్ణారావు అనువదించిన ‘గుప్పెడు సూర్యుడు మరికొన్ని కవితలు’ కవితాసంపుటికి కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం వరించింది. శుక్రవారం త్రిపుర రాజధాని అగర్తలాలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ చంద్రశేఖర్ కంబర్ చేతుల మీదుగా కృష్ణారావు అవార్డుతో పాటు రూ.50 వేల నగదు బహుమానాన్ని అందుకున్నారు.
భీమేశ్వరరావు, గడ్డం మోహన్‌రావు
Comments
Please login to add a commentAdd a comment