
భళా.. విశ్వకళ
విశ్వకళా మహోత్సవం కళా సౌరభాలు వెదజల్లుతోంది. ప్రపంచంలో కనుమరుగవుతున్న కళలు జిల్లాలోని ఓ సాధారణ గ్రామమైన పామర్రులో ఆవిష్కృతమయ్యాయి. ఐఆర్‌డీఏ సంస్థ, నిర్నిత, సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మహోత్సవాలు మూడు రోజులపాటు సాంస్కృతిక చైతన్యానికి వేదికగా నిలవనున్నాయి. తొలిరోజైన శుక్రవారం వివిధ దేశాల బృందాలు ప్రదర్శించిన కళా రూపాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
గుడివాడ/పామర్రు, న్యూస్‌లైన్ : ఇది అంతర్జాతీయ సాంస్కృతిక చైతన్యం.. ప్రపంచంలో కనుమరుగవుతున్న కళలు జిల్లాలోని మారుమూలన ఉన్న పామర్రులో ఆవిష్కృతమయ్యూయి. విశ్వకళా మహోత్సవం పేరుతో ఐఆర్‌డీఏ సంస్థ, నిర్నిత, సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న విశ్వకళా మహోత్సవాలు శుక్రవారం పామర్రులోని క్షేత్రయ్య ప్రాంగణంలో ప్రారంభమయ్యూయి. మన దేశంతో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు ప్రదర్శించిన కళారూపాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి.
మరుగునపడిన ప్రాచీన కళలను గుర్తుచేశాయి. తొలుత పామర్రు పట్టణం నడిబొడ్డు నుంచి కళా ప్రాంగణం వరకు కళాకారులు కళాజ్యోతిని తీసుకొచ్చారు. ఆస్ట్రేలియాకు చెందిన విక్టోరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సీఈవో అర్జున్ సూరపనేని జ్యోతి ప్రజ్వలన చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖ డీజీపీ ప్రసాదరావు, ఐఆర్‌డీఏ అధినేత వినయ్‌కుమార్‌తో పాటు టర్కీ, ఆస్ట్రేలియా, అమెరికా, మనదేశంలోని తమిళనాడుకు చెందిన ప్రతినిధులు ఆద్యంతం కళలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కళా ప్రదర్శనలివీ..
అలరించిన కళా ప్రదర్శనలు
ఆచార్య కళాకృష్ణ శిష్యురాలు నర్తకి ప్రణీత ‘ఆనందం నర్తనం.. భవయో’ అంటూ ప్రదర్శించిన నృత్యం కనువిందు చేసింది.
గుడివాడ రూరల్ మండలం బిళ్లపాడుకు చెందిన మిరియాల శేఖర్‌బాబు బృందం ప్రదర్శించిన దేవరపెట్టి, టక్కుటమార విద్య ప్రదర్శన మంత్రముగ్ధుల్ని చేసింది.
మిరియాల విజయ్‌కుమార్ చెప్పిన బుర్రకథ ఆకట్టుకుంది.
కుచికాయలపూడి డప్పు వాయిద్య కళాకారులు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విజయవాడకు చెందిన కళాకారుల పులివేషాలు, సింహవాహిని అమ్మవారి నృత్య ప్రదర్శన అదరహో అనిపించారుు.
ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన స్వర్ణ వెంకటసుబ్బయ్యకు చెందిన శ్రీలక్ష్మీ నరసింహా జడకోలాటం బృందం ఆడిన కోలాటం ఆద్యంతం ఉత్సాహాన్ని నింపింది.
అదుర్స్ టీవీ కార్యక్రమంలో అందరి ఆదరాభిమానాలు పొందిన అంబికా ప్రదర్శించిన రింగ్‌డ్యాన్సు ఉల్లాసంగా సాగింది. ‘శంభో శంకర.. ’ అనే కీర్తనకు భరతనాట్యం చేస్తూనే రింగ్‌ను తిప్పుతూ నిప్పుల కుంపట్లను తలపై ఉంచి చేసిన ఆమె నాట్యం కార్యక్రమానికే హైలైట్.
టర్కీ దేశానికి చెందిన యువకళాకారులతో పాటు మనదేశ కళాకారులు కలిసి ప్రదర్శించిన టర్కీ ట్రైబల్ ఫోక్ డ్యాన్సు అలరించింది. శాంతికి చిహ్నంగా చెప్పుకొనే ఈ టర్కీ డ్యాన్సు కేవలం మ్యూజిక్ ద్వారా ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు.
కాకతీయుల కాలం నాటి నుంచి ఎంతో ఆదరణ పొందిన శివ పేరణీ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 15 నిమిషాల పాటు ప్రదర్శించిన ఈ నృత్యం ఔరా.. అనిపించింది.
విశ్వకళా మహోత్సవం పేరుతో ఐఆర్‌డీఏ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు నాలుగు రోజులుగా సురభి నాటకాలను ప్రదర్శిస్తున్నారు.