అన్న చెల్లెళ్ల బంధం గురించి సినీ కవులు, రచయితలు ఎన్ని గీతాలు, కథలు రాసినా, డెరైక్టర్లు వాటిని ఆకట్టుకునేలా తెరపై ప్రదర్శించినా నిజమైన బంధానికి ఎంతమాత్రం సాటిరావు. బుడి బుడి అడుగుల వయసులో వేలు పట్టుకొని నడిపించిన అన్నయ్య, కొంచెం పెద్దయ్యాక బాగోగులు చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడిన అన్నయ్య అంటే చెల్లికి అమితమైన ప్రేమ.
కర్నూలు(కల్చరల్), న్యూస్‌లైన్: అన్న చెల్లెళ్ల బంధం గురించి సినీ కవులు, రచయితలు ఎన్ని గీతాలు, కథలు రాసినా, డెరైక్టర్లు వాటిని ఆకట్టుకునేలా తెరపై ప్రదర్శించినా నిజమైన బంధానికి ఎంతమాత్రం సాటిరావు. బుడి బుడి అడుగుల వయసులో వేలు పట్టుకొని నడిపించిన అన్నయ్య, కొంచెం పెద్దయ్యాక బాగోగులు చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడిన అన్నయ్య అంటే చెల్లికి అమితమైన ప్రేమ. పెళ్లయ్యాక అత్తారింటికి వెళ్లే సమయంలో అన్నయ్య భుజం మీద వాలిపోగానే అలవోకగా ఆ చెల్లి కళ్ల నుంచి జాలువారిన నీరు, ఇంటికి తిరిగొచ్చిన అన్నయ్యను చూసి హర్షాతిరేకంతో అన్నయ్యొచ్చాడంటూ కేకలేసిన చెల్లి అత్తారింటికి వెళ్లిపోగా మూగబోయిన గుమ్మాన్ని చూసిన క్షణంలో అన్నయ్య కళ్ల నుంచి వచ్చే నీరు వారిమధ్య ఆత్మీయ బంధానికి నిదర్శనం. అమ్మ నాన్న తర్వాత తనను అంతగా అక్కున చేర్చుకుని అన్నీ అమర్చే ఒకే ఒక వ్యక్తి అన్నయ్యే. పాలమీగడలా, వెన్నెల తరగలాంటి స్వచ్ఛమైన అన్నా చెల్లెళ్ల అనురాగ బంధానికి అపురూప వేడుకగా ఏడాదికి ఓసారి రక్షాబంధన్‌ను నిర్వహించుకుంటారు. ఉత్తర భారత దేశంలో ప్రారంభమైన ఈ వేడుక దక్షిణాదిరాష్ట్రాల్లో కూడా ఘనంగా జరుగుతోంది. నేడు ఆ రోజు రానే వచ్చింది.