visvakala extravaganza
-
సకల కళా సంబరం
సంప్రదాయ కళల సమాహారంగా మారింది విశ్వకళా మహోత్సవం. రెండోరోజు కార్యక్రమాలు ఆద్యంతం రసరమ్యంగా సాగింది. కళారంగంలో ఉన్న మాధుర్యాన్ని ప్రేక్షకులకు పంచింది. శనివారం జరిగిన కార్యక్రమాల్లో మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, అసోంకు చెందిన వందలాది మంది కళాకారులు తమ కళలను ప్రదర్శించారు. ప్రారంభోత్సవంలో విశ్వకళా మహోత్సవ కమిటీ అధ్యక్షుడు వినయ్‌కుమార్ ప్రసంగించారు. పామర్రు/గుడివాడ, న్యూస్‌లైన్ : తమిళనాడుకు చెందిన పాండిచ్చేరి యూనివర్సిటీ డీన్ నేతృత్వంలో దాదాపు 32మంది కళాకారులు గంటపాటు తమ ప్రదర్శనలతో హోరెత్తించారు. తమిళనాడు ఫోక్ డ్యాన్స్, టప్పాటం డ్యాన్స్, కర్హాటం, పెరియ మేళం డ్యాన్సులతో ఉర్రూతలూగించారు. అసోంలోని గువహతి నుంచి వచ్చిన యువకులు బిహూ డ్యాన్సుతో ఆకట్టుకున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన శ్రీలక్ష్మీ నరసింహ కోలాట సమాజం వారి జడకోలాటం ఉత్సాహంగా సాగింది. ఒంగోలుకు చెందిన ఆర్.లయ ఈలపాటతో శభాష్ అనిపించుకుంది. హైదరాబాద్‌కు చెందిన విభూషణం కల్యాణి గాత్ర కచేరి వీనులవిందుగా సాగింది. హైదరాబాద్‌కు చెందిన శంకర నారాయణ హాస్య కార్యక్రమం కడుపుబ్బ నవ్వించింది. తెనాలికి చెందిన ప్రముఖ హరికథా గాయకుడు చందూ భాస్కర్ తన హరికథా గానంతో ప్రేక్షకులను ఆధ్యాత్మిక సంద్రంలో ముంచెత్తారు. పామర్రుకు చెందిన 77ఏళ్ల కళాకారుడు శ్రీకృష్ణుడు వేషధారణలో పౌరాణిక పద్యాలు వినిపించి ప్రశంసలు పొందారు. లాస్య నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన మోహన్‌బాబు చేసిన పప్పేట్ షో ఆశ్చర్యపరిచింది. నృత్యేంద్రజాలం పేరుతో రవళి, రవితేజ చేసిన డ్యాన్స్ అలరించింది. సంప్రదాయ నాట్యం నుంచి మైఖేల్ జాక్సన్ డ్యాన్స్ వరకు దాదాపు ఐదు రకాల వస్త్రధారణతో వారిద్దరూ ఆకట్టుకున్నారు. అంబిక ప్రదర్శించిన రింగ్ డ్యాన్సు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. కళారూపాలను కాపాడండి పామర్రు : రోజూ టీవీ, సెల్ఫోన్లు వాడుతూ ప్రతి ఒక్కరూ కళలకు దూరమవుతున్న ఈరోజుల్లో కళాలను అందరికీ అందించేందుకు ఐఆర్డీఏ పనిచేయడం అభినందనీయమని రామ్కీ ఫౌండేషన్ సీఈవో ఎంవీ రామిరెడ్డి పేర్కొన్నారు. పామర్రులోని క్షేత్రయ్య ప్రాంగణం, సిద్ధేంద్రయోగి కళావేదిక వద్ద శనివారం సాయంత్రం నిర్వహించిన విశ్వ కళామహోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కళా రూపాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. ఐఆర్డీఏ అధ్యక్షుడు పి.వినయ్‌కుమార్ మాట్లాడుతూ పట్టణాలలో ఇటువంటి కార్యక్రమాలకు ఆదరణ తక్కువగా ఉంటుందనే నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటుచేశామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకళాపరిషత్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరీ, విశ్రాంత ఇన్కమ్ టాక్స్ కమిషనర్ చుక్కా రామస్వామి, ప్రముఖ కళాకారులు శ్రీ కళాకృష్ణ, డాక్టర్ కుసుమ గాయత్రి, బైసాని నాగే శ్వరరావు, సితార్ విధ్వాంసుడు వినోద్, ఫ్రాన్స్ దేశస్తులు డానియేల్ నెజర్సు తదితరులు పాల్గొన్నారు. -
భళా.. విశ్వకళ
విశ్వకళా మహోత్సవం కళా సౌరభాలు వెదజల్లుతోంది. ప్రపంచంలో కనుమరుగవుతున్న కళలు జిల్లాలోని ఓ సాధారణ గ్రామమైన పామర్రులో ఆవిష్కృతమయ్యాయి. ఐఆర్డీఏ సంస్థ, నిర్నిత, సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మహోత్సవాలు మూడు రోజులపాటు సాంస్కృతిక చైతన్యానికి వేదికగా నిలవనున్నాయి. తొలిరోజైన శుక్రవారం వివిధ దేశాల బృందాలు ప్రదర్శించిన కళా రూపాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. గుడివాడ/పామర్రు, న్యూస్‌లైన్ : ఇది అంతర్జాతీయ సాంస్కృతిక చైతన్యం.. ప్రపంచంలో కనుమరుగవుతున్న కళలు జిల్లాలోని మారుమూలన ఉన్న పామర్రులో ఆవిష్కృతమయ్యూయి. విశ్వకళా మహోత్సవం పేరుతో ఐఆర్డీఏ సంస్థ, నిర్నిత, సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న విశ్వకళా మహోత్సవాలు శుక్రవారం పామర్రులోని క్షేత్రయ్య ప్రాంగణంలో ప్రారంభమయ్యూయి. మన దేశంతో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు ప్రదర్శించిన కళారూపాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. మరుగునపడిన ప్రాచీన కళలను గుర్తుచేశాయి. తొలుత పామర్రు పట్టణం నడిబొడ్డు నుంచి కళా ప్రాంగణం వరకు కళాకారులు కళాజ్యోతిని తీసుకొచ్చారు. ఆస్ట్రేలియాకు చెందిన విక్టోరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సీఈవో అర్జున్ సూరపనేని జ్యోతి ప్రజ్వలన చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖ డీజీపీ ప్రసాదరావు, ఐఆర్డీఏ అధినేత వినయ్‌కుమార్‌తో పాటు టర్కీ, ఆస్ట్రేలియా, అమెరికా, మనదేశంలోని తమిళనాడుకు చెందిన ప్రతినిధులు ఆద్యంతం కళలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కళా ప్రదర్శనలివీ.. అలరించిన కళా ప్రదర్శనలు ఆచార్య కళాకృష్ణ శిష్యురాలు నర్తకి ప్రణీత ‘ఆనందం నర్తనం.. భవయో’ అంటూ ప్రదర్శించిన నృత్యం కనువిందు చేసింది. గుడివాడ రూరల్ మండలం బిళ్లపాడుకు చెందిన మిరియాల శేఖర్‌బాబు బృందం ప్రదర్శించిన దేవరపెట్టి, టక్కుటమార విద్య ప్రదర్శన మంత్రముగ్ధుల్ని చేసింది. మిరియాల విజయ్‌కుమార్ చెప్పిన బుర్రకథ ఆకట్టుకుంది. కుచికాయలపూడి డప్పు వాయిద్య కళాకారులు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయవాడకు చెందిన కళాకారుల పులివేషాలు, సింహవాహిని అమ్మవారి నృత్య ప్రదర్శన అదరహో అనిపించారుు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన స్వర్ణ వెంకటసుబ్బయ్యకు చెందిన శ్రీలక్ష్మీ నరసింహా జడకోలాటం బృందం ఆడిన కోలాటం ఆద్యంతం ఉత్సాహాన్ని నింపింది. అదుర్స్ టీవీ కార్యక్రమంలో అందరి ఆదరాభిమానాలు పొందిన అంబికా ప్రదర్శించిన రింగ్డ్యాన్సు ఉల్లాసంగా సాగింది. ‘శంభో శంకర.. ’ అనే కీర్తనకు భరతనాట్యం చేస్తూనే రింగ్‌ను తిప్పుతూ నిప్పుల కుంపట్లను తలపై ఉంచి చేసిన ఆమె నాట్యం కార్యక్రమానికే హైలైట్. టర్కీ దేశానికి చెందిన యువకళాకారులతో పాటు మనదేశ కళాకారులు కలిసి ప్రదర్శించిన టర్కీ ట్రైబల్ ఫోక్ డ్యాన్సు అలరించింది. శాంతికి చిహ్నంగా చెప్పుకొనే ఈ టర్కీ డ్యాన్సు కేవలం మ్యూజిక్ ద్వారా ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు. కాకతీయుల కాలం నాటి నుంచి ఎంతో ఆదరణ పొందిన శివ పేరణీ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 15 నిమిషాల పాటు ప్రదర్శించిన ఈ నృత్యం ఔరా.. అనిపించింది. విశ్వకళా మహోత్సవం పేరుతో ఐఆర్డీఏ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు నాలుగు రోజులుగా సురభి నాటకాలను ప్రదర్శిస్తున్నారు.