దక్షిణాది దేశీభాషల మధ్య ఎంత సారూప్యత, సామీప్యం ఉన్నా, సంస్కృతుల ఆదాన ప్రదానాలున్నా, భావోద్వేగాల దగ్గరితనం ఉన్నా ఈ అన్ని భాషల కళా, సాంస్కృతిక రంగాల ఉమ్మడి సమ్మేళనాలు జరిగేది తక్కువ. జాతీయంగా జరిగే వేడుకలలో దక్షిణాది కళా సాహిత్య సాంస్కృతిక రంగాల సభ్యులు కలవడమే తప్ప స్థానికంగా వీరికై వీరు నిర్వహించుకునే సామూహిక సమ్మేళనాలు అరుదు. సాహిత్య రంగంలో అయితే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా రచయితలు ఒకచోట కూడి సాహిత్యాన్ని చర్చించుకునే మహా ఉత్సవాలు కొన్ని దశాబ్దాలుగా లేవు. సాహిత్య అకాడెమీ నిర్వహించుకునే సమావేశాలలో కొద్ది మంది కలవడమే కాని పెద్ద సంఖ్యలో కలిసే మహా ఉత్సవాలు ఏనాడూ జరగలేదు.
ఈ వెలితిని పూడ్చేందుకు బహుశా తొట్ట తొలిసారిగా సందర్భం వచ్చింది. బెంగళూరులో పుస్తక ప్రచురణ, ప్రచార రంగంలో కృషి చేస్తున్న ‘బుక్‌బ్రహ్మ’ సంస్థ ఆగస్టు 9, 10, 11 తేదీలలో ‘బుక్‌బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్– 2024’ పేరుతో భారీ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నది. కోరమంగళలోని సెయింట్ జాన్స్ ఆడిటోరియంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో నాలుగు భాషల నుంచి దాదాపు 300 మంది రచయితలు, విమర్శకులు, అనువాదకులు, ప్రచురణకర్తలు పాల్గొననున్నారు. ఆడిటోరియంలో ఐదు వేదికలలో సమాంతరంగా ప్రతి గంట ఒక సమావేశం జరగనుంది. కన్నడ సాహిత్యకారుడు సతీష్ చప్పరికె ఈ ఫెస్టివల్‌కు డైరెక్టర్. అనువాదకుడు అజయ్ వర్మ తెలుగు భాషకు అనుసంధానకర్తగా ఉన్నారు. ఓల్గా, మృణాళిని, కుప్పిలి పద్మ, వివినమూర్తి, వాడ్రేవు చినవీరభద్రుడు, కాత్యాయని విద్మహే, వినోదిని, జూపాక సుభద్ర, గోగు శ్యామల తదితర 30 మంది తెలుగు రచయితలు ఈ ఉత్సవంలో పాల్గొననున్నారు.
పెరుమాళ్ మురుగన్, కె.సచ్చిదానందన్, వివేక్ శాన్‌భాగ్, జయమోహన్ వంటి సుప్రసిద్ధులు వేదికల మీద ప్రసంగించనున్నారు. ప్రధానంగా కథ, నవలా సాహిత్యంపై చర్చ ఉంటుంది. ఇంగ్లిష్ భాష ద్వారా కాకుండా నేరుగా దక్షణాది భాషల మధ్య అనుసంధానం ఏర్పరచడమే ఈ ఉత్సవం లక్ష్యం. ప్రతి ఉదయ, సాయంత్రాలు నాలుగు భాషల ఉద్దండ కళాకారులు సంగీత ప్రదర్శనలు ఇవ్వనున్న ఈ ఉత్సవంలో విద్యార్థులను భాగస్వామ్యం చేశారు. ద్రవిడ భాషలలో సాహిత్య వికాసానికి ఈ వేడుక ఒక మేలైన చోదకశక్తి కాగలదని పలువురు సాహిత్యకారులు భావిస్తున్నారు. ఈ ఉత్సవానికి ప్రవేశం ఉచితం. రిజిస్ట్రేషన్ చేయించుకుని ఎవరైనా పాల్గొనవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment