
పెద్ద స్థానాల్లో ఉన్నవారు మంచి చదువరులు అయితే ఎలా ఉంటుంది? ఇది 1958 నాటి సంగతి. అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. సాహిత్య అకాడమీకి కూడా ఆయన ఉపాధ్యక్షుడు(జవాహర్ లాల్ నెహ్రూ అప్పుడు ప్రధాని, అకాడమీ అధ్యక్షుడు). అడవి బాపిరాజు సుప్రసిద్ధ నవల ‘నారాయణరావు’ను సాహిత్య అకాడమీ తరఫున అన్ని భాషల్లోకీ అనువదించాల్సిన పుస్తకంగా నిర్ణయించారు. అయితే– ఈ నవలలో ప్రధాన పాత్రధారి నారాయణరావు దేశంలోని భిన్న రాష్ట్రాల ప్రజలు, వారి ఆహారపుటలవాట్లు, వారి సంస్కృతుల మీద తన గమనింపుల్ని ప్రకటిస్తాడు. వీటిల్లో ఒరియా ప్రజల మీద చేసిన వ్యాఖ్యలు తమకు అభ్యంతరకరంగా ఉన్నాయనీ, కాబట్టి అనువాద కార్యక్రమం నుంచి ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకోవాలనీ డిమాండ్లు వచ్చాయి. అప్పుడు రాధాకృష్ణన్ స్వయంగా ఆ పుస్తకం చదివి, ఆ వ్యాఖ్యలను తొలగించాల్సిన పనిలేదని తేల్చి అనువాదం అయ్యేలా చూశారు. (అయితే, 1972లో బెంగాలీ పాఠకుల నుంచి ఇదే రకమైన అభ్యంతరాలు వచ్చినప్పుడు అప్పటి సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ సునితి కుమార్ ఛటర్జీ నిరసనకారులకు తలొగ్గి ఆ వ్యాఖ్యలు తొలగింపజేశారు.)
ఇక, 1958లోనే నోరి నరసింహశాస్త్రి ‘రుద్రమదేవి’ పుస్తకంపైనా కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. అందులోని కొన్ని పరిశీలనలు జైనుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయన్న అభిప్రాయం వెల్లడైనప్పుడు, రాధాకృష్ణన్ ఆ నవల చదివి ఆ అభ్యంతరాలను కొట్టిపారేశారు.
(ఇన్‌పుట్: డాక్టర్ డి.ఎస్.రావు)