ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగంపై ఎన్నికల కమిషనర్‌కు వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు | YSRCP Leaders Meet State Election Commissioner Neelam Sahni | Sakshi
Sakshi News home page

ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగంపై ఎన్నికల కమిషనర్‌కు వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు

Published Mon, Feb 17 2025 5:37 PM | Last Updated on Mon, Feb 17 2025 7:15 PM

YSRCP Leaders Meet State Election Commissioner Neelam Sahni

సాక్షి,విజయవాడ : స్ధానిక సంస్ధల ఉపఎన్నికల్లో కూటమి పార్టీల అరాచకాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల బృందం కలిసింది. రాష్ట్రంలో ఉపఎన్నికల ప్రక్రియను సజావుగా నడిపించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేసింది. రాష్ర ఎన్నికల కమిషన్ నీలం సాహ్నిని కలిసిన వైఎస్సార్‌సీపీ బృందంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌,  మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు, వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, కొమ్మూరి కనకారావు, అంకంరెడ్డి నారాయణమూర్తి, పలువురు పార్టీనేతలు ఉన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. 

పిడుగు రాళ్ల ఎన్నిక రద్దు చేయాలి : తాటిపర్తి చంద్రశేఖర్ 
వైఎస్సార్‌సీపీ శ్రేణులను భయపెట్టడానికి వారి ఇళ్లను కూల్చివేయడంతో పాటు దాడులకు దిగిడం, పోలీసు వ్యవస్ధను అడ్డం పెట్టుకుని లాఠీల మాటున లూటీ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ధానిక సంస్ధల ఉప ఎన్నికల్లో లెక్కకు మించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. పిడుగురాళ్లలో టీడీపీ గెలుపు ఎలాంటిదో అందరికీ తెలుసన్నారు. తునిలో కూటమి పార్టీలకు సరైన సంఖ్యాబలం లేకపోవడం వల్ల ఇప్పటికి రెండు దఫాలుగా వాయిదా పడిందని.. పాలకొండలో ఒకే ఒక ఎస్సీ సభ్యురాలు ఉంటే ఆమెను కూడా వారి పార్టీ తరపున నిలబెట్టే ప్రయత్నం చేయడం దారుణని వ్యాఖ్యానించారు. ప్రజస్వామ్యంలో ఇలాంటి చర్యలను అందరూ ఖండించాలన్నారు. అధికార పార్టీలు చేస్తున్న ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇవాళ ఎలక్షన్ కమిషన్ కలిపి ఫిర్యాదు చేశామని చంద్రశేఖర్ చెప్పారు. వ్యవస్ధలు కేవలం ఒక పార్టీ కోసం పనిచేయడానికి ఏర్పాటు కాలేదన్న ఆయన... రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయా లేదా అన్న ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

ఒక్క సభ్యుడు కూడా లేని చోట కేవలం డబ్బు, అధికార మదం, రాజకీయ అండతో టీడీపీ గెలుస్తుంటే... ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకోవడం సరికాదన్న ఆయన... కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఈ వ్యవహరంలో జోక్యం చేసుకుని పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా చూడ్డంతో పాటు, పిడుగురాళ్లలో మరొక్కసారి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వినతిపత్రం సమర్పించామన్నారు.

హద్దుల్లేకుండా దమనకాండ : మల్లాది విష్టు 
రాష్ట్రంలో ఇవాళ పాలకొండ, తుని, పిడుగురాళ్ల మూడు ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రతినిధులమీద అధికార పార్టీ దౌర్జన్యాలు, కిడ్నాపులు చేస్తూ దమనకాండకు పాల్పడుతుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సజావుగా జరిపించాలని పదే, పదే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తలుపు తడుతున్నా కూడా... స్ధానికంగా ఉన్న ఎస్పీ, కలెక్టర్, ఎన్నికల అధికార్లను సరైన దిశగా నడిపించడం లేదని మండిపడ్డారు. కూటమి నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతుంటే అధికార్లు నిశ్చేష్టులై చూస్తున్నారని ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం ప్రకారం గెలుపోటములుంటాయని.. అలాంటిది వైఎస్సార్‌సీపీ తరుఫున గెలిచిన వారిని కిడ్నాప్ చేసి వాళ్లతో పోటీ చేయించడం ఏ రకమైన ప్రజాస్వామ్యం అని నిలదీశారు. రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలుపోటములు రాజకీయాల్లో సహజమని.. కానీ ఈ తరహా దాడులు, అధికారుల ఏకపక్ష నిర్ణయాలు అన్నీ రికార్డెడ్‌గా ఉంటాయన్న విషయాన్ని గుర్తించుకోవాలని హెచ్చరించారు.


దాడిశెట్టి రాజాపై దాడి.. దేవినేని అవినాష్‌ ఆగ్రహం 
స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రతినిధులను అన్యాయంగా, దౌర్జన్యంగా భయపెట్టి ఓట్లేయించుకుంటున్న టీడీపీ నేతల అకృత్యాలపై గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎన్నికల అధికార్లు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. తునిలో అయితే ఏకంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దాడికి దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పార్టీలు చేస్తున్న ఈ దాడులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం.. లేళ్ల అప్పిరెడ్డి
రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఉపఎన్నిక ప్రక్రియ మొదలైన తర్వాత కూటమి పార్టీలు చేస్తున్న దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్‌ను వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం నాలుగోసారి కలిసి ఫిర్యాదు చేశామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. అధికార పార్టీ ఆగడాలను, రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక విధానాలను,  వ్యవస్ధలను కాపాడాల్సిన అధికారులు చేష్టలుడిన చూస్తున్న వైనాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప రాష్ట్రంలో అధికారవ్యవస్ధలేవీ పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ పరిణామాలను గమనిస్తున్నారన్నారు. తిరుపతిలో ఒక్క కార్పొరేటర్ గెలిస్తే అక్కడ ఎలా పోటీచేస్తారని ప్రశ్నించారు. పిడుగురాళ్లలో 33 స్ధానాలకు ౩౩ వైఎస్సార్‌సీపీ .. టీడీపీ నిలబెట్టిన అభ్యర్ధి ఏ పార్టీ తరపున పోటీచేస్తున్నారని నిలదీశారు. తునిలో 30కు 30 స్ధానాలు వైఎస్సార్‌సీపీ గెలిస్తే అక్కడ మూడుదఫాలు ఉప ఎన్నిక ఎలా వాయిదా వేస్తారన్నారు. రకరకాల ప్రలోభాలకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. కక్కిన కూడుకు ఆశపడే రాజకీయ పార్టీలున్న పరిస్థితుల్లో వ్వవస్ధలైనా సక్రమంగా పనిచేయాలన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించామన్నారు. వందలాది టీడీపీ కార్యకర్తలు రోడ్లమీదకు వచ్చి.. హల్ చల్ చేస్తుంటే... సెక్షన్ 30 లాంటి వన్నీ కేవలం వైఎస్సార్‌సీపీ కోసమే అన్నట్టు అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపధ్యంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసమే ఛలో తునికి పిలుపునిచ్చామన్నారు. ఎన్నికలు సాఫీగా జరగడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కు మరోక్కసారి విజ్ఞప్తి చేస్తున్నామని అప్పిరెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement