sahitya academy
-
దక్షిణాది భాషల.. మహా సాహిత్య ఉత్సవం!
దక్షిణాది దేశీభాషల మధ్య ఎంత సారూప్యత, సామీప్యం ఉన్నా, సంస్కృతుల ఆదాన ప్రదానాలున్నా, భావోద్వేగాల దగ్గరితనం ఉన్నా ఈ అన్ని భాషల కళా, సాంస్కృతిక రంగాల ఉమ్మడి సమ్మేళనాలు జరిగేది తక్కువ. జాతీయంగా జరిగే వేడుకలలో దక్షిణాది కళా సాహిత్య సాంస్కృతిక రంగాల సభ్యులు కలవడమే తప్ప స్థానికంగా వీరికై వీరు నిర్వహించుకునే సామూహిక సమ్మేళనాలు అరుదు. సాహిత్య రంగంలో అయితే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా రచయితలు ఒకచోట కూడి సాహిత్యాన్ని చర్చించుకునే మహా ఉత్సవాలు కొన్ని దశాబ్దాలుగా లేవు. సాహిత్య అకాడెమీ నిర్వహించుకునే సమావేశాలలో కొద్ది మంది కలవడమే కాని పెద్ద సంఖ్యలో కలిసే మహా ఉత్సవాలు ఏనాడూ జరగలేదు.ఈ వెలితిని పూడ్చేందుకు బహుశా తొట్ట తొలిసారిగా సందర్భం వచ్చింది. బెంగళూరులో పుస్తక ప్రచురణ, ప్రచార రంగంలో కృషి చేస్తున్న ‘బుక్‌బ్రహ్మ’ సంస్థ ఆగస్టు 9, 10, 11 తేదీలలో ‘బుక్‌బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్– 2024’ పేరుతో భారీ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నది. కోరమంగళలోని సెయింట్ జాన్స్ ఆడిటోరియంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో నాలుగు భాషల నుంచి దాదాపు 300 మంది రచయితలు, విమర్శకులు, అనువాదకులు, ప్రచురణకర్తలు పాల్గొననున్నారు. ఆడిటోరియంలో ఐదు వేదికలలో సమాంతరంగా ప్రతి గంట ఒక సమావేశం జరగనుంది. కన్నడ సాహిత్యకారుడు సతీష్ చప్పరికె ఈ ఫెస్టివల్‌కు డైరెక్టర్. అనువాదకుడు అజయ్ వర్మ తెలుగు భాషకు అనుసంధానకర్తగా ఉన్నారు. ఓల్గా, మృణాళిని, కుప్పిలి పద్మ, వివినమూర్తి, వాడ్రేవు చినవీరభద్రుడు, కాత్యాయని విద్మహే, వినోదిని, జూపాక సుభద్ర, గోగు శ్యామల తదితర 30 మంది తెలుగు రచయితలు ఈ ఉత్సవంలో పాల్గొననున్నారు.పెరుమాళ్ మురుగన్, కె.సచ్చిదానందన్, వివేక్ శాన్‌భాగ్, జయమోహన్ వంటి సుప్రసిద్ధులు వేదికల మీద ప్రసంగించనున్నారు. ప్రధానంగా కథ, నవలా సాహిత్యంపై చర్చ ఉంటుంది. ఇంగ్లిష్ భాష ద్వారా కాకుండా నేరుగా దక్షణాది భాషల మధ్య అనుసంధానం ఏర్పరచడమే ఈ ఉత్సవం లక్ష్యం. ప్రతి ఉదయ, సాయంత్రాలు నాలుగు భాషల ఉద్దండ కళాకారులు సంగీత ప్రదర్శనలు ఇవ్వనున్న ఈ ఉత్సవంలో విద్యార్థులను భాగస్వామ్యం చేశారు. ద్రవిడ భాషలలో సాహిత్య వికాసానికి ఈ వేడుక ఒక మేలైన చోదకశక్తి కాగలదని పలువురు సాహిత్యకారులు భావిస్తున్నారు. ఈ ఉత్సవానికి ప్రవేశం ఉచితం. రిజిస్ట్రేషన్ చేయించుకుని ఎవరైనా పాల్గొనవచ్చు. -
నంజుండన్ అనుమానాస్పద మృతి
బెంగళూర్ : ప్రముఖ అనువాదకులు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ జీ నంజుండన్ బెంగళూర్‌లోని తన నివాసంలో శనివారం విగతజీవిగా కనిపించారు. 58 ఏళ్ల నంజుండన్ నాలుగు రోజుల కిందట గుండెపోటుతో మరణించారని అనుమానిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. నాగదేవనహల్లిలోని నివాసంలో కుళ్లిన స్ధితిలో ఆయన మృతదేహాన్ని గుర్తించామని వెల్లడించారు. బెంగళూరు యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ లెక్చరర్‌గా పనిచేసే నంజుండన్ కొద్దిరోజులుగా విధులకు గైర్హాజరయ్యారని, ఆయనను చూసేందుకు అసిస్టెంట్ వచ్చిన క్రమంలో ఈ ఘటన వెలుగుచూసిందని చెప్పారు. ఆ సమయంలో చెన్నైలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా భార్య, కుమారుడు హుటాహుటిన బెంగళూర్‌కు చేరుకున్నారని తెలిపారు. కాగా, ఆయన దాదాపు 12 పుస్తకాలను కన్నడ నుంచి తమిళంలోకి అనువదించి విశేష ప్రాచుర్యం పొందారు. పలు కన్నడ మహిళా రచయితల కథలను అకా పేరుతో ఆయన తమిళంలోకి అనువదించినందుకు నంజుండన్‌కు 2012లో సాహిత్య అకాడమి బహుమతి లభించింది. -
ఏదీ నన్ను చూడనీ...
పెద్ద స్థానాల్లో ఉన్నవారు మంచి చదువరులు అయితే ఎలా ఉంటుంది? ఇది 1958 నాటి సంగతి. అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. సాహిత్య అకాడమీకి కూడా ఆయన ఉపాధ్యక్షుడు(జవాహర్ లాల్ నెహ్రూ అప్పుడు ప్రధాని, అకాడమీ అధ్యక్షుడు). అడవి బాపిరాజు సుప్రసిద్ధ నవల ‘నారాయణరావు’ను సాహిత్య అకాడమీ తరఫున అన్ని భాషల్లోకీ అనువదించాల్సిన పుస్తకంగా నిర్ణయించారు. అయితే– ఈ నవలలో ప్రధాన పాత్రధారి నారాయణరావు దేశంలోని భిన్న రాష్ట్రాల ప్రజలు, వారి ఆహారపుటలవాట్లు, వారి సంస్కృతుల మీద తన గమనింపుల్ని ప్రకటిస్తాడు. వీటిల్లో ఒరియా ప్రజల మీద చేసిన వ్యాఖ్యలు తమకు అభ్యంతరకరంగా ఉన్నాయనీ, కాబట్టి అనువాద కార్యక్రమం నుంచి ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకోవాలనీ డిమాండ్లు వచ్చాయి. అప్పుడు రాధాకృష్ణన్ స్వయంగా ఆ పుస్తకం చదివి, ఆ వ్యాఖ్యలను తొలగించాల్సిన పనిలేదని తేల్చి అనువాదం అయ్యేలా చూశారు. (అయితే, 1972లో బెంగాలీ పాఠకుల నుంచి ఇదే రకమైన అభ్యంతరాలు వచ్చినప్పుడు అప్పటి సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ సునితి కుమార్ ఛటర్జీ నిరసనకారులకు తలొగ్గి ఆ వ్యాఖ్యలు తొలగింపజేశారు.) ఇక, 1958లోనే నోరి నరసింహశాస్త్రి ‘రుద్రమదేవి’ పుస్తకంపైనా కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. అందులోని కొన్ని పరిశీలనలు జైనుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయన్న అభిప్రాయం వెల్లడైనప్పుడు, రాధాకృష్ణన్ ఆ నవల చదివి ఆ అభ్యంతరాలను కొట్టిపారేశారు. (ఇన్పుట్: డాక్టర్ డి.ఎస్.రావు) -
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా సిధారెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం - తెలంగాణ కోసం ‘అక్షర పోరు’ సాగించిన రచయిత - ప్రాణహిత, భూమిస్వప్నం, దివిటీ, నాగేటి సాల్లల్లో.. వంటివెన్నో రచనలు సాక్షి, హైదరాబాద్/సిద్దిపేట: తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. రచయితగా, తెలంగాణ ఉద్యమకారుడిగా సుపరిచుతులైన సిధారెడ్డి ఎన్నో పుస్తకాల ను వెలువరించారు. కేసీఆర్‌కు బాల్య మిత్రు డు కూడా. సిద్దిపేట సమీపంలోని బందారం గ్రామానికి చెందిన సిధారెడ్డి 2012లో తెలుగు అధ్యాపకులుగా పదవీ విరమణ పొందారు. తర్వాత నిరంతరం సాహిత్య సేద్యంలో తలమునకలై ఇప్పటికీ పుస్తక రచనలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వా త సాహిత్య అకాడమీ ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. మూడున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో సాహిత్య అకాడమీ కొనసాగింది. అప్పట్లో ఏపీ సాహిత్య అకాడమీ, ఏపీ సంగీత, నాటక అకాడమీ, ఏపీ లలిత కళల అకాడమీలు ఉండేవి. ఎన్టీ రామారావు సీఎం అయ్యాక వాటిని రద్దుచేసి వాటి స్థానంలో తెలుగు వర్సిటీని స్థాపించారు. స్వతహాగా సాహిత్య అభిలాషి అయిన కేసీఆర్.. వాటిని పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఇందులో ముఖ్యమైన తెలంగాణ సాహిత్య అకాడమీని ప్రారంభించి, దానికి సిధారెడ్డిని చైర్మన్‌గా నిర్ణయించారు. మిగతా రెండు అకాడమీలు కూడా త్వరలో ఏర్పాటు కానున్నాయి. విద్యార్థి దశ నుంచే సాహితీ సేద్యం.. 1955లో జన్మించిన సిధారెడ్డి తన విద్యాభ్యాసాన్ని బందారం, వెల్కటూరు, సిద్దిపేటలో కొనసాగించారు. ఆయన తండ్రి బాల సిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీలో ఎంఏ చదివిన సిధారెడ్డి.. ఆధునిక తెలుగు కవిత్వం లో సూర్యుడు అనే అంశంపై 1981లో ఎంఫిల్ చేశారు. ఆధునిక కవిత్వం, వాస్తవికత, అధివా స్తవికతపై పరిశోధన చేసి 1986లో పీహెచ్డీ çఅందుకున్నారు. ఉమ్మడి మెదక్‌లో కొంతకాలం పనిచేసిన తర్వాత సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసి 2012లో పదవీ విరమణ పొందారు. విద్యార్థి దశ నుంచే కథలు, కవిత్వం రాయడం అలవాటున్న సిధారెడ్డి.. ప్రాణహిత, భూమిస్వప్నం, దివిటీ, నాగే టి సాల్లల్ల, ఇక్కడి చెట్లగాలి, ఒక బాధ కాదు తదితర రచనలు అందించారు. నవ సాహితి, మెదక్ స్టడీ సర్కిల్ సంస్థలను నిర్వహించారు. మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసి సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు మంజీరా బులెటిన్‌కు సంపాదకత్వం వహించి 7 కవితా సంకలనాలను వెలువరించారు. సోయి అనే పత్రికకూ సంపాదకత్వం వహించారు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిం చారు. 1997 ఆగస్టులో గంట వ్యవధిలోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆవశ్యకతపై సిధారెడ్డి రచించిన ‘నాగేటి సాల్లల్ల..’కవిత ప్రసిద్ధి చెందింది. ఇదే కవిత ఆధారంగా ‘పోరు తెలంగాణ’ సినిమాలో పాటగా చిత్రీకరించారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం నందిని సిధారెడ్డికి నంది అవార్డును ప్రకటిం చింది. తనను రాష్ట్ర సాహిత్య అకాడమీకి చైర్మన్‌గా నియమించిన కేసీఆర్, చొరవచూపిన హరీశ్‌రావుకు సిధారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సాహిత్య రుణం తీర్చుకుంటా: సిధారెడ్డి ‘‘సీఎం కేసీఆర్ తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేయడమే కాకుండా సాహిత్య సేవ చేసే అవకాశాన్ని నాకు అందించారు. ఈ పదవి కంటే అకాడమీ ఏర్పాటు ఆకాంక్ష నెరవేరినందుకు సంతో షంగా ఉంది’’అని నందిని సిధారెడ్డి అన్నారు. మంగళవారం ‘సాక్షి’ ఆయనతో ముచ్చటించింది. ‘‘తెలంగాణ వచ్చినా సాహిత్య అకాడమీ లేదన్న బాధ ఇన్ని రోజుల పాటు ఉండేది. అకాడమీని ఏర్పాటు చేస్తే న్యాయం జరిగేదన్న నా అకాంక్షను సీఎం కేసీఆర్ అర్థం చేసుకున్నారు. బాధ్యత అప్పగించారు. సీఎం ఇచ్చిన ఈ అవకాశంతో తెలంగాణ సాహిత్య రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తా’’అని సిధారెడ్డి పేర్కొన్నారు. -
'వెనక్కి ఇవ్వడం అగౌరవపర్చడమే!'
తిరువనంతపురం: దేశంలో అసహనం పెరిగిపోతున్నదంటూ ప్రముఖ రచయితలు సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి ఇస్తుండటంపై కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భిన్నంగా స్పందించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు అండగా నిలబడే హక్కు రచయితలకు ఉందంటూనే.. వారు అవార్డులు వాపస్ ఇవ్వడం ఖండించారు. పురస్కారాలను వెనక్కి ఇవ్వడమంటే.. ఆ గుర్తింపును అగౌరవపరచడమేనని పేర్కొన్నారు. 'పలువురు రచయితలు అకాడమీ అవార్డులను వెనక్కి ఇవ్వడంపట్ల వ్యక్తిగతంగా నేను చింతిస్తున్నాను. మేధస్సు,సాహిత్యం, సృజనాత్మకత, విద్య పాండిత్యానికి గుర్తింపు ఈ పురస్కారం. ఇది రాజకీయ చర్య కాదు' అని ఆయన గురువారం మిక్కడ ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. 'సాహిత్య అకాడమీ ఒక స్వతంత్ర సంస్థ. మనకున్న ఆందోళన రాజకీయపరమైనది. రచయితలు ఈ రెండింటి మధ్య గందరగోళపడొద్దు. ప్రస్తుత పరిస్థితిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిందే. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పాటుపడాల్సిందే. అంతేకానీ.. పురస్కారాలను అగౌరవపరచవద్దు' అని ఆయన పేర్కొన్నారు. -
సాహిత్య అకాడమీకి గుడ్ బై!
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న అసహనం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఆంక్షలు విధిస్తుండటంపై మరో రచయిత్రి నిరసనబాటపట్టారు. దేశంలోని ఈ అశాంతిపూరితమైన వాతావరణాన్ని నిరసిస్తూ ప్రముఖ నవలా రచయిత్రి శశి దేశ్‌పాండే కేంద్ర సాహిత్య అకాడమీ జరనల్ కౌన్సిల్‌కు రాజీనామా చేశారు. ఇదేకారణంతో ఇప్పటికే ప్రముఖ రచయితలు నయనతార, కవి అశోక్ వాజపేయి తమకు లభించిన సాహిత్య పురస్కారాలను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. దేశంలో సృజనాత్మక స్వేచ్ఛకు గడ్డుకాలం దాపురించడం, కళాకారులపై దాడులు జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ ఉర్దూ నవలా రచయిత రెహమాన్ అబ్బాస్ కూడా తనకు ప్రదానం చేసిన మహారాష్ట్ర ఉర్దూ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని వాపస్ ఇస్తానని ప్రకటించారు. సమాజంలో చుట్టూ జరుగుతున్న అన్యాయానికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. హేతువాద రచయిత ఎంఎం కల్బుర్గి హత్యపై సాహిత్య అకాడమీ మౌనం వహించడం తనను తీవ్రంగా కలిచివేసిందని అకాడమీ చైర్మన్‌కు రాసిన లేఖలో శశి దేశ్‌పాండే ఆవేదన వ్యక్తం చేశారు. 'రాజీనామా చేసినందుకు బాధగానే ఉంది. అయినా కేవలం కార్యక్రమాలు నిర్వహించడం, పురస్కారాలు ఇవ్వడే మాత్రమే కాకుండా భారతీయ రచయితలకు వాక్, రచన స్వేచ్ఛకు సంబంధించి కూడా సాహిత్య అకాడమీ కృషి చేస్తుందనే ఆశతో ఈ పనిచేశాను' అని ఆమె తెలిపారు. -
కళా... కిర్సనాయిల్ తాసీల్దారా..?
ఇవాళ రేపు ఓ కథ రాయడానికీ, బొమ్మ గీయడానికీ, నృత్యం చేయడానికీ వేణువూదడానికీ స్టాండర్ట్స్ సెట్ చేసేస్తున్నాం. ఆ పీస్ ఎంత రేటు పలికింది? ఎంత పేరొచ్చింది. ఎంత పైకి ఎగబాకాడు. ఎన్ని చప్పట్లూ, ఈలలూచ్చాయి? లెక్కలూ ఆరాలు తీస్తున్నాం. ఎవర్ని పట్టుకుంటే సాహిత్య అకాడెమీ, ఎవరికి మచ్చిక అయితే తానా, ఎవరికి సలాం చేస్తే ప్రభుత్వం వారి ఉగాది నజరానా... ఇదే రంధి. మనిషి తన ఆనందాన్ని ఎలా కొలుస్తాడు? ముందుగా అతను బీరువా దగ్గరకెళ్ళాలి. తన నెక్టైలన్నిటినీ బయటికి తీయాలి. తర్వాత వాటన్నిటినీ ఆ చివర్నుంచి ఈ చివరికి నేల మీద పరవాలి. అప్పుడు వాటి మొత్తం పొడవును కొలవాలి. ఆ కొలత - ఆ దూరం- నిజమైన ఆనందానికి ఆ మనిషి ఉన్నంత దూరానికి సమానం.ఇలా షర్టులూ, ప్యాంట్లూ, బ్రాండెడ్ షూస్, బెల్టులూ, హెయిర్ క్రీమ్‌లూ, పౌడర్లతో అద్దం ముందే కాలక్షేపం చేయడం దుర్భరమని, పనికిమాలిన పని అని అంటాడు మైఖేల్ లెనిగ్. ఆయన ఆస్ట్రేలియన్ కార్టూనిస్టూ, కవీ. లెనిగ్ బొమ్మలూ, కవితలూ ప్రపంచ ప్రఖ్యాతం. తమ దేశానికి ‘సజీవ నది’ అనీ ‘జీవనిధి’ అనీ ఆ దేశప్రభుత్వం, ప్రజలూ ఆయన్ను సత్కరించుకున్నారు. ఇలాంటి మాటలే మరో విధంగా కళాకారుల కోసం పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు 1970వ దశకంలో చెప్పారు. చిత్రకారుడు బాలిపై ఆయన బొమ్మలతో వచ్చిన అందమైన సూవెనీర్లో ఈ వ్యాసం వచ్చింది. అందులో ‘ఇతను ఇంకా ఎక్కువ తపన పడాలి. బాధపడాలి. ఎక్కువ కష్టాలు పడేవాళ్ల గురించి తెలుసుకోవాలి. రొటీను బొమ్మలు వేయకూడదు. కాపీ కళకు దూరంగా ఉండాలి. తనదైన ఒరవడిని ఏర్పాటు చేసుకుని తనతో పాటు తన కళ అంతరించేది కాకుండా పదికాలాల పాటు నిలబడి, ఊపి, ప్రశ్నించి తిరగబడే విధంగా చేయగల కళకు కారణమైతే అప్పుడు తన జీవితం ధన్యమవుతుందని నేను భావిస్తాను. అలా కాకపోతే డబ్బులు గడించిన కిరసనాయిలు తహసీల్దారుకీ మంచి కళాకారుడికీ తేడా లేకుండా పోతుంది. అందుచేత అందరు చిత్రకారులూ మీసాలు దువ్వుకోవడం, జుట్లు సవరించుకోవడం, బూట్లకు లేసులు బిగించుకోకుండా కళారంగంలో తమకు తాము అన్వేషించుకుంటే దొరకవల్సింది దొరుకుతుంది. అప్పటికీ దొరక్కపోతే ప్రాప్తి లేదన్న మాట’. ఒక్క కళాకారుల విషయంలోనే కాదు. ఉద్యమకారులూ, దేశం కోసం త్యాగం చేసేవారూ, మేధోరంగంలో, సైన్స్‌లో, ఇంకా అంకితమైన రంగంలో పూర్తిగా మునిగి ఆదర్శం కోసం బతికే వారంతా ‘కిరసనాయిలు తహసీల్దార్లు’గా (పురాణం గారు ఇలాంటి చిత్రమైన పదాలు కాయిన్ చేస్తారు) ఉండిపోలేరు. కుదురైన బతుకూ, చక్కని చొక్కాలూ, ప్యాంట్లూ, షోకులూ, వడ్డించిన విస్తరిలాంటి జీవితం వారిని విసిగిస్తుంది. అలా పద్ధతిగా నిన్నటిలాగా ఈరోజూ, ఈ రోజులాగే రేపూ బతుకుతూ ‘సుఖం’గా ఉండటమంటే ఆత్మలోకంలో దివాలాయేనని వాళ్ల నమ్మకం. అలాంటి వాళ్లంతా బోలు మనుషులని కూడా అంటారు. అయితే ఎన్ని చెప్పినా కృషి, దీక్ష, పట్టుదలతో డబ్బు సంపాయించడమే పరమావధిగా ఒకే బిందువుపై కేంద్రీకరించి కోట్లు కూడబెట్టిన వారంటే ఎందుకో ఎంతో గౌరవభావంతో మన మనసు భారమైపోతుంది. ప్రపంచ కోటీశ్వరులూ, ఆసియా, భారత కోటాను కోటీశ్వర్లూ అంటూ ఫార్చ్యూన్ పత్రిక ఇచ్చే లిస్టుల్ని బిజినెస్ పేజీల్లో చదువుతున్నపుడు మన కళ్లు మెరుస్తాయి. చెమరుస్తాయి కూడా. వారి ‘నిజమైన ఆనందాన్ని’ చూసి మన రోజువారీ చిల్లర బతుకుతో పోల్చుకున్నపుడు అసూయా, చికాకూ వస్తాయి. వాడు సిక్స్ కొట్టిన సక్సెస్ చూసినపుడు ‘కొడితే కొట్టాలిరా’ అనుకోవడమే గానీ ఎక్కడ కొట్టాలి మన బొంద అనిపిస్తుంది. అధికారాన్ని చూపినపుడూ అంతే అబ్బురపడతాం. దుబాయ్ బుర్జ్లూ, విల్లాల్లో ఖలీఫాల విలాసాలూ చూసి అదిరి పడతాం. నరేంద్రమోదీ కోటు వేసినపుడు ‘దాని మీద పొడుగాటి చారలు నిజానికి చారలు కావు తెల్సా. ఆయన పూర్తి పేరు అలా పొదిగారట’ అని పక్కనోడికి చెబుతున్నపుడు తబ్బిబ్బైపోతాం. ‘పది లక్షలంట తెల్సా’ అన్నపుడేదో తన్మయత్వం క్లోరోఫారంలా గుండెను కమ్ముకుంటుంది. సక్సెసూ, డబ్బూ, కీర్తీ ఈ ఆత్మని ఆవరిస్తాయి. పొగ చూరుకుంటాయి. ‘పర్సూట్ ఆఫ్ హాపీనెస్’ కోసం నేడే పరుగెత్తండి అంటూ పత్రి కల పేజీలన్నీ గాలిలోకి ఒకేసారి కాల్పులు చేస్తాయి. కాని- ఒకడుంటాడు. రైతులనీ, కూలీలనీ, న్యాయమనీ బొంగురు గొంతుతో నినాదాలిస్తూ ఊరేగింపుల్లో, ధర్నాల్లో, తిరిగీ తిరిగీ నిష్ర్పయోజకుడవుతాడు. మరొకడుంటాడు. అన్యాయాల్ని అంతం చేయాలని అడవికెళ్లి తుపాకీ పట్టి దొంగ ఎన్కౌంటర్లో చచ్చి శవమై ఈగలు ముసిరే ఈతచాప చుట్టుకుని వస్తాడు. ఒకడు ఎనిమిది పాదాల కవిత రాయడానికి యాతన పడీ పడీ ఛస్తాడు. ఒక్క అవార్డూ రాకపోవచ్చు. స్టేజీ మీద శాలువా కప్పించుకోకపోవచ్చు. పద్మశ్రీనో మొగ్గశ్రీనో రాకపోవచ్చు. కాని అలాంటివాడొకడు వాడి పనిలో నిజమైన ఆనందాన్ని వెతుక్కునే ఉంటాడు. వాళ్లు రాలినప్పుడు వారితో ఏ ములాజా లేని కొన్ని పూలు కూడా వారి కోసం దుఃఖపడి రాలి ఉంటాయి. కాని ఇవాళ రేపు ఓ కథ రాయడానికీ, బొమ్మ గీయడానికీ, నృత్యం చేయడానికీ వేణువూదడానికీ స్టాండర్డ్స్ సెట్ చేసేస్తున్నాం. ఆ పీస్ ఎంత రేటు పలికింది? ఎంత పేరొచ్చింది. ఎంత పైకి ఎగబాకాడు. ఎన్ని చప్పట్లూ, ఈలలొచ్చాయి? లెక్కలూ ఆరాలు తీస్తున్నాం. ఎవర్ని పట్టుకుంటే సాహిత్య అకాడెమీ, ఎవరికి మచ్చిక అయితే తానా, ఎవరికి సలాం చేస్తే ప్రభుత్వం వారి ఉగాది నజరానా... ఇదే రంధి. రచయితలూ, కవులు, కళాకారులు కూడా ఈ వెబ్‌లో పడడం ఓ పంచరంగుల ట్రాజెడీ. కొద్దోగొప్పో ప్రతిభ ఉండీ, కవిత రాసీ, కథ రాసీ, నవల రాసీ, బొమ్మ గీసీ, నాటకం వేసీ, ప్రశంసలు పొందిన నాలుగు రోజులు తిరక్కముందే అవార్డు అనీ, బిరుదు అనీ స్టేజీ మీద దాన్ని ఎవరో పొలిటీషియన్ నుంచి అందుకోవడమే అత్యున్నత శిఖరాధిరోహణ అని అర్టిస్టులనుకోవడం, బయటి జనం అనుకోవడం రివాజయిపోయింది. ప్రఖ్యాత కవులు, రచయితలు కూడా కొంత కాలానికి ఏదో ఒక అవార్డు రాపోతే ఎందుకీ బతుకు అనుకోవడం కళ్లారా చూశాం. అదే యావతో పైరవీలు చేయడం చూశాం. గుర్తింపు కోసం, ప్రశంస కోసం, స్టార్‌గా వెలగడం కోసం తపన, యావ కళ అసలు పరమార్థాన్నే చంపుతుంది. ‘మెటీరియల్ సక్సెస్’ అనేది కళాకారుడికి అవసరమేనని పికాసో చెప్పాడు. దాని కోసమే అదే పనిగా పరుగెట్టడం మటుకు సాహిత్యానికీ, కళకీ శాపంగా శత్రువుగా మారుతుంది. కళతో ఏ సంబంధమూ లేని కొందరు పెద్దలు, అధికార పీఠాల్లో ఉన్నవారూ వాళ్ల వాళ్ల ఉనికి కోసమో, అవసరాల కోసమో ఓ రచయితని సత్కరిస్తే, బిరుదులిస్తే, అచ్చు అలాంటి వాళ్లే హాల్లో సీట్లలో కూచుని చప్పట్లు కొడితే ఎందుకా దరిద్రపు గుర్తింపు? నీది నిజమైన కళ అయి ఉంటే అది మనిషి మరింత అర్థం చేసుకోవడానికీ ముందుకెళడానికీ గొప్ప రసాస్వాదనని సృష్టించగలిగితే ఈ వెర్రి ఎందుకూ దండగ. - ఆర్టిస్ట్ మోహన్, 7702841384 -
భిన్నమైన యాత్రా నవల
సమీక్షణం పుస్తకం : ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం (నవల) రచన : మధురాంతకం నరేంద్ర విషయం : సాహిత్య అకాడమీ పిలుపుతో మెక్సికోకు వెళ్లారు మధురాంతకం నరేంద్ర. లక్నో నుంచి అఖిలేశ్వర్ కూడా పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో నెదర్లాండ్స్‌లోని ‘ఆమ్స్టర్డాం’లో 22 గంటలు విమానాశ్రయంలో వేచి ఉండవలసి వచ్చింది. అలా వేచి ఉండవలసి రావడానికి కారణాలను, అక్కడ జరిగిన సంఘటనలను, అనుభవాలను తెలిపే రచన ఇది. ఆ దేశపు ప్రాకృతిక అందాలు, సంస్కృతీ నాగరికతలతో పాటు మతం పుట్టుక, తీవ్రవాద ఘటనల వల్ల ప్రపంచం పడుతున్న అవస్థలు, సాధారణ జీవనంపై చూపే ప్రభావాలు లాంటి సున్నితమైన సామాజిక అంశాలను చర్చకు పెట్టి, చారిత్రక నేపథ్యం కలిగిన యదార్థ సంఘటనలకు చక్కని కాల్పనిక రూపాన్నిచ్చారు రచయిత. ‘సెప్టెంబర్ 11’ ఘటన తరువాత తీవ్రవాద దాడుల భయం పెరిగింది. తనిఖీల నెపంతో అమాయక ప్రజల్ని అరెస్టు చేసి శిక్షించినా, అందులో తమ తప్పేమీలేదని ‘యెర్రింగ్ ఆన్ అండ్ సైడ్ ఆఫ్ సెక్యూరిటీ’గా కేసును నమోదు చేసుకుని వదిలేస్తారు. ఇలాంటి పరిణామాలతో సాధారణ వ్యక్తుల జీవితాలెలా అతలాకుతలమౌతాయో, దేశం కాని దేశాలకు వెళ్లినవాళ్లు స్వదేశాలకు రావడం కోసం ఎంత ప్రయాస పడతారో ఈ నవల దర్పణం పట్టింది. అయితే, ఇదే నేపథ్యంలో మతం పుట్టుక, ప్రభావం, దాని పర్యవసానాలను వివరించాలనే ‘బృహత్ప్రయత్నం’ వల్ల కొండను అద్దంలో చూపిన చందంలా తయారైంది. కానీ యాత్రానుభవాల ద్వారా ఒక మంచి కారణాన్వేషణలోకి ప్రయాణించడం పాఠకుల్ని ఆలోచింపజేస్తుంది. - నాదెండ్ల మీరాసాహెబ్ పేజీలు: 100 వెల: 60 ప్రతులకు: కథాకోకిల ప్రచురణలు, 15-54/1, శ్రీపద్మావతి నగర్, తిరుపతి పడమర-2. ఫోన్: 0877-2241588 మహిళలకు మార్గం చూపే కథలు పుస్తకం : కొత్త బాటలు వేస్తూ...( కథలు) సంపాదకత్వం : ‘మహిళామార్గం’ బృందం విషయం : మహిళా చైతన్యాన్ని పురిగొల్పుతూ, కొత్త బాటలు వేస్తున్న 26 కథల సంపుటి ఇది. అన్ని స్థాయిల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను భిన్న కోణాల నుండి పరిశీలించి పరిష్కార మార్గాల్ని చిత్రించడానికి ప్రయత్నించిన కథలివి. స్త్రీ అంటే అందం, నాజూకుతనం కలగలిసిన రూపం కాదనీ, సామర్ధ్యం, ఆత్మవిశ్వాసం కలబోసిన శక్తి స్వరూపమనీ ఈ సంపుటి నిరూపిస్తుంది. కుల వ్యవస్థ వల్ల మహిళలు పొందే అవమానాలు, వారి పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను చిత్రిస్తూ దీనికి పరిష్కారంగా కుల రహిత సమాజ లక్ష్య సాధనను మన ముందుంచారు. కుటుంబ వ్యవస్థలోని పని విభజన ప్రస్తావన; స్త్రీలకు లేని ఆర్థిక స్వేచ్ఛ, సంతానలేమి వల్ల ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కారాల్ని కొన్ని కథలు చిత్రించాయి. స్త్రీలు కొన్ని వదులుకోవాల్సినవి ఉంటాయి. కోల్పోకూడనివీ ఉంటాయి. అలాంటి వాటికోసం ఊపిరితో సమానంగా పోరాడాలి. ఓడినా ఫర్వాలేదు కానీ, రాజీపడి బతకకూడదనే సందేశాన్ని ఇస్తూ పోరాట పటిమను చాటిన స్త్రీ జీవన ప్రస్థాన చిత్రమే ఈ మహిళా మార్గం కథలు. - డా॥గోపరాజు పద్మప్రియ పేజీలు: 252; వెల: 80; ప్రతులకు: బి.జ్యోతి, ఎడిటర్, మహిళా మార్గం, 1-3-75/5/ఎ, భీమ్‌నగర్, గద్వాల. ఫోన్: 9848855624 కొత్త పుస్తకాలు ఆలోచనాసులోచనాలు (వ్యాసాలు) రచన: కూర చిదంబరం పేజీలు: 136; వెల: 60 ప్రతులకు: సౌమిత్రి ప్రచురణలు, 6-1-118/19, పద్మారావునగర్, సికింద్రాబాద్-25. ఫోన్: 040-27507839 గీతా నవ్వులు (గీతా సుబ్బారావు కార్టూన్లు) పేజీలు: 160; వెల: 100 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు. విదేశీ కోడలు (కథలు) రచన: కోసూరి ఉమాభారతి పేజీలు: 132; వెల: 150 ప్రతులకు: నవోదయా బుక్ హౌస్, 3-3-865, ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా, కాచిగూడ, హైదరాబాద్-27. ఫోన్: 040-24652387 తాత ఎట్ మనవడు డాట్ కామ్ రచన: డా. సి.భవానీదేవి పేజీలు: 184; వెల: 125 ప్రతులకు: విశాలాంధ్ర బుక్ హౌస్ అన్ని శాఖలూ. శాలువా (కథలు) రచన: పిడుగు పాపిరెడ్డి పేజీలు: 134; వెల: 100 ప్రతులకు: రచయిత, 8/137, అప్పయ్యగారి వీధి, కొత్తపేట, కనిగిరి-523230. ఫోన్: 9490227114 1. వస్త్రగాలం (అన్నవరం దేవేందర్ కవిత్వంపై వివేచన) పేజీలు: 178; వెల: 100 2. నవనీతం (డాక్టర్ నలిమెల భాస్కర్ సాహిత్యంపై విశ్లేషణ) పేజీలు: 184; వెల: 100 సంపాదకులు: నగునూరి శేఖర్ ప్రతులకు: సంపాదకుడు, ఫ్లాట్ నం. 24, ఇం. 1-3-117/10, సాయి జయంతి అపార్ట్మెంట్స్, పద్మశాలి స్ట్రీట్, కరీంనగర్-1. ఫోన్: 9959914600 -
భళా.. విశ్వకళ
విశ్వకళా మహోత్సవం కళా సౌరభాలు వెదజల్లుతోంది. ప్రపంచంలో కనుమరుగవుతున్న కళలు జిల్లాలోని ఓ సాధారణ గ్రామమైన పామర్రులో ఆవిష్కృతమయ్యాయి. ఐఆర్డీఏ సంస్థ, నిర్నిత, సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మహోత్సవాలు మూడు రోజులపాటు సాంస్కృతిక చైతన్యానికి వేదికగా నిలవనున్నాయి. తొలిరోజైన శుక్రవారం వివిధ దేశాల బృందాలు ప్రదర్శించిన కళా రూపాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. గుడివాడ/పామర్రు, న్యూస్‌లైన్ : ఇది అంతర్జాతీయ సాంస్కృతిక చైతన్యం.. ప్రపంచంలో కనుమరుగవుతున్న కళలు జిల్లాలోని మారుమూలన ఉన్న పామర్రులో ఆవిష్కృతమయ్యూయి. విశ్వకళా మహోత్సవం పేరుతో ఐఆర్డీఏ సంస్థ, నిర్నిత, సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న విశ్వకళా మహోత్సవాలు శుక్రవారం పామర్రులోని క్షేత్రయ్య ప్రాంగణంలో ప్రారంభమయ్యూయి. మన దేశంతో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు ప్రదర్శించిన కళారూపాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. మరుగునపడిన ప్రాచీన కళలను గుర్తుచేశాయి. తొలుత పామర్రు పట్టణం నడిబొడ్డు నుంచి కళా ప్రాంగణం వరకు కళాకారులు కళాజ్యోతిని తీసుకొచ్చారు. ఆస్ట్రేలియాకు చెందిన విక్టోరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సీఈవో అర్జున్ సూరపనేని జ్యోతి ప్రజ్వలన చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖ డీజీపీ ప్రసాదరావు, ఐఆర్డీఏ అధినేత వినయ్‌కుమార్‌తో పాటు టర్కీ, ఆస్ట్రేలియా, అమెరికా, మనదేశంలోని తమిళనాడుకు చెందిన ప్రతినిధులు ఆద్యంతం కళలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కళా ప్రదర్శనలివీ.. అలరించిన కళా ప్రదర్శనలు ఆచార్య కళాకృష్ణ శిష్యురాలు నర్తకి ప్రణీత ‘ఆనందం నర్తనం.. భవయో’ అంటూ ప్రదర్శించిన నృత్యం కనువిందు చేసింది. గుడివాడ రూరల్ మండలం బిళ్లపాడుకు చెందిన మిరియాల శేఖర్‌బాబు బృందం ప్రదర్శించిన దేవరపెట్టి, టక్కుటమార విద్య ప్రదర్శన మంత్రముగ్ధుల్ని చేసింది. మిరియాల విజయ్‌కుమార్ చెప్పిన బుర్రకథ ఆకట్టుకుంది. కుచికాయలపూడి డప్పు వాయిద్య కళాకారులు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయవాడకు చెందిన కళాకారుల పులివేషాలు, సింహవాహిని అమ్మవారి నృత్య ప్రదర్శన అదరహో అనిపించారుు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన స్వర్ణ వెంకటసుబ్బయ్యకు చెందిన శ్రీలక్ష్మీ నరసింహా జడకోలాటం బృందం ఆడిన కోలాటం ఆద్యంతం ఉత్సాహాన్ని నింపింది. అదుర్స్ టీవీ కార్యక్రమంలో అందరి ఆదరాభిమానాలు పొందిన అంబికా ప్రదర్శించిన రింగ్డ్యాన్సు ఉల్లాసంగా సాగింది. ‘శంభో శంకర.. ’ అనే కీర్తనకు భరతనాట్యం చేస్తూనే రింగ్‌ను తిప్పుతూ నిప్పుల కుంపట్లను తలపై ఉంచి చేసిన ఆమె నాట్యం కార్యక్రమానికే హైలైట్. టర్కీ దేశానికి చెందిన యువకళాకారులతో పాటు మనదేశ కళాకారులు కలిసి ప్రదర్శించిన టర్కీ ట్రైబల్ ఫోక్ డ్యాన్సు అలరించింది. శాంతికి చిహ్నంగా చెప్పుకొనే ఈ టర్కీ డ్యాన్సు కేవలం మ్యూజిక్ ద్వారా ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు. కాకతీయుల కాలం నాటి నుంచి ఎంతో ఆదరణ పొందిన శివ పేరణీ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 15 నిమిషాల పాటు ప్రదర్శించిన ఈ నృత్యం ఔరా.. అనిపించింది. విశ్వకళా మహోత్సవం పేరుతో ఐఆర్డీఏ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు నాలుగు రోజులుగా సురభి నాటకాలను ప్రదర్శిస్తున్నారు.