
కథ: నా పాఠకునితో నేను
నా జీవితంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన ఇది. సాధారణంగా గొప్ప రచయితల జీవితాలలో ఇలాంటివి జరుగుతుంటాయి. మన్నించండి. నేనేమీ అంత గొప్పవాడిని కాదు. బహుశా భవిష్యత్తులో ఎప్పుడైనా అయితానేమో! నా ప్రముఖ పుస్తకాలలో ఒకదానిని చదువుతున్న పాఠకునితో నా పరిచయం గురించి చెప్పడం ఇది. అయితే, ఇలాంటి అనుభవాలను ప్రపంచానికి ముందెవరూ చెప్పినట్లు నాకు గుర్తు రావడం లేదు. ఈ అవకాశం నేనే తీసుకుంటాను. ఇలా చెప్పడం నాకు అంతులేని సంతోషాన్నిస్తోంది.
‘‘నీకిష్టమైన రచయితలు ఎవరు?’’ అడిగాను. చాలా పేర్లు చెప్పాడు. ఆ పేర్లన్నీ రాయడం మర్యాద కాదు. వారిలో ఒకరు కవి. ఆయన కవిత్వం చదివాడు అతను. నాకెంతో సంతోషమైంది. ‘‘ఆ కవిలో ఏమి నచ్చింది?’’ అని అడిగాను.
హిలైర్ బెల్లాక్ (1870-1953)
హిలైర్ బెల్లాక్ గొప్ప ఇంగ్లిష్ రచయిత. ఆధునికతలో పాత విలువల రక్షణ కొరకు పోరాడిన వ్యక్తి. యువకుడిగా ఆయన చెష్టర్‌టన్, హెచ్.జి.వెల్స్, జార్జి బెర్నాడ్‌షా లాంటివాళ్లతో గడిపారు. ఆయన కవి, నవలాకారుడు మరియు పాత్రికేయుడు కూడా. ఆయన రాసిన ‘కాషనరీ టేల్స్ ఫర్ చిల్డ్రన్’ ప్రపంచ వ్యాప్తంగా చదువుతుంటారు. ‘మటిల్డా, హూ టోల్డ్ లైస్ అండ్ బర్న్‌డ్ టూ డెత్’ నాలుగు కాలాల పాటు రక్షించుకోవలసిన అద్భుత పుస్తకం. వివిధ అంశాలపై ఆయన అనేక పత్రికలలో వ్యాసాలు రాశారు. ఒక మంచి ఆలోచన వచ్చింది నాకు. ఒక దేవదూతే ఆ ఆలోచన కలిగించి ఉంటుంది.‘‘మీతో ఎక్కువ చనువు తీసుకోవడం లేదనుకుంటే, నేను మీ పుస్తకం కొనవచ్చా?’’ అని అడిగాను. ‘‘అదంత బాగుండదేమో!’’ అన్నాడు అతను.
చాలా సంవత్సరాల క్రిందటి మాట. నేను గ్రేట్ వెస్టరన్ రైల్వేలో బర్మింగ్‌హామ్ నుండి లండన్‌కు పోతున్నాను. నేను మూడవ తరగతి బోగీలో ప్రయాణం చేస్తున్నాను. పొగ తాగే బోగీ అది. నాతో పాటు ఇంకొందరు మాత్రమే అందులో ఉన్నారు. అతని దగ్గర ఉండే నల్లటి సంచి, అతని వాలకం చూస్తే, వ్యాపార నిమిత్తం ప్రయాణం చేస్తున్న వ్యక్తిలా ఉన్నాడు. అయితే... అతను ఎవరైనా అయి ఉండొచ్చు. పబ్ మేనేజరు అయి ఉండొచ్చు. ఉరి తీసే మనిషి కూడా కావచ్చు. బలమైన ముఖం అతడిది. చాలా బాగుంది కూడా. చేతులు బలంగా ఉన్నవి. మంచి నడవడిక కలవాడనిపిస్తుంది. ఆకు రాలే కాలం తొలి రోజులవి. వాతావరణం వెచ్చగా ఉంది. అలాంటి వాతావరణంలో నాకొక తోడున్నందుకు ఎంతో హాయిగా ఉంది. బాగా హుషారుగా ఉంది ఆ సమయంలో. నాతోటి ప్రయాణికుడి చేతిలో పుస్తకం చూసి, నా తల తిరిగినట్లయింది. నేను రాసిన ఎన్నో వ్యాసాల పుస్తకాలలో అదొకటి.
నాలో నాకే ఇలా అనిపించింది. నిజంగా కీర్తి ప్రతిష్ఠలంటే ఇవే. నేను అందరికీ తెలుస్తున్నాను. అతడు సాధారణ జనాలకు ఒక ప్రతిరూపం. అతడు నా పుస్తకం చదువుతున్నందుకు, అతడంటే నాకెంతో ఇష్టం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ అందమైన ఇంగ్లండు ద్వీపంలో వందల మంది నా పుస్తకాలు చదువుతుంటారు అనిపించింది. ఏదో ఒకటి చదువుతుంటారు. పుస్తకాలు చదివి చదివి చినగకొడుతుంటారు. మళ్లీ మళ్లీ కొంటుంటారు. స్నేహితులతో చెపుతుంటారు. ఎక్కువ ఎక్కువగా కాపీలు అమ్ముడుపోతుంటాయి. ప్రపంచమంతా మారింది. ఆఖరుకు నా రోజు కూడా వచ్చింది. ఇందులో ఎలాంటి అనుమానమూ లేదు.
ఎంతో సంతోషంగా ఉన్నదప్పుడు. ఒకలాంటి నిట్టూర్పుతో అతడు ఆ పుస్తకం మురికి సంచీపై పడేశాడు! నావైపు చూసి, ‘‘చెత్త సరకు’’ అన్నాడు.
‘‘అవును’’ అన్నాను నేను. ‘‘ఎందుకు ఆ పుస్తకం చదవాలనుకున్నావు?’’
‘‘నాకేమీ తెలియదు’’ అని జవాబిచ్చాడు. కొంచెం సేపు మౌనంగా ఉన్నాడు.
‘‘నేను పుస్తకాల షాపుకెళ్లాను. షాపాయన ఈ పుస్తకం చదవమన్నాడు. బహుశా ఆయన పొరపాటున ఈ పుస్తకాన్ని ఇంకొక పుస్తకమనుకొని ఇచ్చివుంటాడు. ఏమైతేనేమి, ఒక షిల్లింగ్ వృథా అయింది’’ అని అన్నాడు అతను.
‘‘ఎవరు రాసిందీ?’’ అని అడిగా.
‘‘నాకేమీ తెలియదు’’ అని అయిష్టంగా జవాబిచ్చాడు. పుస్తకం తీసుకొని, చాలా పేలవంగా నా పేరు తప్పుగా పలికాడు. మళ్లీ పుస్తకాన్ని పడేశాడు. ‘ఆ...’ నిట్టూర్చాడు మళ్లీ.
‘‘అయినా చిత్రంగా ఉంది. ప్రయాణంలో చదవాలనుకోవడమేమిటి? నాకూ ఎందుకో చదవాలనిపించింది. ఈ చెత్త చదవలేకున్నాను’’ అన్నాడతను.
అతడు కోపంతో రగిలిపోతున్నాడు. బహుశా పుస్తకం గురించి కాకపోవచ్చు. పుస్తకానికి ఖర్చుపెట్టిన షిల్లింగు గురించి అనిపించింది.
‘‘ఏముంది అందులో?’’ అని అడిగాను.
‘‘నాకేమీ తెలియదు. నాకేమీ అర్థం కాలేదు’’ అన్నాడు.
మళ్లీ పుస్తకం తీసుకొని పేరు చూశాడు. ‘‘పుస్తకం పైన చూస్తే ఏమీ అర్థం కాలేదు. తెలివి లేనిదంతా ముద్రించారు. ఎలాంటి కథ లేదు, కమామిషూ లేదు. పత్రికలలో పడిన వ్యాసాలు కలిపి పుస్తకంగా వేశారు’’ అన్నాడు.
అతడి మాటలు చాలా బాధించాయి. నిజంగా అవి పత్రికల్లోని వ్యాసాలే! బతుకుదెరువు కోసం పత్రికలలోని వ్యాసాలను పుస్తకంలా వేశాము.
అతడిలో కాస్త ఉత్సాహం వచ్చింది. నాతో మాట్లాడాలనే కుతూహలం కనిపించింది.
‘‘అసలు ఇలాంటి పుస్తకాలు ఎందుకు ప్రచురిస్తారు?’’ ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘బహుశా డబ్బుకోసం’’ అన్నాను నేను.
‘‘ఉండొచ్చు. అయినా ఇందులో ఏమంత డబ్బు కూడా లేదు’’ అన్నాడు అతను. ‘‘ఈయనను గురించి ఎప్పుడూ వినలేదు. ఇతడిని గురించి ఇంకెప్పుడూ వినాలని కూడా లేదు’’ కిటికీలో గుండా దిగులుగా చూశాడు.
‘‘నీకిష్టమైన రచయితలు ఎవరు?’’ అడిగాను.
చాలా పేర్లు చెప్పాడు. ఆ పేర్లన్నీ రాయడం మర్యాద కాదు. వారిలో ఒకరు కవి. ఆయన కవిత్వం చదివాడు అతను.
నాకెంతో సంతోషమైంది.
‘‘ఆ కవిలో ఏమి నచ్చింది?’’ అని అడిగాను.
వెంటనే అతడిలో మరింత ఉత్సాహం వచ్చింది.
‘‘చాలా గొప్ప కవిత్వం. పదే పదే గుర్తొస్తుంటుంది. మీ ఇంగ్లిషు దేశంలో ఎవ్వరికీ ఏమీ తెలియదు’’. ‘హ్యాజ్ మేడ్ ఆజ్ వ్వాట్ వుయ్ ఆర్’ అని పాడడం మొదలెట్టాడు. ‘‘కవిత్వమంటే ఇది. ఇలా రాయాలి . అది రక్తాన్ని ఓడుస్తుంది’’.
ఇంగ్లండు దేశంలో ఎవరూ అలా రాయలేరని అతడి నమ్మకం.
మళ్లీ ఆ రచయితదే ఇంకొక పద్యం పలకడం మొదలెట్టాడు. ఈసారి ఇష్టమైన ఒక చిన్నారి గురించి. దానిని ‘సాంబోస్ ప్రయర్’ అంటారట. అది పూర్తిచేసి అలా నిట్టూర్చాడతను.
నా వైపు ఎగతాళిగా చూశాడు. తనేదో హృదయాంతరాలాల్లోనుంచి మాట్లాడుతున్నాననుకుంటూ, ‘‘వాళ్లకెలా అబ్బుతుందో ఇది మరి! పెద్ద మేధస్సు! నీవూ, నేనూ రాయలేము. గుప్పెడు బంగారు నాణ్యాలు ఇచ్చినా మనవల్ల కాదు. అది వాళ్లకే సాధ్యమవుతుంది.’’
‘‘నీవు ఆ రచయితను కలిశావా?’’ అడిగాను నేను.
‘‘దైవమా? లేదు’’ అన్నాడు ఎంతో భక్తితో. అంత గొప్ప అవకాశాలు ఈ మానవమాత్రులకు సాధ్యం కాదు అనే భావం అతనిలో కనిపించింది.
రైలు నెమ్మదిగా ఆక్స్‌ఫర్డ్‌ను సమీపిస్తున్నది. అతడు వాణిజ్యం చేసేవాడో, మత ప్రవక్తో, కమీషను ఏజెంటో... ఎవరైతేనేమి... సీటు మీద నుండి లేచాడు. సంచీ తీసుకున్నాడు. బహుశా దిగిపోతున్నాడేమో అనిపించింది.
ఒక మంచి ఆలోచన వచ్చింది నాకు. ఒక దేవదూతే ఆ ఆలోచన కలిగించి ఉంటుంది.
‘‘మీతో ఎక్కువ చనువు తీసుకోవడం లేదనుకుంటే, నేను మీ పుస్తకం కొనవచ్చా?’’ అని అడిగాను.
‘‘అదంత బాగుండదేమో!’’ అన్నాడు అతను. ‘‘ఏమీలేదు. నాకు ఇక్కడ నుండి లండన్ పోయే వరకు చదువుకోవడానికి ఏమీ లేదు. మనస్సులో రేఖాగణితం చేసి చేసి తలబొప్పి కట్టింది. బాగా అలసిపోయాను’’ అన్నాను. ‘‘ఏమి చేసుకుంటావు?’’ దీనితో అన్నాడతడు. ‘‘ఏమీలేదు. టైముపాసు కోసమే. నాకే పుస్తకమైనా ఫర్వాలేదు. ఆ పుస్తకమైనా ఒకటే.’’సంకోచిస్తూ, అతడు నా కోరికను ఒప్పుకున్నాడు. అతనో నిజాయితీపరుడు. అంత భయంకరమైన చెత్త పుస్తకానికి నేనొక షిల్లింగ్ ఇవ్వడం అతనికిష్టం లేదు. అతడు నాణేన్ని తీసుకొని పుస్తకం నాకిచ్చాడు. ఆక్స్‌ఫర్డ్‌లో ఎవరూ ఎక్కలేదు. ప్యడ్డింగ్‌టన్‌లో రైలు ఆగలేదు. నిరుత్సాహంగా పుస్తకం తెరిచాను. నా గుండె జారినట్లనిపించింది.
అతడు చెప్పింది నిజమే. ఇలాంటి దౌర్భాగ్యమైన వ్యాసాలను చూసి చాలా కాలమైందనిపించింది. అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం చదివాను. నాకే అసహ్యమనిపించింది. కొన్నిచోట్ల నటన. ఇంకొన్ని చోట్ల ఆడంబరం. మరికొన్ని చోట్ల తేలికపాటి రాతలు. ఘోరంగా ఉంది. నేను ఇలాంటి పనిచేసి ఉండాల్సింది కాదు. బాగా ఆలోచించాను. నేను ప్రతివారం ఇలాంటి వ్యాసాలను పోగుచేసి పోగుచేసి పుస్తకాలుగా వేశాను. మరీ పనిగట్టుకొని చేశాను. ఎంత దుర్దశ పట్టింది నాకు. డబ్బు ఎగరగొట్టడము, చెత్త పుస్తకం రాయడం అనే రెండు చెడ్డ పనులలో ఏదో ఒకటి నిర్ణయించుకోమంటే... చెత్త పుస్తకం రాయడాన్నే ఎంచుకుంటాను నేను. కంపు కొట్టే లండన్ పొలిమేరలు వచ్చే లోపే, దక్షిణ ఇంగ్లండు అందాలు నా బాధను కొంత వరకు తగ్గించాయి. ఆ ప్రకృతి అందాలను నా గుండె నిండా పూసుకున్నాను. నా ప్రయాణం ఇలా సాగింది. ఆ రోజు నుండి, ఈ రోజువరకు ఎక్కడైనా, ఎవరైనా నా పుస్తకాలు చదవడం నేను చూడలేదు. ఒకవేళ ఎవరైనా తటస్థిస్తే, అతడు చదివేదాన్ని గురించి అతడితో మాట్లాడను.
- ఇంగ్లిష్: హెలైర్ బెల్లాక్
తెలుగు: డా॥ఆరవీటి రామయోగయ్య