హైదరాబాద్, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో మునుపెన్నడూ లేని రీతిలో ఈ దఫా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. సంక్షేమాభివృద్ధిలు, సామాజిక న్యాయం అజెండాగా అధికార వైఎస్సార్‌సీపీ ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడకముందే ప్రచార క్షేత్రంలోకి దిగింది. మరోవైపు.. పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు గందరగోళం నడుమ అయోమయంగానే సాగుతోంది కూమిటి పార్టీల ప్రచారం.
ఏపీలో ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5గం. ప్రచార పర్వం ముగియనుంది. మే 13వ తేదీన(సోమవారం) ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ చివరి నాలుగు రోజుల్లో ప్రచారం హోరెత్తె అవకాశాలున్నాయి.
ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లతో సంబంధం లేకుండా.. ఏడాది కిందటి నుంచే వైఎస్సార్‌సీపీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అభ్యర్థుల ఎంపిక.. అందునా సిట్టింగ్‌లలో ఎవరెవరిని తప్పిస్తారనేది ముందు నుంచే చెబుతూ పార్టీని, పార్టీ శ్రేణుల్ని మానసికంగా సిద్ధం చేస్తూ వచ్చారు. అందుకే సిట్టింగ్‌లలో కొందరికి సీట్లు దక్కకపోయినా.. పార్టీ కేడర్ మాత్రం ఎక్కడా చెక్కుచెదరలేదు. ఆ వెంటనే సిద్ధం సభలతో పార్టీకి ఉన్న అశేష ప్రజాదరణను దేశం మొత్తానికి చూపించిన సీఎం జగన్.. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర చేపట్టారు.
ఇక బస్సు యాత్ర ముగిసిన వెంటనే కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో.. మరోవైపు జగన్ కోసం సిద్ధం పేరిట మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి తమ విశ్వసనీయత ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో.. సీఎం జగన్ కేవలం తన పరిపాలన గురించి, చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అందుకే సీఎం జగన్ ప్రచారం ఏ రూపంలో ఉన్నా సరే.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇక కూటమి పార్టీల ప్రచారానికి ప్రజా స్పందనే కరువైంది. ఒకవైపు ఎన్నికల ప్రచార సభలకు జనం లేక వెలవెలబోతుంటే.. పిల్ల కాలువను సముద్రంలా చిత్రీకరించేందుకు ఎల్లో మీడియా ఆపసోపాలు పడుతోంది. యువగళం, ప్రజాగళం, వారాహి.. నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఎవరికి వారే సభలు పెట్టినా.. ఆఖరికి అంతా కలిసి ఉమ్మడిగా సభలు నిర్వహించినా.. జనం ఆసక్తి చూపించడం లేదు. ఆఖరికి.. సూపర్‌సిక్స్ ల్యాంటి గిఫ్ట్ ప్యాక్‌లతో ఎరవేసే యత్నం చేసినా.. ఛీ కొట్టేస్తున్నారు. కూటమి పార్టీల ప్రధాన నేతలు ప్రచారంలో జనాకర్షణ కోసం చెమటోస్తున్నారు.
ప్రస్ట్రేషన్‌తో చంద్రబాబు ప్రజాగళం సాగుతోంది. తన హయాంలో జరిగిన ఇది అని చెప్పలేకపోతున్నారు, ప్రజల్లో సెంటిమెంటును ఎమోషన్ను రెచ్చగొట్టేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తనకు అధికారం వస్తే ఇలా చేస్తానని ఇవి అమలు చేస్తానని చెప్పుకోలేకపోతున్నారు. ఇక ఊగిపోతూ పవన్ చేస్తున్న ప్రసంగాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అసలు ప్రచారం చేస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏం జరిగిందో తెలియదుగానీ.. ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పూర్తిగా దూరం ఉండిపోయారు. ఇంకోవైపు వైఎస్సార్‌సీపీ ఓట్లను చీల్చే కుట్రలో భాగంగా సీఎం జగన్‌ను.. ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు ఏపీ పీసీసీ చీఫ్, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల. ఇక్కడ కాంగ్రెస్ ప్రచారం చెప్పుకోవడం వేస్ట్.
కూటమిలో బీజేపీ కూడా ఉండడంతో.. చివరి నాలుగు రోజుల్లో ఆ పార్టీ అగ్రనేతలు ప్రచారంలోకి దిగనున్నారు. మోదీ, అమిత్ షాలు ప్రచారం చేయనున్నారు. మొత్తంగా చూసుకుంటే.. ఏపీ రాజకీయాల్లో మునుపెన్నడూ లేనంతంగా ప్రతిపక్ష కూటమి ప్రచారం అయోమయంగా, గందరగోళంగా సాగుతుండగా, ఒక షెడ్యూల్ ప్రకారం క్లారిటీతో వైఎస్సార్‌సీపీ ప్రచారంలో దూసుకుపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment