దేనికైనా సమయం, సందర్భం ఉండాలంటారు. అవి లేకుండా ఏ పనైనా చేస్తే? పాతికేళ్ళుగా తమ దేశం నుంచి అత్యున్నత స్థాయివారెవరూ పర్యటించని తైవాన్‌కు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ వెళతారనడం అలాంటిదే. ఆ వార్త తేనెతుట్టెను కదిలించింది. అమెరికా అధ్యక్షపదవికి తూగే హోదాలో ఉన్న ఆమె ఆసియా దేశాల పర్యటనలో భాగంగా తైవాన్‌నూ సందర్శిస్తారనడంతో చైనాకు పుండు మీద కారం జల్లినట్టయింది.
జూలై 28న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సంభాషిస్తూ, తైవాన్‌తో చైనా వ్యవహారంలో పరాయివారి జోక్యం సహించబోమని గట్టిగా చెప్పడం దాని పర్యవసానమే. వారాంతంలో తైవాన్ సమీపాన సాయుధ సైనిక విన్యాసాలకూ డ్రాగన్ దిగడంతో పరిస్థితి వేడెక్కింది. అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతకు ఆజ్యం పోసింది. అసలే ఉక్రెయిన్‌లో యుద్ధంతో కిందా మీదా అవుతున్న ప్రపంచ దేశాలను ఉలిక్కి పడేలా చేసింది.
పసిఫిక్ మహా సముద్రంలో చైనాకు ఆగ్నేయ తీరంలో వంద మైళ్ళ దూరంలోని ఒక చిన్న ద్వీపమైనా తైవాన్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. భౌగోళికంగా అమెరికా విదేశాంగ విధానానికి కీలకమైన స్నేహపూర్వక ద్వీపాల గొలుసుకట్టు మధ్య అది నెలకొంది. తైవాన్‌ను గనక చైనా స్వాధీనం చేసుకుంటే, పశ్చిమ పసిఫిక్‌లో దాని పట్టు బిగుస్తుంది. సుదూర గువామ్, హవాయ్‌ల లోని అమెరికా సైనిక స్థావరాలకూ అది ముప్పే. చైనా మాత్రం తమకలాంటి ఉద్దేశం లేదంటోంది. 1949లో చైనాలో అంతర్యుద్ధంతో కమ్యూనిస్టు పాలన వచ్చినప్పటి నుంచి తైవాన్ ప్రత్యేకంగా ఉంటోంది.
సొంత రాజ్యాంగం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేతలతో స్వతంత్ర దేశంగా అడుగులు వేస్తోంది. వాటికన్ కాక, ఇప్పటికి ప్రపంచంలో 13 దేశాలే తైవాన్ సార్వ భౌమాధికారాన్ని గుర్తిస్తున్నాయి. అమెరికా, భారత్ సహా పలు దేశాలు ‘వన్ చైనా పాలసీ’కే కట్టు బడ్డాయి. ఇతర దేశాలేవీ ఆ ద్వీపదేశాన్ని గుర్తించకుండా ఉండేలా చైనా దౌత్యపరమైన ఒత్తిడి పెడుతూనే ఉంది.
స్వపరిపాలన సాగిస్తున్నప్పటికీ తైవాన్ తమ నుంచి విడిపోయిన ప్రావిన్స్ అనీ, అది తమలో భాగమనీ మొదటి నుంచీ చైనా వైఖరి. అవసరమైతే బలప్రయోగం ద్వారానైనా సరే దాన్ని తమలో ‘పునరేకీకరించే’ లక్ష్యాన్ని సాధించి తీరాలనేది జిన్‌పింగ్ మాట. కానీ, అవసరమైతే బలగాలను దించి మరీ, తైవాన్‌ను తాము కాపాడడానికి సిద్ధమని బైడెన్ ఆ మధ్య అన్నారు. వాస్తవానికి తైవాన్‌పై చైనా దాడికి దిగితే సైనిక జోక్యం చేసుకోవాలా, వద్దా అనే అంశంలో అగ్రరాజ్యం అమెరికా దీర్ఘకాలంగా ‘వ్యూహాత్మక సందిగ్ధత’ విధానాన్నే అనుసరిస్తోంది. బైడెన్ మాటలు ఏమైనప్పటికీ, తమ వైఖరిలో మార్పు లేదని వైట్‌హౌస్ వర్గాలే తేల్చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉరుము లేని పిడుగులా అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌కు వెళతారనే వార్త తాజా తలనొప్పి తెచ్చిపెట్టింది. ఇంతలో ఆదివారం మొదలైన ఆమె పర్యటన షెడ్యూల్‌లో ఇప్పటికైతే సింగపూర్, మలేసియా, దక్షిణ కొరియా, జపాన్ తప్ప తైవాన్ సందర్శన ప్రస్తావన లేకపోవడం ఊరట.
వర్తమాన ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మధ్య సంబంధాలు 2017 –21 మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హయాం నుంచి శరవేగంగా క్షీణిస్తూ వచ్చాయి. ఇరు దేశాల సంబంధాలు అలా ఉన్నా, అధినేతల స్థాయిలో రెండు గంటల పైగా గత వారం సంభాషణ సాగడం ఓ సాంత్వన. వాతావరణ మార్పు లాంటి వైరుద్ధ్యాలు లేని అంశాలపై చైనాతో మాటామంతీ జరుపుతూనే, దూకుడుకు పగ్గం వేయాలని బైడెన్ ఆలోచన. ఆంక్షలను సడలించేలా ఒప్పించి, అమెరికాకు చైనా సమస్కంధ అగ్రరాజ్యమని అంగీకరింపజేయాలనేది జిన్‌పింగ్ భావన. కానీ, ఎవరూ పట్టు సడలించడం లేదు.
నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలున్న బైడెన్ కానీ, ఈ ఏడాదిలోనే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ 20వ మహాసభలున్న జిన్‌పింగ్ కానీ తమ వారి ముందు తగ్గేదేలే అన్నట్టుగానే ఉండాలనుకోవడంతో చిక్కొచ్చి పడుతోంది. ఈ ఏడాది చివరలో ఇద్దరు అధినేతలూ ప్రత్యక్షంగా కలసి, చర్చించుకొనే సూచనలున్నాయి. అయితే, కొన్నేళ్ళుగా ఇరుదేశాల మధ్య రగులుతున్న తైవాన్ అంశం మళ్ళీ తెర పైకి వచ్చి, ఉద్రిక్తతలు పెంచుతోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో, మరీ ముఖ్యంగా తైవాన్‌లో శాంతిభద్రతలు, ఆర్థిక వ్యవస్థ సుస్థిరత ప్రపంచానికి అవసరం. జీ7, నాటో, ఈయూ, క్వాడ్ దాకా అన్నీ ఆ మాటే గుర్తుచేస్తున్నాయి. ఎందుకంటే, కంప్యూటర్ చిప్‌ల ప్రపంచ ఉత్పత్తిలో తైవాన్‌దే అగ్రస్థానం. ప్రపంచమంతా వాడే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వాచీలు, గేమ్స్ కన్సోల్స్‌లోని ఎలక్ట్రానిక్ సామగ్రికి గుండె లాంటి కంప్యూటర్ చిప్‌లన్నీ తైవాన్ తయారీయే. ప్రపంచ మార్కెట్‌లో సగానికి పైగా ఒకే ఒక్క తైవానీ సెమీకండక్టర్ కంపెనీదే అని లెక్క. కొంతకాలంగా తరచూ తైవాన్‌లో గగనతల చొరబాట్లు సాగిస్తున్న చైనా గనక ఆ దేశాన్ని చేజిక్కించుకుంటే, ప్రపంచంలోని అతి ప్రధాన పరిశ్రమల్లో ఒకటి దాని వశమైనట్టే!
అందుకే, తైవాన్‌లో చీమ చిటుక్కుమన్నా ఆ ప్రభావం అంతటా కనిపిస్తుంది. నిజానికి, చైనా, అమెరికా, తైవాన్‌లు మూడూ స్థూలంగా ప్రస్తుత యథాతథ స్థితి వైపే మొగ్గుతున్నాయి. కాకపోతే, ఎవరికి వారు అవతలివాళ్ళు దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. అసలే కరోనాతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ అతలాకుతలమైన పరిస్థితుల్లో యథాతథ స్థితిని కొన సాగనివ్వక ఎవరు కవ్వింపు చర్యలకు దిగినా, జిన్‌పింగ్ వేరే సందర్భంలో అన్నట్టు అది నిప్పుతో చెలగాటమే! అలాంటి అవివేక చర్యలను అనుమతించడం ప్రపంచ దేశాలన్నిటికీ ఆత్మహత్యా సదృశమే!
Comments
Please login to add a commentAdd a comment