‘కరపత్ర’ పేరుతో పలువురికి లేఖలు రాస్తూ సేవ
‘యూత్‌ఫుల్’ పుస్తకాలతో ఆకట్టుకుంటున్న తోబుట్టువులు
యంగ్ రైటర్స్‌కు స్ఫూర్తిగా నిలుస్తున్న ప్రవళిక, ప్రవర్ష్
వారిది ఓ మధ్యతరగతి కుటుంబం.. ఇద్దరూ అక్కా, తమ్ముళ్లు.. చిన్నప్పటి నుంచీ ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నారు.. వారి ముందుతరాల్లో ఎవరికీ పుస్తకాలు రాయడమనే మాటే తెలియదు.. అసలు వాటిని చదవడమే గగనమైన కుటుంబం నుంచి వచ్చారు.. అనూహ్యంగా ఇద్దరికీ తెలుగుపై మమకారం పెరిగింది. సాధారణంగా బీటెక్ చదువుకున్న వారిలో చాలా మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తూ కాలం గడిపేస్తుంటారు. కానీ వీరిద్దరూ అందుకు భిన్నం. అక్క ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుకోగా.. తమ్ముడేమో విశాఖలోని గీతమ్ యూనివర్సిటీలో బీటెక్ చదివాడు. కానీ వీరిద్దరూ భాషలో పట్టు సాధించి పుస్తకాలు రాస్తూ తమకు తోచినంతలో తెలుగుకు సేవ చేస్తున్నారు. అక్కా, తమ్ముళ్లు ప్రవళిక, ప్రవర్ష్ జర్నీ ఒక్కసారి చూద్దాం.. – సాక్షి, సిటీబ్యూరో
తెలుగులో రాయాలనే ఆకాంక్ష అయితే ఉంది.. కాకపోతే పుస్తకాలు రాయడం ఇంట్లో ఎవరికీ అలవాటు లేదు. దీంతో వినూత్నమైన ఆలోచన వారి మదిలో మెదిలింది. 2017లో ‘కరపత్ర’ పేరుతో అవసరం ఉన్న వారికి లేఖలు రాయడం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు విషయంలో మహేశ్‌పోలోజు అనే మరోరచయిత వీరిద్దరికీ తోడయ్యాడు. వీరు ముగ్గురూ కలసి దాదాపు వెయ్యికి పైగా ఉత్తరాలు రాసిచ్చారు. లేఖలు అందుకున్న వారు అభినందనలతో ముంచెత్తడంతో రచయిత కావాలనే తృష్ణ వారిలో మరింత పెరిగింది.
ఛాయాదేవి చెత్త కథలు..
ప్రవళిక తొలిసారిగా 2017 సమయంలోనే ‘ఛాయాదేవి చెత్త కథలు’ పేరుతో తన తొలి పుస్తకాన్ని తీసుకొచి్చంది. అక్కను స్ఫూర్తిగా తీసుకుని ప్రవర్ష కూడా తన తొలి పుస్తకాన్ని ‘కథనై.. కవితనై’ పేరుతో వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రవళిక మరో పుస్తకాన్ని ఇప్పటికే పూర్తి చేయగా, ప్రవర్ష్ ‘అభినిర్యాణం’ పేరుతో రెండో పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించారు.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా..
ప్రవర్ష్ మూడేళ్లు ఓ ఐటీ కంపెనీలో జాబ్ చేశాడు. కానీ తనకు అస్సలు సంతృప్తినివ్వలేదు. ఇక తనకు ఇష్టమైన రంగంలో రాణించాలని నిర్ణయించుకుని ఆ జాబ్ మానేసి పుస్తకాలు రాయడం ప్రారంభించాడు. పుస్తక రచయిత మాత్రమే కాదు.. అటు సినిమాలకు పాటలు రాయడం హాబీగా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఓ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment