పురస్కార స్పందన
తేలికగా రాయడం కూడా కష్టమే!
కేంద్ర సాహిత్య అకాడెమీ ‘బాల సాహిత్య పురస్కార్ –2017’ గెలుచుకున్న వాసాల నరసయ్యతో సాక్షి ప్రతినిధి జరిపిన చిరు సంభాషణ:
ఈ అవార్డు రావడం పట్ల మీ స్పందన ఏమిటి?
చాలా సంతోషంగా ఉన్నది. ఐదో తరగతి చదివేటప్పుడు సౌగంధిక హరణం అనే వీధి నాటకం రాసినుంటి. అది మొదలు బాలల కోసం 28 పుస్తకాలు రాసిన. 1955లో నా విద్యార్థి దశ నుంచీ చేసిన కృషికి ఇది ఫలితం అనుకుంటున్నా. న్యాయ నిర్ణేతలకు ధన్యవాదాలు.
బాల సాహిత్యంలోకే ఎందుకు వచ్చారు?
ఇండ్ల లేరెక్కువ మంది. మంచి అభిప్రాయం లేదు చాలా మందికి. పెద్దపెద్దవాళ్లు ఎవలూ దీన్ని ముట్టుకోలేదు. పిల్లలు మన సంపద. వాళ్లు సంస్కార వంతంగా ఎదగాలే. వాళ్లు బాగుంటెనే మనం మంచిగుంటం. దేశం, గ్రామం, కుటుంబం... అన్నీ పిల్లల ప్రవర్తన మీద ఆధారపడి వుంటయి. అందుకే దీన్ని ఎంపిక చేసుకున్న.
బాల సాహిత్యానికీ ఇతర సాహిత్యానికీ ప్రధానమైన తేడా ఏమిటనుకుంటున్నారు?
నిత్య జీవితంలో ఉన్న వ్యవహారాలు, మోసాలు, క్లాస్‌రూమ్‌లో జరిగే సంఘటనలు, స్నేహితంలో జరిగే సంఘటనలు... వేటితోనైనా పిల్లలకు కథ చెప్పొచ్చు. ప్రౌఢ సాహిత్యాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. పిల్లలకు తేలిక పదాలు, చిన్న చిన్న వాక్యాలు రాయాలి. తేలికగా రాయడం కూడా కష్టమే!
పిల్లల కథల్లో నీతి విధిగా ఉండాలంటారా?
ఏది రాసినా నీతిని బోధించేట్టుగానే ఉండాలె. కథ మామూలుగా చెబుతాం. చివరికి రెండు వాక్యాలుంటాయి అంతే. డైరెక్టుగానో ఇన్‌డైరెక్టుగానో నీతి అయితే ఉండాలె.
కవిత్వమంటే ఆత్మతో మాట్లాడుకోవడం!
మాటల మడుగు కవితా సంకలనానికిగానూ 2017 సంవత్సరపు కేంద్ర సాహిత్య అకాడెమీ ‘యువ పురస్కార్’ గెలుచుకున్న మెర్సీ మార్గరెట్‌తో సాక్షి ప్రతినిధి జరిపిన చిరు సంభాషణ:
ఈ అవార్డు వస్తుందని ఊహించారా?
అస్సలు అనుకోలేదు. కాకపోతే ప్రతిష్టాత్మకమైన అవార్డు కాబట్టి, కాంపిటీషన్ ఎక్కువుంటుందని మాత్రం అనుకున్నా. నన్ను ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్‌కు కృతజ్ఞతలు.
కవిత్వం వైపు రావడానికి మిమ్మల్ని ప్రేరేపించినవి ఏమిటి?
నేను సెంట్ ఫిలోమినా(బోయగూడ, హైదరాబాద్) స్కూల్లో చదివినప్పుడు ఐదో తరగతిలో మాకు అమృత మేరి టీచర్ ఉండేవారు. ఎప్పుడు హాలిడేస్ వచ్చినా ఏం చేశామో రాయించేవాళ్లు. నేను రాసినవి చదివి ఇష్టపడేవాళ్లు. ఇక, కొంచెం పెద్దయ్యాక చర్చిలో ‘ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు’ పాటల పుస్తకం నన్ను ఆకర్షించింది. ఆ పదాల మృదుత్వం, వాటి అల్లిక... ఎంతో పొయెటిగ్గా ఉండేది. అలా నాకూ రాయాలనిపించింది. 2009 నుంచీ ఫేస్‌బుక్ మాధ్యమంగా ఎక్కువ రాయడం మొదలుపెట్టాను.
అసలు కవిత్వం ఏమిటి మీకు?
సమూహం బాధను నా బాధగా చేసుకోవడం; నన్ను వెంటిలేట్ చేసుకునే ఒక మార్గం; నా ఆత్మతో నేను మాట్లాడుకోవడం అనుకుంటున్నా!
ఈ అవార్డు మీ తదుపరి కవిత్వం మీద ఎలాంటి ప్రభావం చూపగలదు?
ఇది మంచి ఎంకరేజ్‌మెంట్ నాకు. ఇంకెక్కువ రాయడానికి ఉత్సాహం ఇస్తుంది. ఇంకా సమస్యల గురించి ఎక్కువ స్పందించాలనీ, నా గొంతును పెంచాలనీ అనుకుంటున్నా. నా బాధ్యతను మరింత పెంచింది అనుకుంటున్నా.