ఈ కాలమ్ మీదే : చర్చా వేదిక
‘స్వర్గసీమ’పై జనవరి 28న ‘సాక్షి ఫ్యామిలీ’లో వచ్చిన రంగనాయకమ్మ గారి అభిప్రాయానికి ప్రతిస్పందన
ఈనాటి దృష్టితో విమర్శించడం తగునా!
- వి.ఎ.కె. రంగారావు, ప్రసిద్ధ సంగీత, నృత్య, కళా విమర్శకులు
నాకు రంగనాయకమ్మ రాత దాదాపు ఆరున్నర దశాబ్దాల కిందటే తెలుసు. ఆమె తండ్రి దద్దనాల సత్యనారాయణగారు వెలమ కులస్థులకై నడిపే ‘పద్మనాయక’ పత్రికలో ఆమె రచనలు వస్తుండేవి - దద్దనాల రంగనాయకమ్మనే పేరుతో! ఆ తరువాత ముప్పాళ్ల రంగనాయకమ్మ, అటు పిమ్మట రంగనాయకమ్మ అన్న పేర్లతో వచ్చినవి కొన్ని -- అన్నీ కాదు -- చదివాను. వాటి బాగోగులను చర్చించే అదను యిది కాదు. వాటిలో కొన్ని బాగు, మరికొన్ని ఓగు అని నేను చెప్పితే అది కేవలం నా అభిప్రాయమే అవుతుంది. నాపై అభిమానం ఉన్నవారూ, అందున్న తర్కం సమంజసంగా ఉందనుకొన్న వారూ మెచ్చుకుంటారు. మిగతావారు నొచ్చుకుంటారు.
ఎవరి అభిప్రాయాలూ నిత్యసత్యం కావు. ఆనాటికి సరిపోయే వ్యాఖ్యలు. రంగనాయకమ్మ తమ వ్యాసంలో ‘స్వర్గసీమ’ తీసిన దర్శక - నిర్మాత బి.ఎన్. రెడ్డిని దుయ్యబట్టారు. నా దృష్టిలోనే కాదు ఎందరి దృష్టిలోనో అది 11 వేల అడుగుల నిడివిలో దాదాపు పది మంచి పాటలు యిమిడ్చిన మంచి సాంఘికం. అందున్న నాయికను యీనాటి ఫెమినిస్టు దృష్టితో విమర్శించడం తగునా! 1940లలో స్త్రీలు అలానే పతిభక్తి కలిగి, భర్తకు అణిగిమణిగి ఉండుట విధాయకం అనుకొనేవారు కాదా! ఉంపుడుకత్తె పొమ్మంటేనే కావచ్చు తిరిగి వచ్చిన భర్తను ఆహ్వానించడంలో బిడ్డల భవిష్యత్తు పటిష్ఠం చేసుకోవడమూ ఒక భాగం కాకూడదా?
ఆ నాయిక ఏడవక ఏడవక ‘ఎనిమిది మంది పెళ్లాలూ, పదహారు వేల ప్రియురాళ్లూ’ (నరకాసురుని చెర విడిపించిన కృష్ణుని భార్యలే వీరూ! నన్నెవరో అడిగినట్లు వాళ్ల మేరేజ్ సర్టిఫికెట్ నేను చూశానా అని అడగకూడదు మరి!) ఉన్న కృష్ణుని ముందే ఏడవాలా, అక్కడ రాముని బొమ్మ పెట్టించాలని దర్శకునికి తెలియదా? అన్నారామె.
ఏ రాముడు? రాక్షసుని చెర విడిపించి, ‘నీ యిష్టమైన వాడితో వెళ్లు’ అని సీతతో అన్న రాముడా? నిండుచూలాలైన సీతను పిక్‌నిక్‌కి వెళ్లిరా అంటూ అడవిలో వదలి రమ్మని తమ్ముని ఆజ్ఞాపించిన రాముడా!!
చేపల పులుసులో వేసే చింతపండు కలగూర పులుసులోనూ వేస్తారు. అది పాత చింతపండా, కొత్తదా అన్నదానిపైనే రుచి ఆధారపడి ఉంటుంది.
ఆ సినిమా పాటల కోసమేనా అని అడిగారు. పోట్లాటల కోసం, తెలివైన దోపిడీలు చూపడానికోసం, వొల్లీవొల్లని ముసుగులో సెక్స్ చూపడానికోసం సినిమాలు తీయగా లేనిది పాటల కోసం తీయకూడదా!
పాటల విషయంలోనే ఆమె ముద్దపప్పులో కాలేశారు. ‘దునియా అంతా దుఃఖం బాబా, కళ్లు తెరిచి చూడు’ అని వారి ఉల్లేఖనం - సగం సైగల్ (దుఃఖ్‌కే అబ్ బీతత్ నాహి దిన్ - ‘దేవదాసు’), సగం కె.సి. డే (మన్‌కీ ఆంఖే ఖోల్ బాబా - ‘భాగ్యచక్ర’ ఉరఫ్ ‘ధూప్‌ఛా(వ్’).
చివరి విషయం మాత్రం సత్యం శివం సుందరంలా నిత్యం. మరి నేను సరాగమాల వాడిని కదా!
రచయిత్రులకూ ఒక జబ్బు ఉంది!
- కె.ఎన్.టి. శాస్త్రి, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న దర్శకుడు
రంగనాయకమ్మ సినిమా వాళ్లకి ఒక జబ్బు ఉంటుంది అన్న ‘రచన’ను చదివి, ఒక సినిమా దర్శకుడిగా స్పందించకపోతే, మా పురుష దర్శకులందరికీ అవమానమనిపించి, నా స్పందన! ‘స్వర్గసీమ’ చిత్రం బి.ఎన్. రెడ్డిగారు 1945లో తానే స్వయంగా రచించి, పెట్టుబడి పెట్టి, తీసిన సినిమా. డెబ్భై ఏళ్ల తర్వాత - దానిలోని స్త్రీ అలా ఏడ్చింది, ఇలా చేసిందని స్త్రీ వాదాన్ని మళ్లీ రంగనాయకమ్మ గారు చాదస్తంగా వేలెత్తి చూపితే, జీర్ణించుకోలేకపోతున్నాం.
ఆమె మర్చిపోయిన అసలు సంగతేమిటంటే, ఆ కళాకారుణ్ణి ‘స్వర్గసీమ’ అనుకుని పాడుకున్న గృహము నుండి, బయటికి లాక్కున్నది కూడా ఒక స్త్రీ మూర్తి. ఆమెలో ఇమిడి ఉన్న కళాకారిణిని బయటకు తీసుకురావడం కోసం అతని కృషి కూడా ఉంది. దానికి ప్రతిఫలంగా, అతనితో కొన్ని రోజులు సరదాలు తీర్చుకుని, తనకు ఒక జీవనోపాధి దొరికిన తక్షణం ఈ కళాకారుణ్ణి పక్కన పెడుతుంది. ఆ కాలఘట్టంలో, ఇంటర్నెట్ - సెల్లు లేవు కాబట్టి, ఈ గృహిణి, ఇలా బట్టలు కుట్టుకుని ‘ఆదర్శ గృహిణి’గా ఉండిపోయిందేమో! బహుశా, ఆమెకు అవకాశాలు అందుబాటులో ఉండి ఉంటే, మరోలా ఏడ్చి ఉండేదేమో!
నేటి స్త్రీలు, మన సినిమాల్లో దుమ్ము రేపేస్తుండడం మన రంగనాయకమ్మ గారికి తెలియదంటే, విడ్డూరంగా ఉండడమే కాకుండా కేవలం ఆమెకు అచ్చివచ్చిన విద్య (మగవారిని దుమ్మెత్తిపోయడం)ను ప్రదర్శించుకోవడానికే ఆమె ఈ వ్యాసాన్ని రచించిందని అనిపిస్తుంది. నేటి టీవీల్లో కనపడే భార్యామణులు, అత్తగార్లు ఎలా ప్రవర్తిస్తున్నారో కాస్త గమనించండి. వీరు సబలలు. మగవారిపై ఆధారపడకుండా తమ జీవనోపాధి వెతుక్కున్న స్త్రీమూర్తులు. ఇక్కడ అసలు సంగతేమిటంటే, ఆడ-మగ బొమ్మ-బొరుసులా -ఒక ఏకత్వానికి ప్రతిరూపమే కాకుండా ఒకరు లేక మరొకరు లేరనేది ప్రకృతి నియమం. ఈ విషయం రచయిత్రికి తెలియదంటే నమ్మలేము. పోతే, ఏ రంగంలోనైనా శక్తిసామర్థ్యాలను పెంపొందించుకుంటే, వారు స్వతంత్రంగా, కన్నీరు కార్చుకుంటూ, కుట్టుమిషన్‌కు పరిమితం కాకుండా ఉండవచ్చుగా? డెబ్భై సంవత్సరాలప్పటి కథను, ఆ కాలానికి అనువుగా తీసిన చిత్రం - ‘స్వర్గసీమ’. తీసినవారికి ఎలాంటి జబ్బులూ లేవు; ఆ కాలంలో వచ్చిన సినిమాను ఇలా స్త్రీ వాదంతో ఈ కాలంలో విమర్శించే రచయిత్రులకే జబ్బు ఉన్నట్టు అనిపిస్తుంది.
నేను 2002లో తీసిన ‘తిలదానం’ సినిమాలో కూడా భర్త వదిలి నక్సలైట్‌గా దూరమైతే, మా హీరోయిన్ ఏడుస్తూ ‘నరకాన్ని’ అనుభవిస్తూ ఉండగా, మామ చనిపోతే, ఇరుగుపొరుగు ‘ఈ ‘శని’కి దిక్కు-మొక్కు లేరు, ఈ కర్మ కాండలన్నీ మేమే చేయాల’ని విసుక్కుంటే, తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ఆ శవానికి సంస్కారాలు వద్దని, అనాథ శవంగా మార్చురీకి పంపి తన ప్రత్యేకతను నిలుపుకుంటుంది.
చెప్పొచ్చిందేమంటే, స్త్రీయెనా, పురుషుడైనా - తన వ్యక్తిత్వాన్ని నిలపెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ, తన జీవనోపాధికి ఒకరిపై ఆధారపడకుండా ఉంటే, స్వర్గసీమలు ప్రతి వాకిళ్లలోనూ కనబడతాయి.
పాఠకులకు ఆహ్వానం
‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ,
సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com
ఈనాటి దృష్టితో విమర్శించడం తగునా!
Published Mon, Feb 2 2015 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM
Advertisement