భిన్నమైన యాత్రా నవల
సమీక్షణం
పుస్తకం : ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం (నవల)
రచన : మధురాంతకం నరేంద్ర
విషయం : సాహిత్య అకాడమీ పిలుపుతో మెక్సికోకు వెళ్లారు మధురాంతకం నరేంద్ర. లక్నో నుంచి అఖిలేశ్వర్ కూడా పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో నెదర్లాండ్స్‌లోని ‘ఆమ్‌స్టర్‌డాం’లో 22 గంటలు విమానాశ్రయంలో వేచి ఉండవలసి వచ్చింది. అలా వేచి ఉండవలసి రావడానికి కారణాలను, అక్కడ జరిగిన సంఘటనలను, అనుభవాలను తెలిపే రచన ఇది. ఆ దేశపు ప్రాకృతిక అందాలు, సంస్కృతీ నాగరికతలతో పాటు మతం పుట్టుక, తీవ్రవాద ఘటనల వల్ల ప్రపంచం పడుతున్న అవస్థలు, సాధారణ జీవనంపై చూపే ప్రభావాలు లాంటి సున్నితమైన సామాజిక అంశాలను చర్చకు పెట్టి, చారిత్రక నేపథ్యం కలిగిన యదార్థ సంఘటనలకు చక్కని కాల్పనిక రూపాన్నిచ్చారు రచయిత.
‘సెప్టెంబర్ 11’ ఘటన తరువాత తీవ్రవాద దాడుల భయం పెరిగింది. తనిఖీల నెపంతో అమాయక ప్రజల్ని అరెస్టు చేసి శిక్షించినా, అందులో తమ తప్పేమీలేదని ‘యెర్రింగ్ ఆన్ అండ్ సైడ్ ఆఫ్ సెక్యూరిటీ’గా కేసును నమోదు చేసుకుని వదిలేస్తారు. ఇలాంటి పరిణామాలతో సాధారణ వ్యక్తుల జీవితాలెలా అతలాకుతలమౌతాయో, దేశం కాని దేశాలకు వెళ్లినవాళ్లు స్వదేశాలకు రావడం కోసం ఎంత ప్రయాస పడతారో ఈ నవల దర్పణం పట్టింది. అయితే, ఇదే నేపథ్యంలో మతం పుట్టుక, ప్రభావం, దాని పర్యవసానాలను వివరించాలనే ‘బృహత్ప్రయత్నం’ వల్ల కొండను అద్దంలో చూపిన చందంలా తయారైంది. కానీ యాత్రానుభవాల ద్వారా ఒక మంచి కారణాన్వేషణలోకి ప్రయాణించడం పాఠకుల్ని ఆలోచింపజేస్తుంది.
- నాదెండ్ల మీరాసాహెబ్
పేజీలు: 100
వెల: 60
ప్రతులకు: కథాకోకిల ప్రచురణలు, 15-54/1, శ్రీపద్మావతి నగర్, తిరుపతి పడమర-2. ఫోన్: 0877-2241588
మహిళలకు మార్గం చూపే కథలు
పుస్తకం : కొత్త బాటలు వేస్తూ...( కథలు)
సంపాదకత్వం : ‘మహిళామార్గం’ బృందం
విషయం : మహిళా చైతన్యాన్ని పురిగొల్పుతూ, కొత్త బాటలు వేస్తున్న 26 కథల సంపుటి ఇది. అన్ని స్థాయిల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను భిన్న కోణాల నుండి పరిశీలించి పరిష్కార మార్గాల్ని చిత్రించడానికి ప్రయత్నించిన కథలివి.
స్త్రీ అంటే అందం, నాజూకుతనం కలగలిసిన రూపం కాదనీ, సామర్ధ్యం, ఆత్మవిశ్వాసం కలబోసిన శక్తి స్వరూపమనీ ఈ సంపుటి నిరూపిస్తుంది. కుల వ్యవస్థ వల్ల మహిళలు పొందే అవమానాలు, వారి పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను చిత్రిస్తూ దీనికి పరిష్కారంగా కుల రహిత సమాజ లక్ష్య సాధనను మన ముందుంచారు. కుటుంబ వ్యవస్థలోని పని విభజన ప్రస్తావన; స్త్రీలకు లేని ఆర్థిక స్వేచ్ఛ, సంతానలేమి వల్ల ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కారాల్ని కొన్ని కథలు చిత్రించాయి.
స్త్రీలు కొన్ని వదులుకోవాల్సినవి ఉంటాయి. కోల్పోకూడనివీ ఉంటాయి. అలాంటి వాటికోసం ఊపిరితో సమానంగా పోరాడాలి. ఓడినా ఫర్వాలేదు కానీ, రాజీపడి బతకకూడదనే సందేశాన్ని ఇస్తూ పోరాట పటిమను చాటిన స్త్రీ జీవన ప్రస్థాన చిత్రమే ఈ మహిళా మార్గం కథలు.
- డా॥గోపరాజు పద్మప్రియ
పేజీలు: 252; వెల: 80; ప్రతులకు: బి.జ్యోతి, ఎడిటర్, మహిళా మార్గం, 1-3-75/5/ఎ, భీమ్‌నగర్, గద్వాల. ఫోన్: 9848855624
కొత్త పుస్తకాలు
ఆలోచనాసులోచనాలు (వ్యాసాలు)
రచన: కూర చిదంబరం
పేజీలు: 136; వెల: 60
ప్రతులకు: సౌమిత్రి ప్రచురణలు, 6-1-118/19, పద్మారావునగర్, సికింద్రాబాద్-25. ఫోన్: 040-27507839
గీతా నవ్వులు (గీతా సుబ్బారావు కార్టూన్లు)
పేజీలు: 160; వెల: 100
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.
విదేశీ కోడలు (కథలు)
రచన: కోసూరి ఉమాభారతి
పేజీలు: 132; వెల: 150
ప్రతులకు: నవోదయా బుక్ హౌస్, 3-3-865, ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా, కాచిగూడ, హైదరాబాద్-27. ఫోన్: 040-24652387
తాత ఎట్ మనవడు డాట్ కామ్
రచన: డా. సి.భవానీదేవి
పేజీలు: 184; వెల: 125
ప్రతులకు: విశాలాంధ్ర బుక్ హౌస్ అన్ని శాఖలూ.
శాలువా (కథలు)
రచన: పిడుగు పాపిరెడ్డి
పేజీలు: 134; వెల: 100
ప్రతులకు: రచయిత, 8/137, అప్పయ్యగారి వీధి, కొత్తపేట, కనిగిరి-523230. ఫోన్: 9490227114
1. వస్త్రగాలం (అన్నవరం దేవేందర్ కవిత్వంపై వివేచన)
పేజీలు: 178; వెల: 100
2. నవనీతం (డాక్టర్ నలిమెల భాస్కర్ సాహిత్యంపై విశ్లేషణ)
పేజీలు: 184; వెల: 100
సంపాదకులు: నగునూరి శేఖర్
ప్రతులకు: సంపాదకుడు, ఫ్లాట్ నం. 24, ఇం. 1-3-117/10, సాయి జయంతి అపార్ట్‌మెంట్స్, పద్మశాలి స్ట్రీట్, కరీంనగర్-1. ఫోన్: 9959914600