
నేడు ఇంగ్లండ్‌తో భారత పురుషుల హాకీ జట్టు ‘ఢీ’
నెదర్లాండ్స్‌తో మహిళల జట్టు పోరు
సాయంత్రం గం. 5:15 నుంచి స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రొ లీగ్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న భారత పురుషుల జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఐర్లాండ్‌పై భారీ విజయాలు నమోదు చేసుకున్న హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా... సోమవారం తమకంటే మెరుగైన ర్యాంకర్ ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఆడనుంది. భారత అంచె పోటీల్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న భారత్... తాజా సీజన్‌లో 6 మ్యాచ్‌లాడి 4 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
మరోవైపు 13 పాయింట్లు సాధించిన ఇంగ్లండ్ మూడో ‘ప్లేస్’లో ఉంది. స్పెయిన్, జర్మనీతో మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన భారత జట్టు... ఐర్లాండ్‌పై మాత్రం సమష్టిగా సత్తా చాటింది. అదే స్ఫూర్తి ఇంగ్లండ్‌పై కూడా కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, మన్‌దీప్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్, నీలమ్, అభిషేక్, షంషేర్ సింగ్ కలిసికట్టుగా కదం తొక్కాల్సిన అవసరముంది.
డిఫెన్స్‌లో భారత్ బలంగా కనిపిస్తోంది. తాజా సీజన్‌లో ఆరు మ్యాచ్‌లాడిన టీమిండియా ఇప్పటి వరకు ప్రత్యర్థులకు కేవలం 8 గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. తొమ్మిది జట్లలో ఇదే అతి తక్కువ కావడం మన రక్షణ శ్రేణి పటుత్వాన్ని చాటుతోంది. అయితే పెనాల్టీ కార్నర్‌లను సది్వనియోగ పరుచుకోవడంపై మరింత దృష్టి సారిస్తేనే ఇంగ్లండ్‌పై విజయం సాధ్యమవుతుంది.
నెదర్లాండ్స్‌ను నిలువరించేనా..
మహిళల ప్రొ లీగ్‌లో పడుతూ లేస్తూ సాగుతున్న భారత జట్టు... సోమవారం డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. భారత అంచె పొటీలను ఘనవిజయంతో ప్రారంభించిన సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు... ఆసాంతం అదే జోరు కొనసాగించలేకపోయింది. తాజా సీజన్‌లో 6 మ్యాచ్‌లాడిన మన అమ్మాయిలు 2 విజయాలు, 3 పరాజయాలు, 1‘డ్రా’తో 7 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఏడో స్థానంలో ఉన్నారు.
మరోవైపు 15 పాయింట్లు సాధించిన నెదర్లాండ్స్ రెండో ‘ప్లేస్’లో కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో జర్మనీపై సాధించిన స్ఫూర్తితో సమష్టిగా సత్తాచాటాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు గత రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌పై 5–1, 6–0తో విజయాలు సాధించిన నెదర్లాండ్స్ జట్టు టీమిండియాపై కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ‘ప్రపంచంలోనే అత్యంత పటిష్ట జట్లలో నెదర్లాండ్స్ ఒకటి.
వాళ్లతో మ్యాచ్ కఠినమైందని తెలుసు. మా వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెట్టాం. జర్మనీపై విజయం ప్లేయర్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని భారత సారథి సలీమ చెప్పింది. 2013 నుంచి భారత్, నెదర్లాండ్స్ మధ్య 7 మ్యాచ్‌లు జరగగా... అందులో ఐదింట నెదర్లాండ్స్ విజయం సాధించింది. ఒక మ్యాచ్ టీమిండియా నెగ్గగా... మరొకటి ‘డ్రా’ అయింది.
Comments
Please login to add a commentAdd a comment