![AP: Nimmala Rama Naidu election campaign promises Rs 10000 for volunteers](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/nimala20222.jpg.webp?itok=h924VwdR)
ఎన్నికల ప్రచారంలో వలంటీర్లతో మాట్లాడుతున్న నిమ్మల రామానాయుడు
కూటమి ప్రభుత్వం వస్తే వలంటీర్ల
వేతనం రూ.10 వేలంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన ‘నిమ్మల’
గెలిచాక తనకు చించినాడ పూతరేకులు తెచ్చివ్వాలంటూ ప్రచారం
నాటి వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్న నెటిజన్లు
పూతరేకులు దొరకడం లేదంటూ సెటైర్లు హామీలు విస్మరిస్తే సోషల్ మీడియా
నుంచి తప్పించుకోలేరంటూ పోస్టులు
ఇప్పటికే నీకు 15 వేలు.. నీకు 15 వేలు.. వీడియోతో ఆటాడుకున్న నెటిజన్లు
సాక్షి, భీమవరం : ‘చంద్రబాబునాయుడుగారు, పవన్‌కళ్యాణ్‌గారు చెప్పారమ్మా.. మీ వలంటీరు జాబ్‌కు రూ.5 వేలు ఏ మూలకి సరిపోతాయి? ఖర్చులు బోలెడు పెరిగిపోయాయి కదా? మన ప్రభుత్వంలో వలంటీరు వ్యవస్థను కొనసాగిస్తాం. మీకు రూ.10 వేలు జీతం ఇస్తాం. రేపొద్దున్న మన ప్రభుత్వంలో అన్నయ్య ఇదిగో 10 వేలు అందుకున్నానని ఆనందంగా మన చించినాడ పూతరేకుల ప్యాకెట్ పట్టుకుని రావాలి’.. అంటూ పాలకొల్లు నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడు(Nimmala Rama Naidu)ఎక్కడ వలంటీరు కనిపించినా ఈ హామీ ఇచ్చేవారు.
రూ.10 వేలు తీసుకున్నాక ఆనందంగా చించినాడ పూతరేకుల ప్యాకెట్ కానుకగా ఇవ్వాలని చెప్పి ఆకట్టుకునే ప్రయత్నం చేసేవారు. అప్పట్లో ఆయన పాలకొల్లు కళాకారులనే మించిపోయారు. ఇంటింటికీ వెళ్లి అమ్మ, అక్క, చెల్లి, బావ, తమ్ముడు.. అని అందరితో వరసలు కలుపుతూ సూపర్ సిక్స్‌లో ఎవరెవరికి ఎంత నగదు వస్తుందో తనదైన శైలిలో వివరించేవారు. ఆనక ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు చేయించుకునే వారు. ఇప్పుడదే ఆయన్ను వెంటాడుతోంది.
పాలన పగ్గాలు చేపట్టి ఎనిమిది నెలలు కావస్తోంది. ఆర్థిక పరిస్థితి చూస్తుంటే హామీల అమలు సాధ్యంకాదంటూ సీఎం చంద్రబాబు చేతులెత్తేయ్యడంతో సూపర్‌సిక్స్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్, నిమ్మల ప్రసంగాలు, వాటి అమలుకు ఇప్పుడు చేతులెత్తేసిన దృశ్యాలతో రీల్స్ ద్వారా ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.
మంత్రి నిమ్మలకు రీల్స్ సెగ..
ఇక పాలకొల్లులోని ఒక ఇంటి వద్ద ఉన్న చిన్నపిల్లలను చూపిస్తూ నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అంటూ నాడు నిమ్మల రామానాయుడు చెప్పిన వీడియో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. తలి్లకి వందనం ఇప్పట్లో రాదని తెలిసి ఆ వీడియోకు గోదావరి వెటకారం, యాసను జోడించి మరీ నెటిజన్లు రీల్స్ చేసి మంత్రి నిమ్మలకు వ్యతిరేకంగా పోస్టు చేస్తున్నారు. కొందరైతే తమ సెల్‌ఫోన్లకు ఈ ఆడియోను రింగ్‌టోన్లుగా పెట్టేసుకున్నారు.
ఇలా గత రెండ్రోజులుగా నిమ్మల హామీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండవుతున్నాయి. అలాగే, మన ప్రభుత్వంలో మీకు రూ.10 వేలు వేతనం వచ్చిన ఆనందంతో కానుకగా తనకు చించినాడ పూతరేకులు తీసుకొచ్చి ఇవ్వాలంటూ వలంటీర్లతో చెప్పిన వీడియోలను జతచేసి సోషల్ మీడియాలో వేల సంఖ్యలో షేర్ అవుతున్నాయి.
వలంటీర్లను కొందరు కూటమి నేతలు వంచించిన తీరును ఎండగడుతుండగా, మరికొందరు వాటికి మద్దతుగా కామెంట్లు పెడుతూ నిరసన తెలుపుతున్నారు. పూతరేకులు దొరక్క కలవలేకపోయారంటూ వంటి పోస్టులతో ఆడుకుంటున్నారు. అధికారం కోసం హామీలిచ్చేయ్యడం, గద్దెనెక్కాక వాటిని విస్మరించడం పూర్వపు రోజులని.. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి తప్పించుకోలేరంటూ సెటైర్లు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment