కళా... కిర్సనాయిల్ తాసీల్దారా..?
ఇవాళ రేపు ఓ కథ రాయడానికీ, బొమ్మ గీయడానికీ, నృత్యం చేయడానికీ వేణువూదడానికీ స్టాండర్ట్స్ సెట్ చేసేస్తున్నాం. ఆ పీస్ ఎంత రేటు పలికింది? ఎంత పేరొచ్చింది. ఎంత పైకి ఎగబాకాడు. ఎన్ని చప్పట్లూ, ఈలలూచ్చాయి? లెక్కలూ ఆరాలు తీస్తున్నాం. ఎవర్ని పట్టుకుంటే సాహిత్య అకాడెమీ, ఎవరికి మచ్చిక అయితే తానా, ఎవరికి సలాం చేస్తే ప్రభుత్వం వారి ఉగాది నజరానా... ఇదే రంధి.
మనిషి తన ఆనందాన్ని ఎలా కొలుస్తాడు?
ముందుగా అతను బీరువా దగ్గరకెళ్ళాలి.
తన నెక్‌టైలన్నిటినీ బయటికి తీయాలి.
తర్వాత వాటన్నిటినీ ఆ చివర్నుంచి ఈ చివరికి నేల మీద పరవాలి.
అప్పుడు వాటి మొత్తం పొడవును కొలవాలి.
ఆ కొలత -
ఆ దూరం-
నిజమైన ఆనందానికి ఆ మనిషి ఉన్నంత దూరానికి సమానం.ఇలా షర్టులూ, ప్యాంట్లూ, బ్రాండెడ్ షూస్, బెల్టులూ, హెయిర్ క్రీమ్‌లూ, పౌడర్లతో అద్దం ముందే కాలక్షేపం చేయడం దుర్భరమని, పనికిమాలిన పని అని అంటాడు మైఖేల్ లెనిగ్. ఆయన ఆస్ట్రేలియన్ కార్టూనిస్టూ, కవీ. లెనిగ్ బొమ్మలూ, కవితలూ ప్రపంచ ప్రఖ్యాతం. తమ దేశానికి ‘సజీవ నది’ అనీ ‘జీవనిధి’ అనీ ఆ దేశప్రభుత్వం, ప్రజలూ ఆయన్ను సత్కరించుకున్నారు.
ఇలాంటి మాటలే మరో విధంగా కళాకారుల కోసం పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు 1970వ దశకంలో చెప్పారు. చిత్రకారుడు బాలిపై ఆయన బొమ్మలతో వచ్చిన అందమైన సూవెనీర్‌లో ఈ వ్యాసం వచ్చింది. అందులో ‘ఇతను ఇంకా ఎక్కువ తపన పడాలి. బాధపడాలి. ఎక్కువ కష్టాలు పడేవాళ్ల గురించి తెలుసుకోవాలి. రొటీను బొమ్మలు వేయకూడదు. కాపీ కళకు దూరంగా ఉండాలి. తనదైన ఒరవడిని ఏర్పాటు చేసుకుని తనతో పాటు తన కళ అంతరించేది కాకుండా పదికాలాల పాటు నిలబడి, ఊపి, ప్రశ్నించి తిరగబడే విధంగా చేయగల కళకు కారణమైతే అప్పుడు తన జీవితం ధన్యమవుతుందని నేను భావిస్తాను.
అలా కాకపోతే డబ్బులు గడించిన కిరసనాయిలు తహసీల్దారుకీ మంచి కళాకారుడికీ తేడా లేకుండా పోతుంది. అందుచేత అందరు చిత్రకారులూ మీసాలు దువ్వుకోవడం, జుట్లు సవరించుకోవడం, బూట్లకు లేసులు బిగించుకోకుండా కళారంగంలో తమకు తాము అన్వేషించుకుంటే దొరకవల్సింది దొరుకుతుంది. అప్పటికీ దొరక్కపోతే ప్రాప్తి లేదన్న మాట’.
ఒక్క కళాకారుల విషయంలోనే కాదు. ఉద్యమకారులూ, దేశం కోసం త్యాగం చేసేవారూ, మేధోరంగంలో, సైన్స్‌లో, ఇంకా అంకితమైన రంగంలో పూర్తిగా మునిగి ఆదర్శం కోసం బతికే వారంతా ‘కిరసనాయిలు తహసీల్దార్లు’గా (పురాణం గారు ఇలాంటి చిత్రమైన పదాలు కాయిన్ చేస్తారు) ఉండిపోలేరు. కుదురైన బతుకూ, చక్కని చొక్కాలూ, ప్యాంట్లూ, షోకులూ, వడ్డించిన విస్తరిలాంటి జీవితం వారిని విసిగిస్తుంది. అలా పద్ధతిగా నిన్నటిలాగా ఈరోజూ, ఈ రోజులాగే రేపూ బతుకుతూ ‘సుఖం’గా ఉండటమంటే ఆత్మలోకంలో దివాలాయేనని వాళ్ల నమ్మకం. అలాంటి వాళ్లంతా బోలు మనుషులని కూడా అంటారు.
అయితే ఎన్ని చెప్పినా కృషి, దీక్ష, పట్టుదలతో డబ్బు సంపాయించడమే పరమావధిగా ఒకే బిందువుపై కేంద్రీకరించి కోట్లు కూడబెట్టిన వారంటే ఎందుకో ఎంతో గౌరవభావంతో మన మనసు భారమైపోతుంది. ప్రపంచ కోటీశ్వరులూ, ఆసియా, భారత కోటాను కోటీశ్వర్లూ అంటూ ఫార్చ్యూన్ పత్రిక ఇచ్చే లిస్టుల్ని బిజినెస్ పేజీల్లో చదువుతున్నపుడు మన కళ్లు మెరుస్తాయి. చెమరుస్తాయి కూడా. వారి ‘నిజమైన ఆనందాన్ని’ చూసి మన రోజువారీ చిల్లర బతుకుతో పోల్చుకున్నపుడు అసూయా, చికాకూ వస్తాయి.
వాడు సిక్స్ కొట్టిన సక్సెస్ చూసినపుడు ‘కొడితే కొట్టాలిరా’ అనుకోవడమే గానీ ఎక్కడ కొట్టాలి మన బొంద అనిపిస్తుంది. అధికారాన్ని చూపినపుడూ అంతే అబ్బురపడతాం. దుబాయ్ బుర్జ్‌లూ, విల్లాల్లో ఖలీఫాల విలాసాలూ చూసి అదిరి పడతాం. నరేంద్రమోదీ కోటు వేసినపుడు ‘దాని మీద పొడుగాటి చారలు నిజానికి చారలు కావు తెల్సా. ఆయన పూర్తి పేరు అలా పొదిగారట’ అని పక్కనోడికి చెబుతున్నపుడు తబ్బిబ్బైపోతాం. ‘పది లక్షలంట తెల్సా’ అన్నపుడేదో తన్మయత్వం క్లోరోఫారంలా గుండెను కమ్ముకుంటుంది. సక్సెసూ, డబ్బూ, కీర్తీ ఈ ఆత్మని ఆవరిస్తాయి. పొగ చూరుకుంటాయి. ‘పర్సూట్ ఆఫ్ హాపీనెస్’ కోసం నేడే పరుగెత్తండి అంటూ పత్రి కల పేజీలన్నీ గాలిలోకి ఒకేసారి కాల్పులు చేస్తాయి.
కాని- ఒకడుంటాడు. రైతులనీ, కూలీలనీ, న్యాయమనీ బొంగురు గొంతుతో నినాదాలిస్తూ ఊరేగింపుల్లో, ధర్నాల్లో, తిరిగీ తిరిగీ నిష్ర్పయోజకుడవుతాడు. మరొకడుంటాడు. అన్యాయాల్ని అంతం చేయాలని అడవికెళ్లి తుపాకీ పట్టి దొంగ ఎన్‌కౌంటర్లో చచ్చి శవమై ఈగలు ముసిరే ఈతచాప చుట్టుకుని వస్తాడు. ఒకడు ఎనిమిది పాదాల కవిత రాయడానికి యాతన పడీ పడీ ఛస్తాడు.
ఒక్క అవార్డూ రాకపోవచ్చు. స్టేజీ మీద శాలువా కప్పించుకోకపోవచ్చు. పద్మశ్రీనో మొగ్గశ్రీనో రాకపోవచ్చు. కాని అలాంటివాడొకడు వాడి పనిలో నిజమైన ఆనందాన్ని వెతుక్కునే ఉంటాడు. వాళ్లు రాలినప్పుడు వారితో ఏ ములాజా లేని కొన్ని పూలు కూడా వారి కోసం దుఃఖపడి రాలి ఉంటాయి.
కాని ఇవాళ రేపు ఓ కథ రాయడానికీ, బొమ్మ గీయడానికీ, నృత్యం చేయడానికీ వేణువూదడానికీ స్టాండర్డ్స్ సెట్ చేసేస్తున్నాం. ఆ పీస్ ఎంత రేటు పలికింది? ఎంత పేరొచ్చింది. ఎంత పైకి ఎగబాకాడు. ఎన్ని చప్పట్లూ, ఈలలొచ్చాయి? లెక్కలూ ఆరాలు తీస్తున్నాం. ఎవర్ని పట్టుకుంటే సాహిత్య అకాడెమీ, ఎవరికి మచ్చిక అయితే తానా, ఎవరికి సలాం చేస్తే ప్రభుత్వం వారి ఉగాది నజరానా... ఇదే రంధి.
రచయితలూ, కవులు, కళాకారులు కూడా ఈ వెబ్‌లో పడడం ఓ పంచరంగుల ట్రాజెడీ.
కొద్దోగొప్పో ప్రతిభ ఉండీ, కవిత రాసీ, కథ రాసీ, నవల రాసీ, బొమ్మ గీసీ, నాటకం వేసీ, ప్రశంసలు పొందిన నాలుగు రోజులు తిరక్కముందే అవార్డు అనీ, బిరుదు అనీ స్టేజీ మీద దాన్ని ఎవరో పొలిటీషియన్ నుంచి అందుకోవడమే అత్యున్నత శిఖరాధిరోహణ అని అర్టిస్టులనుకోవడం, బయటి జనం అనుకోవడం రివాజయిపోయింది. ప్రఖ్యాత కవులు, రచయితలు కూడా కొంత కాలానికి ఏదో ఒక అవార్డు రాపోతే ఎందుకీ బతుకు అనుకోవడం కళ్లారా చూశాం.
అదే యావతో పైరవీలు చేయడం చూశాం. గుర్తింపు కోసం, ప్రశంస కోసం, స్టార్‌గా వెలగడం కోసం తపన, యావ కళ అసలు పరమార్థాన్నే చంపుతుంది. ‘మెటీరియల్ సక్సెస్’ అనేది కళాకారుడికి అవసరమేనని పికాసో చెప్పాడు. దాని కోసమే అదే పనిగా పరుగెట్టడం మటుకు సాహిత్యానికీ, కళకీ శాపంగా శత్రువుగా మారుతుంది.
కళతో ఏ సంబంధమూ లేని కొందరు పెద్దలు, అధికార పీఠాల్లో ఉన్నవారూ వాళ్ల వాళ్ల ఉనికి కోసమో, అవసరాల కోసమో ఓ రచయితని సత్కరిస్తే, బిరుదులిస్తే, అచ్చు అలాంటి వాళ్లే హాల్లో సీట్లలో కూచుని చప్పట్లు కొడితే ఎందుకా దరిద్రపు గుర్తింపు? నీది నిజమైన కళ అయి ఉంటే అది మనిషి మరింత అర్థం చేసుకోవడానికీ ముందుకెళడానికీ గొప్ప రసాస్వాదనని సృష్టించగలిగితే ఈ వెర్రి ఎందుకూ దండగ.
- ఆర్టిస్ట్ మోహన్, 7702841384