ఎన్నికల వేళ వినూత్న ప్రచారం
ఆకట్టుకునే కంటెంట్‌కే నేతల ప్రాధాన్యం
కంటెంట్ రైటర్లకు అనుక్షణం చాలెంజ్
రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది కంటెంట్ రైటర్లు
ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉన్నవారు 20 వేల మందే
సాక్షి, హైదరాబాద్: కంటెంట్‌లో కిక్కు ఉండాలి...అది ఉంటేనే క్లిక్ అవుతుందనే భావనలో రాజకీయ నాయకులు ఉన్నారు. జనంలోకి దూసుకెళ్లే వీడియోలు.. వినంగానే అర్థమయ్యేలా సోది లేకుండా చెప్పే నైపుణ్యం..నిశితంగా వైరిపక్షాన్ని ఇరుకున పెట్టే వ్యూహం.. లోక్‌సభ ఎన్నికల వేళ నేతలు ఈ తరహా కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన వికీపీడియా కంటెంట్ సొల్యూషన్స్ సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది కంటెంట్ రైటర్లు పనిచేస్తున్నారు. అసలు కంటెంట్ రైటింగ్ అంటే ఏంటో? ఎలా ఉంటుందో? ఎలా క్రియేట్ చేయాలో చెప్పేందుకు ప్రత్యేక శిక్షణ సంస్థలూ ఉన్నాయి.
ఢిల్లీకి దగ్గర్లోని గుర్గావ్‌లో ఇలాంటి పేరెన్నికగల సంస్థల్లో చాలామంది శిక్షణ పొందుతున్నట్టు వీక్‌పీడియా సంస్థ అధిపతి కుమార్‌జైన్ తెలిపారు. ఇలా శిక్షణ తీసుకున్నవారు కొన్నేళ్లుగా ఎన్నికలు, ఇతర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరి ఆధ్వర్యంలో పనిచేసిన మరో 80 వేల మంది వరకూ కంటెంట్ రైటర్లుగా మారిపోయారు.
‘క్లిక్’మనిపించడమే సవాల్
రాజకీయపార్టీ ఏదైనా సరే ఎన్నికల్లో గెలవాలనే అనుకుంటుంది. ఈ దిశగానే వారి ఆశయాలు, ఆచరణ విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతుంది. వాట్సాప్, యూట్యూ బ్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఇలా అన్ని సోషల్ మీడియాల్లోనూ తమ వాదన ‘క్లిక్’కావాలనే కోరుకుంటాయి. ఇక్కడే కంటెంట్ రైటర్ ప్రావీణ్యత ముడిపడి ఉంది. నేతను జనంలో నిలబెట్టే మెళకువలు అందిపుచ్చుకోవడంలో దేశవ్యాప్తంగా 60 శాతం కంటెంట్ రైటర్లు విజయం సాధిస్తున్నారని ఢిల్లీకి చెందిన ఇండియా కంటెంట్స్ మేనేజర్ విజయ్‌కుమార్ మల్‌హోత్రా తెలిపారు.
పోస్టు పెట్టాక రివ్యూ చేస్తారు. ఎంతమందికి అది రీచ్ అయింది తెలుసుకుని.. సరైన స్పందన లేకపోతే కంటెంట్ మార్చడానికి ప్రయత్నిస్తుంటారు. నాయకుడికి సంబంధింన కంటెంట్ రైటర్ తను పెట్టే వీడియోలు, ఫొటోలు ఓటర్లకు రీచ్ కాకపోతే కంటెంట్ రైటర్ చిక్కుల్లో పడ్డట్టే. దీనికోసం కంటెంట్ రైటర్లు కూడా సొంత ఫాలోవర్స్ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది.
మంచి గిరాకీనే..
కంటెంట్ రైటర్లకు ఎన్నికల సీజన్‌లో మంచి గిరాకీ ఉంటుంది. ఒక్కో సంస్థ పరిధిలో కనీసం 50 మంది పనిచేస్తుంటారు. నాయకుడి అందించే కాన్సెప్ట్ అర్థం చేసుకొని, అందుకు అనుగుణంగా అవసరమైన డైలాగ్స్, సెటైర్లతో కంటెంట్ ఇవ్వడం వీరి బాధ్యత. దీనిని వీడియో ఎడిటర్ చిత్రీకరణలోకి తీసుకెళతాడు. చిత్రం చాలా తేలికగా ఉండాలంటే, ఈజీగా ఉండే పదాలు, వాడుక భాషను కంటెంట్ రైటర్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
కంటెంట్ అందిచడం అనేక విధాలుగా ఉంటుందని ది రైటర్స్ అనే సంస్థకు చెందిన విఠల్ తెలిపాడు. అధికార పార్టీ నేత పోటీ చేస్తున్నప్పుడు ప్రభుత్వ పథకాలు, జరిగిన లబ్దిపై ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో విపక్షాలు లేవనెత్తే ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కూడా కంటెంట్ ఇవ్వాలి. దీనిని వీలైనంత తక్కువ నిడివి గల వీడియో చిత్రీకరణకు అనువుగా ఉండాలని నేతలు కోరుతున్నట్టు కంటెంట్ రైటర్లు చెబుతున్నారు.
విపక్షమైతే ఎదురుదాడి ప్రధానాస్త్రంగా కిక్ ఎక్కించే కంటెంట్ కోరుకుంటోంది. కంటెంట్ క్లిక్ అయ్యే దాన్ని బట్టి రెమ్యూనరేషన్ డిమాండ్ ఉంటోంది. కొంతమంది ఎన్నికల సమయం వరకూ ప్యాకేజీగా రూ.25 నుంచి రూ.40 లక్షల వరకూ తీసుకుంటున్నారు. మరికొంతమంది నేతలు వారి స్థాయిని బట్టి రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఇది కూడా రూ.10 లక్షలకు తక్కువ ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment