Sakshi Editorial Special Story On Hollywood Crisis, Explained In Telugu - Sakshi
Sakshi News home page

అంతటి హాలీవుడ్‌ కు సమ్మె ఎఫెక్ట్, నష్టం ఎంతంటే.?

Published Wed, Jul 19 2023 12:15 AM | Last Updated on Thu, Jul 20 2023 5:52 PM

Sakshi Editorial On Hollywood crisis

అవును... హాలీవుడ్‌ సంక్షోభంలో చిక్కుకుంది. ఆరు దశాబ్దాల పైచిలుకు తర్వాత రచయితలు, నటీ నటులు మళ్ళీ ఏకకాలంలో సెట్స్‌కు దూరం జరిగారు. సినిమాలు, టీవీ షోల నిర్మాణం ఒక్కసారిగా ఆగింది. జీతభత్యాల పెంపు సహా పలు అంశాలపై నిర్మాతల కూటమి (అలయన్స్‌ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ అండ్‌ టెలివిజన్‌ ప్రొడ్యూసర్స్‌)తో చర్చలు విఫలమై మే 2 నుంచి రచయితలు సమ్మె బాట పట్టారు. రెండు నెలల తర్వాత తాజాగా ఈ జూలై 13 నుంచి వేలాది నటులూ జత కలిశారు.

సరైన జీతం, మెరుగైన పని పరిస్థితుల డిమాండ్లు తీరకపోవడంతో నటులూ పిడికిలి పైకెత్తారు. ఇక, రచన, నటనలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని నటీనటుల సంఘం (ఎస్‌ఏజీ), రచయితల సంఘం (డబ్ల్యూజీఏ)... రెండూ వ్యతిరేకిస్తున్నాయి. సమ్మెకు అదీ ఒక ప్రధాన కారణమే. జంట సమ్మెల ప్రభావం చిత్రనిర్మాణంలోని ఇతర విభాగాల్లో, అనుబంధ పరిశ్రమల్లోని వేలమందిపైనా పడింది. కార్మికులంతా వీధిన పడ్డారు. అందుకే, ఇది వట్టి వినోదానికి మించిన విషయం. 

సీఈఓలకు లక్షల డాలర్లిస్తూ, రచయితలు, నటుల దగ్గరకొచ్చేసరికి నష్టాలొస్తున్నాయంటూ బీద అరుపులు అరవడం హాలీవుడ్‌లోనూ ఉన్నదే. 2000లో అన్నీ కలిపి హాలీవుడ్‌ వినోద పరిశ్రమకు 500 కోట్ల డాలర్ల లాభాలొస్తే, నెట్‌ఫ్లిక్స్‌ చేరికతో 2019కి అది 3 వేల డాలర్లకు దూసుకుపోయింది. రచయితల సంపాదన మాత్రం తగ్గిపోయింది.

గత దశాబ్దకాలంలో రచయిత కమ్‌ నిర్మాత హోదా లోని వారి సగటు జీతం 4 శాతం మేర తగ్గింది. ద్రవ్యోల్బణంతో చూసుకుంటే, ఏకంగా 23 శాతం క్షీణించింది. తాజా స్ట్రీమింగ్‌ శకం ప్రకంపనలు రచనావృత్తిని తాకాయి. 2000లో టీవీ సీజన్‌ రైటర్లకు ఏటా 42 వారాల పని దొరికేది. స్ట్రీమింగ్‌తో సీజన్లు తగ్గి, 20 వారాలకు పడిపోయింది. 

11,500 మంది సభ్యులున్న రచయితల సంఘంతో మూడేళ్ళకోసారి నిర్మాతల కూటమి కొత్త జీతభత్యాల ఒప్పందం కుదుర్చుకుంటుంది. వార్నర్‌ బ్రదర్స్, డిస్కవరీ లాంటి భారీ స్టూడియోలు, నెట్‌ఫ్లిక్స్, పీకాక్‌ లాంటి పలు స్ట్రీమింగ్‌ వేదికలు ఆ నిర్మాతల్లో భాగమే. ఈసారి మే1తో కొత్త ఒప్పందం రావాలి. ఆరు వారాలు చర్చించినా ఫలితం లేకపోయింది.

జీతం, పింఛన్, స్ట్రీమింగ్‌లో పదే పదే ప్రసారంతో రచయితలకు అదనంగా చేయాల్సిన అవశేష చెల్లింపులు (రాయల్టీలు) వగైరా ఎటూ తెగకపోవడంతో కలం కార్మికులు సమ్మె సైరన్‌ మోగించారు. స్థూలంగా నటీనటులకూ ఇలాంటి సమస్యలే. చర్చలు ఫలించక నటీనటుల సంఘం సైతం తాజాగా షూటింగ్‌లకు దూరం జరిగింది. గత నవంబర్‌లో రంగప్రవేశం చేసిన ఛాట్‌జీపీటీ సైతం సృజనాత్మక రంగాలను కుదిపేస్తోంది. సమీప భవిష్యత్తులో ఏఐతో తమ పొట్ట కొట్టకుండా రక్షణ ఉండాలని రచయితల, నటుల డిమాండ్‌. 

ప్రస్తుతం స్ట్రీమింగ్‌ వేదికలు పెరిగాయి. కంటెంట్‌ దాహం తీరట్లేదు. దీన్ని అదనుగా చేసుకొని ఏఐ లాంటి వాటి శిక్షణకు తమ స్క్రిప్టులను వినియోగించరాదనీ, తమ రచనల నుంచి కొత్తవి సృష్టించడానికి ఏఐని వాడరాదనీ సృజనకారుల డిమాండ్‌. నటులు సైతం అనుమతి లేకుండా, పరిహారమి వ్వకుండా ఏఐతో తమ రూపాలనూ, స్వరాలనూ సృష్టించి నటింపజేయరాదంటున్నారు.

అది సమంజసమే. నిర్మాతలు మాత్రం నేపథ్యంలోని నటీనటుల స్కాన్లను తీసుకొనే హక్కు తమకు ఉండాలంటున్నారు. తద్వారా వారి రూపాలను ఏఐతో సృష్టించి శాశ్వతంగా వాడుకోనివ్వాలని కోరుతున్నారు. అప్పుడిక పారితోషికమివ్వకుండానే పని జరిగిపోతుందనేది నిర్మాతల ఎత్తు. దీని పైనే తీవ్ర అభ్యంతరం. వెరసి, యావత్‌ సినీ చరిత్రలోనే రెండో పర్యాయం హాలీవుడ్‌ స్తంభించింది. 

2007లో వంద రోజుల పాటు రచయితల సమ్మెతో ఒక్క క్యాలిఫోర్నియాకే 210 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లింది. ఇప్పుడీ జంట సమ్మెలెంత నష్టం తెస్తాయో? రీషూట్లు, ప్రచారాలు, ప్రీమి యర్లకు నటులు దూరమయ్యేసరికి పూర్తయిన సినిమాలకూ ఇబ్బందే. టీవీ షోల కథ సరేసరి. ఎమ్మీ అవార్డుల ప్రదానం లాంటివీ వెనక్కిపోతాయి. వాటి కన్నా ముఖ్యం సాధారణ కార్మికుల పరిస్థితి.

1960లో నటులు, రచయితలు ఒకేసారి సమ్మె చేసినప్పుడు నటీనటుల సంఘానికి సారథి నటుడు, తర్వాత అమెరికా అధ్యక్షుడైన రొనాల్డ్‌ రీగన్‌. అయితే ఈసారి సమ్మె ప్రత్యేకమైనది. సాంకేతికతదే పైచేయి అయి, పని స్వభావం, సుస్థిరతపై ప్రభావం పడేవేళ యాజమాన్యానికీ, శ్రామికులకూ మధ్య బం«ధాల పునర్వ్యవస్థీకరణ అవసరమని గుర్తు చేస్తున్న సమ్మె ఇది. ఛాట్‌ జీపీటీతో పని చౌక గనక రచయితలు, ఎడిటర్లు, ఫోటోగ్రాఫర్ల లాంటి వైట్‌కాలర్‌ ఉద్యోగాలు పోతాయని భయం. 

అలాగని అంతర్జాల యుగంలో నియంత్రణలతో టెక్నాలజీని అడ్డగలమా అంటే అనుమానమే. ఎవరికీ దెబ్బ తగలకుండా మధ్యేమార్గంలో పోవడం విజ్ఞత. దర్శక దిగ్గజం క్రిస్టఫర్‌ నోలన్‌ అన్నట్టు తారల సంగతెలా ఉన్నా, ఏఐతో రచయితల, చిన్న నటీనటుల పొట్టకొట్టడం భావ్యం కాదు. నిజానికి, రచన, నటన లాంటి సృజనాత్మక కృషికి మేధ కన్నా మానసిక స్పందన ముఖ్యం. మనిషైతేనేం, మెషినైతేనేం అంతా ఒకటేనని కొందరు అనుకోవచ్చు. అననూవచ్చు.

భవిష్యత్తులో అలాంటి ఏఐ ఆధారిత సినిమాలు రావచ్చు. కొత్త ఒక వింతగా ఆకట్టుకోనూవచ్చు. కానీ, ఏ సృజన ఎందుకు గొప్పదవుతుందో, ఎలా జనాదరణ పొందుతుందో యంత్రాలు, డేటాలు చెప్పగలవా? నకిలీ నటులు, కంప్యూటర్‌ రచయితలతో తయారైన ఏఐ చిత్రాలు నిజమైన సినిమాల అనుభూతిని అందించగలవా? కొద్దికాలానికి ఈ కృత్రిమ మేధాసృష్టి విసుగెత్తవచ్చు. అయితే, అప్పటికే అంతా ఆలస్యమైపోతుంది. హాలీవుడ్‌లో సమ్మె చేస్తున్నవారి ఆవేదన అదే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement