Central Sahitya Akademi
-
తెలుగు రచయితలకు సాహిత్య అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ /పార్వతీపురం: కేంద్ర సాహిత్య అకాడమీ శుక్రవారం ఈ ఏడాదికి గాను బాల సాహిత్య పురస్కారాలు, యువ పురస్కారాలు ప్రకటించింది. పురస్కార గ్రహీతల ఎంపికకు అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబర్ నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్ బోర్డు అగర్తలాలో ఆమోదముద్ర వేసింది. ఇద్దరు తెలుగు రచయితలు అకాడమీ పురస్కారాలకు ఎంపికయ్యారు. డాక్టర్ గడ్డం మోహన్‌రావుకు ‘కొంగవాలు కత్తి’ తెలుగు నవలా రచనకు గాను సాహిత్య అకాడమీ యువ పురస్కారం–2019 లభించింది. ‘తాత మాట వరాల మూట’ కథా సంపుటి రచించిన బెలగం భీమేశ్వరరావును బాల సాహిత్య పురస్కారం దక్కింది. చిందు ‘కళ’కు అక్షర రూపమిచ్చిన గడ్డం నల్గొండ జిల్లాకు చెందిన గడ్డం మోహన్‌రావు ఉస్మానియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. చిందు భాగవతం కళాకారుల జీవితాలకు అక్షర రూపం ఇస్తూ మోహన్‌రావు కొంగవాలు కత్తి, చిందు జాంబవ పురాణం, నేను చిందేస్తే.. అనే మూడు పుస్తకాలను రచించారు. అంతరించిపోతున్న చిందు కళను, ఈ కళను వృత్తిగా స్వీకరించిన వారి జీవితాలను ఈ పుస్తకాల ద్వారా భావితరాలకు పరిచయం చేశారు. బాల సాహిత్యంలో ‘భీముడు’: విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన భీమేశ్వరరావు నాలుగు దశాబ్దాలుగా బాల సాహిత్యంపై విశేష కృషి చేస్తున్నారు. ఈయన గతంలో మంచిపల్లి సత్యవతి స్మారక బాల సాహిత్య పురస్కారం, డాక్టర్ ఎన్.మంగాదేవి బాల సాహిత్య పురస్కారం, విజ్ఞాన వివర్థిని బాల సాహిత్య పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి బాల సాహిత్య కీర్తి పురస్కారాలను అందుకున్నారు. భీమేశ్వరరావు రచించిన కొన్ని రచనలను మహారాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశాలుగా చేర్చింది. పురస్కారాన్ని అందుకున్న కృష్ణారావు ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు ఎ.కృష్ణారావు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని అందుకున్నారు. 2018 ఏడాదికి గానూ కృష్ణారావు అనువదించిన ‘గుప్పెడు సూర్యుడు మరికొన్ని కవితలు’ కవితాసంపుటికి కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం వరించింది. శుక్రవారం త్రిపుర రాజధాని అగర్తలాలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ చంద్రశేఖర్ కంబర్ చేతుల మీదుగా కృష్ణారావు అవార్డుతో పాటు రూ.50 వేల నగదు బహుమానాన్ని అందుకున్నారు. భీమేశ్వరరావు, గడ్డం మోహన్‌రావు -
అఖిల భారత కవితోత్సవానికి నిఖిలేశ్వర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ కవితా దినోత్సవాన్ని (వరల్డ్ పొయెట్రీ డే) పురస్కరించుకొని బుధవారం ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీలో అఖిల భారత కవితోత్సవం నిర్వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార్ అధ్యక్షతన జరిగిన ఉత్సవంలో 22 భాషల కవులు తమ కవిత్వాలను వినిపించారు. తెలుగు నుంచి హైదరాబాద్‌కు చెందిన కవి నిఖిలేశ్వర్ పాల్గొన్నారు. విశ్వ సంస్కృతిలో కవిత్వం ఒక భాగమని, దేశంలో మానవ సంస్కృతి అంతరాత్మగా కవిత్వం వెలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. -
పురస్కార స్పందన
తేలికగా రాయడం కూడా కష్టమే! కేంద్ర సాహిత్య అకాడెమీ ‘బాల సాహిత్య పురస్కార్ –2017’ గెలుచుకున్న వాసాల నరసయ్యతో సాక్షి ప్రతినిధి జరిపిన చిరు సంభాషణ: ఈ అవార్డు రావడం పట్ల మీ స్పందన ఏమిటి? చాలా సంతోషంగా ఉన్నది. ఐదో తరగతి చదివేటప్పుడు సౌగంధిక హరణం అనే వీధి నాటకం రాసినుంటి. అది మొదలు బాలల కోసం 28 పుస్తకాలు రాసిన. 1955లో నా విద్యార్థి దశ నుంచీ చేసిన కృషికి ఇది ఫలితం అనుకుంటున్నా. న్యాయ నిర్ణేతలకు ధన్యవాదాలు. బాల సాహిత్యంలోకే ఎందుకు వచ్చారు? ఇండ్ల లేరెక్కువ మంది. మంచి అభిప్రాయం లేదు చాలా మందికి. పెద్దపెద్దవాళ్లు ఎవలూ దీన్ని ముట్టుకోలేదు. పిల్లలు మన సంపద. వాళ్లు సంస్కార వంతంగా ఎదగాలే. వాళ్లు బాగుంటెనే మనం మంచిగుంటం. దేశం, గ్రామం, కుటుంబం... అన్నీ పిల్లల ప్రవర్తన మీద ఆధారపడి వుంటయి. అందుకే దీన్ని ఎంపిక చేసుకున్న. బాల సాహిత్యానికీ ఇతర సాహిత్యానికీ ప్రధానమైన తేడా ఏమిటనుకుంటున్నారు? నిత్య జీవితంలో ఉన్న వ్యవహారాలు, మోసాలు, క్లాస్‌రూమ్‌లో జరిగే సంఘటనలు, స్నేహితంలో జరిగే సంఘటనలు... వేటితోనైనా పిల్లలకు కథ చెప్పొచ్చు. ప్రౌఢ సాహిత్యాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. పిల్లలకు తేలిక పదాలు, చిన్న చిన్న వాక్యాలు రాయాలి. తేలికగా రాయడం కూడా కష్టమే! పిల్లల కథల్లో నీతి విధిగా ఉండాలంటారా? ఏది రాసినా నీతిని బోధించేట్టుగానే ఉండాలె. కథ మామూలుగా చెబుతాం. చివరికి రెండు వాక్యాలుంటాయి అంతే. డైరెక్టుగానో ఇన్‌డైరెక్టుగానో నీతి అయితే ఉండాలె. కవిత్వమంటే ఆత్మతో మాట్లాడుకోవడం! మాటల మడుగు కవితా సంకలనానికిగానూ 2017 సంవత్సరపు కేంద్ర సాహిత్య అకాడెమీ ‘యువ పురస్కార్’ గెలుచుకున్న మెర్సీ మార్గరెట్‌తో సాక్షి ప్రతినిధి జరిపిన చిరు సంభాషణ: ఈ అవార్డు వస్తుందని ఊహించారా? అస్సలు అనుకోలేదు. కాకపోతే ప్రతిష్టాత్మకమైన అవార్డు కాబట్టి, కాంపిటీషన్ ఎక్కువుంటుందని మాత్రం అనుకున్నా. నన్ను ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్‌కు కృతజ్ఞతలు. కవిత్వం వైపు రావడానికి మిమ్మల్ని ప్రేరేపించినవి ఏమిటి? నేను సెంట్ ఫిలోమినా(బోయగూడ, హైదరాబాద్) స్కూల్లో చదివినప్పుడు ఐదో తరగతిలో మాకు అమృత మేరి టీచర్ ఉండేవారు. ఎప్పుడు హాలిడేస్ వచ్చినా ఏం చేశామో రాయించేవాళ్లు. నేను రాసినవి చదివి ఇష్టపడేవాళ్లు. ఇక, కొంచెం పెద్దయ్యాక చర్చిలో ‘ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు’ పాటల పుస్తకం నన్ను ఆకర్షించింది. ఆ పదాల మృదుత్వం, వాటి అల్లిక... ఎంతో పొయెటిగ్గా ఉండేది. అలా నాకూ రాయాలనిపించింది. 2009 నుంచీ ఫేస్బుక్ మాధ్యమంగా ఎక్కువ రాయడం మొదలుపెట్టాను. అసలు కవిత్వం ఏమిటి మీకు? సమూహం బాధను నా బాధగా చేసుకోవడం; నన్ను వెంటిలేట్ చేసుకునే ఒక మార్గం; నా ఆత్మతో నేను మాట్లాడుకోవడం అనుకుంటున్నా! ఈ అవార్డు మీ తదుపరి కవిత్వం మీద ఎలాంటి ప్రభావం చూపగలదు? ఇది మంచి ఎంకరేజ్మెంట్ నాకు. ఇంకెక్కువ రాయడానికి ఉత్సాహం ఇస్తుంది. ఇంకా సమస్యల గురించి ఎక్కువ స్పందించాలనీ, నా గొంతును పెంచాలనీ అనుకుంటున్నా. నా బాధ్యతను మరింత పెంచింది అనుకుంటున్నా. -
కేంద్ర సాహిత్య అకాడమీలో పూడూరి రాజిరెడ్డి ముచ్చట!
తన కథను ఆంగ్లంలో చదివి వినిపించిన రాజిరెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించిన యువ సాహితీ–ది న్యూ హార్వెస్ట్ కార్యక్ర మంలో యువ రచయిత, ‘సాక్షి’ సాహిత్య పేజీ ఇన్చార్జి పూడూరి రాజిరెడ్డి తాను రాసిన కథను ఆంగ్లంలో వినిపించారు. 40 ఏళ్లలోపు వయసు గల రచయితలను ప్రోత్స హించేందుకు కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించిన ఈ కార్యక్ర మంలో పాల్గొనేందుకు తెలుగు భాష నుంచి పూడూరి రాజిరెడ్డికి ఆహ్వానం లభించింది. ఇలా 24 భాషలకు సంబంధిం చిన యువ రచయితలకు ఆహ్వానం రాగా వారు వారి ప్రచురణలను ఆంగ్లంలో చదివి వినిపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగపురానికి చెందిన పూడూరి రాజిరెడ్డి 2009లో ‘చింతకింది మల్లయ్య ముచ్చట’ శీర్షికతో రాసిన కథ ‘సాక్షి’ ఫన్డే మ్యాగజైన్లో ప్రచురితమైంది. ఈ కథను రాజిరెడ్డి ఎంచుకుని యువ సాహితీ కార్యక్రమంలో ఆంగ్లంలో ‘హీరో ఆఫ్ నాన్ స్టోరీ’ శీర్షికన చదివి వినిపించారు. ఈ కథలో కథానాయకుడు మల్లయ్య జీవితంలో నాటకీయతను చొప్పించకుండా మల్లయ్యకు ఉన్న తనదైన అస్తిత్వం, ఉనికిని కాపాడుతూ కథనం సాగుతుంది. మనిషిని మనిషిగా గుర్తించకుండా నాటకీయ తను చొప్పించే ప్రయత్నాలను వ్యంగ్యంగా చిత్రిస్తూ సాగుతుందీ కథనం.