'వెనక్కి ఇవ్వడం అగౌరవపర్చడమే!'
తిరువనంతపురం: దేశంలో అసహనం పెరిగిపోతున్నదంటూ ప్రముఖ రచయితలు సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి ఇస్తుండటంపై కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భిన్నంగా స్పందించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు అండగా నిలబడే హక్కు రచయితలకు ఉందంటూనే.. వారు అవార్డులు వాపస్ ఇవ్వడం ఖండించారు. పురస్కారాలను వెనక్కి ఇవ్వడమంటే.. ఆ గుర్తింపును అగౌరవపరచడమేనని పేర్కొన్నారు.
'పలువురు రచయితలు అకాడమీ అవార్డులను వెనక్కి ఇవ్వడంపట్ల వ్యక్తిగతంగా నేను చింతిస్తున్నాను. మేధస్సు,సాహిత్యం, సృజనాత్మకత, విద్య పాండిత్యానికి గుర్తింపు ఈ పురస్కారం. ఇది రాజకీయ చర్య కాదు' అని ఆయన గురువారం మిక్కడ ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.
'సాహిత్య అకాడమీ ఒక స్వతంత్ర సంస్థ. మనకున్న ఆందోళన రాజకీయపరమైనది. రచయితలు ఈ రెండింటి మధ్య గందరగోళపడొద్దు. ప్రస్తుత పరిస్థితిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిందే. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పాటుపడాల్సిందే. అంతేకానీ.. పురస్కారాలను అగౌరవపరచవద్దు' అని ఆయన పేర్కొన్నారు.