అరువు తెచ్చుకున్న హాస్యం!
కథ బలహీనంగా ఉన్నా, కథనం పేలవంగా ఉన్నా... హాస్యం సినిమాని నిలబెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే రచయితలు, దర్శకులు కామెడీ పైన బాగా ఆధారపడుతున్నారు. అలా అని అసలు కథే లేకుండా కామెడీతో సరిపెట్టుకోమంటే ఒప్పుకోరు ప్రేక్షకులు. అందుకే కాస్త బలమున్న కథకు, మంచి కామెడీని అద్ది అందించే ప్రయత్నం చేసు ్తన్నారు దర్శకులు. అలాంటి ఓ ప్రయత్నమే ‘అహ నా పెళ్లంట’!
ఇదే పేరుతో గతంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా జంధ్యాల తీసిన చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. మళ్లీ అదే పేరుతో 2011లో దర్శకుడు వీరభద్రమ్ ఓ చిత్రాన్ని తీశారు. అల్లరి నరేశ్ హీరో. హాస్య చిత్రమే అయినా... చక్కని కథా బలం, మనసుకు హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి ఇందులో. అయితే అవేవీ ఒరిజినల్ కాదు. ఒక కొరియన్ సినిమా నుంచి కొట్టుకొచ్చినవి!
అల్లరి నరేశ్ ఓ పెద్ద కంపెనీలో పని చేస్తుంటాడు. చేతినిండా డబ్బు... అందమైన గాళ్‌ఫ్రెండ్... జీవితం ప్రశాంతంగా సాగిపోతోంది అనుకుం టున్న సమయంలో ఓ రోజు... పార్టీలో బాగా తాగి ఇంటికి వెళ్లి పడుకుంటాడు. ఉదయం లేచేసరికి పక్కన హీరోయిన్ ఉంటుంది. తను ఎవరో, అక్కడికెలా వచ్చిందో అర్థంకాదు. ఆమెనడిగితే తనకూ తెలియదంటుంది. అవమానంతో ఏడుస్తూ వెళ్లిపోతుంది. తర్వాతి రోజు హీరోయిన్ అన్నలు నరేశ్‌ని వెతుక్కుంటూ వస్తారు.
తమ చెల్లెలిని పెళ్లి చేసుకొమ్మని కొడతారు. తెలిసి చేయలేదని ఎంత చెప్పినా వినరు. దాంతో హీరోయిన్‌ని కలిసి, వైద్య పరీక్షలు చేసుకొమ్మని కోర తాడు నరేశ్. టెస్ట్ చేస్తే ఇద్దరి మధ్య ఏం జరగలేదని తెలుస్తుంది. ఆ విషయం అన్నలకు చెప్పడానికి ఊరు వెళ్తారు. అప్పటికే వాళ్లిద్దరికీ పెళ్లి కుదిరిపోతుంది. ఆ పెళ్లి చెడగొట్టుకుని ఎలాగైనా తన గాళ్‌ప్రెండ్‌ను పెళ్లి చేసుకోవాలని నరేశ్ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ క్రమంలో తనలాంటి మంచి కుర్రాడు తమ చెల్లెలికి భర్త కావాలన్న ఉద్దేశంతో హీరోయిన్ అన్నలే ఇదంతా ప్లాన్ చేశారని తెలీడం, గాళ్‌ఫ్రెండ్ కూడా మంచిది కాదని తెలీడం, హీరోయిన్ పట్ల ప్రేమ పుట్టడం, ఆమెనే పెళ్లి చేసుకోవడం జరుగుతుంది.
ఇదీ ‘అహ నా పెళ్లంట’ కథ. ఈ కథ తాము వండిందే అని చిత్ర దర్శకుడు తన పేరు వేసుకున్నా, అది ఏమాత్రం నిజం కాదు. ఆల్రెడీ కొరియన్‌వాళ్లు వండినదాన్ని తెచ్చి ప్లేటులో పెట్టి మన ప్రేక్షకులకు వడ్డించేశారంతే. ‘గమునియ్ యాంగ్ వాంగ్’ అనే కొరియన్ సినిమాని 2002లో ‘మ్యారీయింగ్ ద మాఫియా’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ఒరిజినల్ చూసి ఇన్‌స్పయిర్ అయ్యారో, అనువాదం చూసి ముచ్చటపడ్డారో తెలియదు కానీ... అమాంతం ఎత్తుకొచ్చి‘అహనా పెళ్లంట’గా తీసేశారు. కథతో పాటు కథనాన్నీ మొహ మాటపడకుండా దింపేశారు.
మోగుతున్న అలారాన్ని ఆపి, లేచి, కళ్లజోడు పెట్టుకుని, తన కాలు అనుకుని హీరోయిన్ కాలుని గోకుతాడు హీరో. అప్పుడే తన పక్కన ఒకమ్మాయి పడుకుని ఉందని తెలుస్తుంది. దీన్ని అచ్చంగా తీసేశారు. చివరికి అక్కడి హీరోకి కళ్లజోడు ఉందని ఇక్కడ కూడా వాడటం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఇక హీరోయిన్ అన్నలు హీరోని ముప్పు తిప్పలు పెట్టడం, వాళ్లతో హీరో తన కుటుంబానికి మీటింగ్ ఏర్పాటు చేయడం, హీరో హీరోయిన్లు దగ్గరయ్యే సమయానికి గాళ్‌ఫ్రెండ్ వచ్చి డిస్టర్బ్ చేయడం లాంటి సన్నివేశాలన్నీ మనవాళ్లు బయటకు చెప్పని మాతృకలో ఉన్నవే. హీరోయిన్ తండ్రికి చెస్ ఆడే అలవాటుంటుంది. అది పెట్ట డానికి కారణం... ఒరిజినల్‌లో హీరోయిన్ తండ్రికి రాళ్లతో ఆడే ఒక రకమైన ఆట అంటే ఇష్టం కావడమే.
ఇలా చాలా సీన్లు దించేశారు. పలు చోట్ల సంభాషణలు కూడా ఒకేలా ఉంటాయి. అయితే తెలుగులో దర్శకుడు కామెడీ డోస్ బాగా పెంచారు. నరేశ్‌కి బాస్‌గా బ్రహ్మా నందం క్యారెక్టర్‌ని హైలైట్ చేసి కడుపుబ్బ నవ్వించారు. హీరో మంచితనాన్ని హీరో యిన్ అర్థం చేసుకునే సన్నివేశాల్ని ఆకట్టు కునేలా తీశారు.
అలాగే క్యారెక్టరయి జేషన్‌సలోనూ మార్పు చేశారు. మాతృకలో హీరోయిన్ తండ్రి, అన్నలు గ్యాంగ్‌స్టర్స్ అయినా కామెడీగా కనిపిస్తారు. కానీ తెలుగులో వాళ్లను సీరియస్‌గా చేశారు. నాగినీడుతో తండ్రి, శ్రీహరితో పెద్దన్నయ్య పాత్రలు చేయించారు. దాంతో పాత్రలు బరువెక్కి ఆకట్టుకున్నాయి. ఈ విధంగా కొన్ని మార్పులైతే చేశారు. కాకపోతే ముఖ్యమైన సన్నివేశాలన్నీ మాత్రం ఎత్తుకొచ్చారు. ఏదైతేనేం, సినిమా హిట్టు కాబట్టి కాపీ సంగతి మర్చిపోవడమే!