‘బ్రదర్స్ కరమజవ్’లో ఇవాన, అల్యోషా ఇద్దరూ ఒక హోటల్లో మాట్లాడుకుంటున్నప్పుడు – గ్లాసు తీసిన తర్వాత టేబుల్‌క్లాత్ మీద గ్లాసు అచ్చును గమనిస్తాడు ఇవాన్. అంత సున్నితమైన గమనిం పును పాఠకుల దృష్టికి తెచ్చిన దాస్తోయెవస్కీ ముద్ర అది. నోటి దుర్వాసనను చెక్ చేసుకోవడానికి ‘ద క్యాచర్ ఇన్ ద రై’లోని హోల్డెన్ కింది పెదవిని పైకి వంచి ముక్కుకు తగిలేలా గాలి వదులుతాడు. అసలైన సాహిత్య పరిమళాన్ని ఆనందించడానికి శాలింజర్ ఇచ్చిన వివరం అది.
‘ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ’లో సముద్రంలో చేపల వేటకెళ్లి వచ్చాక, సామగ్రిని అక్కడే వదిలేద్దామనుకుంటాడు వృద్ధుడు. అక్కడ వదిలేయడం ద్వారా ఎవరికైనా దొంగతనం చేయాలన్న టెంప్టేషన్ ఎందుకు పుట్టిం చాలని తన నిర్ణయం మార్చుకుంటాడు. ఈ వాక్యాన్ని రాసిన దొర హెమింగ్వే. ఆ రచయిత మాత్రమే రాయగలిగే వాక్యం ఆ రచయితను ప్రత్యేకంగా నిలబెడుతుంది.
ఆ పసి రాకుమారుడు కాంతి గల వీపు కానవచ్చేటట్లుగా బోరగిలపడటం – నున్నని వీపుగల కూర్మావతారంగా కనబడుతున్నదట. ఈ చిత్రిక ‘కవికర్ణ రసాయనము’ లోనిది. అదే పద్యంలో ఇంకా వివిధ భంగిమల్లో దశావతారాలను కళ్లకు కడతాడు సంకుసాల నృసింహకవి. అసలే సూర్యుడు ఒక అగ్నిగుండం. దానికితోడు సాయంకాలం కమలినీ విరహంలో ఉన్నాడు.
ఇంక ఆ వేడికి తట్టుకోలేక సముద్రంలో మునిగాడని సూర్యాస్తమయాన్ని దృశ్యమానం చేస్తుంది ‘భాస్కర రామాయణం’. సూర్యుడి వాడిౖయెన కిరణాల తాకిడికి వేగిపోయిన జగత్తు మీద వీచడం కోసం గుండ్రని విసనకర్రగా వికాసం పొందాడని చంద్రోదయాన్ని వర్ణిస్తాడు ‘విష్ణుమాయా విలాసము’ కవి. ఇక ‘గయోపాఖ్యానము’ కర్త – ఆమె సౌందర్యాన్ని చూపడానికి తాను కూడా తగనని అద్దం గుర్తించి, ముఖం చాటేసిందంటాడు. తెలుగు పద్యసాహిత్యం నిండా ఎన్నో గొప్ప వ్యక్తీకరణలు.
చలికాలంలో రైల్వే స్టేషన్‌లో అంచులు పగిలిన కప్పుల్లో టీ తాగుతున్న శాలువా ముసుగులో ఉన్న కూలీలను చిత్రించిన త్రిపుర నుంచి, చెరువులో బెకబెకమంటున్న కప్పలు చీకట్లో మనిషి ఒంటేలు శబ్దానికి ఒక క్షణం నిలిచి, మళ్లీ అరవడం మొదలుపెట్టాయని రాసిన అజయ్‌ప్రసాద్ దాకా ఆధునిక తెలుగు సాహిత్యంలోనూ కాలాన్ని నిలిపి చూపే ఎన్నో విలువైన క్షణాలు! తల్లి కాళ్లకు ఒంగి దండం పెట్టే కొడుకుకు తల్లి పాదాల పసుపు వాసన తగలడం; ఆఫీసు నుంచి ఇంటికి వస్తూనే ఉద్యోగిని చీర కుచ్చిళ్లలో చిన్నారి కొడుకు తలదాచుకోవడం; మౌన రుషిని తలపించే కప్ప కూర్చున్న భంగిమ... ఇలాంటి వ్యక్తీకరణలు సాహిత్యానికి ప్రాణం.
సూక్ష్మంలో మోక్షం చూపే వాక్యాలివి. ఒక దగ్గర కనబడిన వాక్యం ఇంకో దగ్గర ఉండదు. అది అక్కడికి సర్వ స్వతంత్రమైనది. ఆ కవిదో, ఆ రచయితదో ఇక వారిదే. అలాంటిది ఇంకొకరు ముట్టుకోరు. ఎంగిలి వాక్యాలు రాయలేదని చలాన్ని విశ్వనాథ సత్యనారాయణ ప్రశంసించింది... అలాంటి ఎంగిలి వాక్యాలు రాయని ఏ రచయితకైనా వర్తిస్తుంది. సాహిత్యానికి మరో వైపు కూడా ఉంది. పునరుక్తి దీని ప్రధాన లక్షణం. లేత భానుడి కిరణాలు భూమిని తాకుతున్నాయి అనే వాక్యాన్ని కథల్లో ఎన్నిసార్లు చదివుంటారు?
పడక్కుర్చీలో విశ్రాంతిగా కూర్చుని పత్రిక చదివే పరంధామయ్య ఆదివారపు అనుబంధాల్లో ఎన్నిసార్లు పరామర్శించి ఉంటాడు? పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా బాల్యంలోనే ప్రతిభను చాటే నాయకులు ఎందరు తగిలారు? చిట్టచివరన, అస్తమిస్తున్న సూర్యుడి వైపు ఎందరు కథానాయికలు పయనించి ఉంటారు? ఇలాంటి వ్యక్తీకరణలు ముందుగా ఎప్పుడు, ఎలా వచ్చాయో చెప్పగలిగే సాహిత్య చరిత్రలు మనకు లేవు. అవి వచ్చినప్పుడు తాజావే కావచ్చు. వాటికవే విలువైనవే కావచ్చు. కానీ వాడీ వాడీ అరగ దీయడం వల్ల పాతకంపు కొడతాయి.
ఈ జాడ్యం తెలుగుకే పరిమితమైనది అనుకోవాల్సిన పనిలేదు. ‘ఇట్ వజ్ ఎ డార్క్ అండ్ స్టార్మీ నైట్’ (అదొక చీకటి తుపాను రాత్రి) అనే వాక్యం ఎక్కడి నుంచి ఊడిపడిందనే చర్చ ఆంగ్ల సాహిత్యంలో ఈమధ్య బాగా జరిగింది. అదొక చీకటి తుపాను రాత్రి... అని గంభీరంగా ఎత్తుకోగానే తర్వాత ఏమయివుంటుందన్న కుతూహలం సహజంగానే పుడుతుంది. కానీ ఎన్నిసార్లు ఆ కుతూ హలం నిలుస్తుంది? కథల్లో మహాచెడ్డ ప్రారంభాలకు పెట్టింది పేరుగా ఈ వాక్యాన్ని అభివర్ణించింది ‘రైటర్స్‌డైజెస్ట్’ పత్రిక. క్లీషేకూ, మెలోడ్రామాకూ, అతిగా రాయబడిన వచనానికీ ఉదాహరణగా నిలిచిన ఈ వాక్యంతో ఎన్నో కథలు మొదలయ్యాయి.
బ్రిటన్‌ర చయిత ఎడ్వర్డ్ బుల్వర్ లిట్టన్ 1830లో రాసిన ‘పాల్ క్లిప్ఫోర్డ్’ అనే నవల ప్రారంభంతో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని కొందరి వాదన. ఆయన ఎంతో సాహిత్యం సృజించినప్పటికీ, ఈ ‘అపకీర్తి’ వాక్యంతో ఆయన కీర్తి నిలిచి పోయిందని సరదాగా వ్యాఖ్యానించారు విమర్శకులు. కానీ తమాషా ఏమిటంటే, 1809లో ‘ఎ హిస్టరీ ఆఫ్ న్యూయార్క్’ పుస్తకం రాస్తూ వాషింగ్టన్ ఇర్వింగ్ ఇదే వాక్యాన్ని వ్యంగ్యంగా ఉదాహరి స్తాడు. అంటే, అంతకు ఎంతోముందే ఈ వాక్యం సాహిత్యంలోకి చొరబడి పాఠకుల్ని ఉక్కిరిబిక్కిరి చేసిందన్నమాట! చిన్నకథల పితామహుడు అని చెప్పే ఎడ్గార్ అలెన్ పో కూడా దీన్ని వాడకుండా తమాయించుకోలేకపోయాడు.
‘మాస్టర్లు’ పునరుక్తులు వాడినా వారి ఇతరత్రా విస్తారమైన ప్రతిభలో అవి చెల్లిపోతాయి. కానీ సాహిత్య ‘విద్యార్థులు’ వాటికి దూరంగా ఉండడమే వారిని స్వతంత్రంగా నిలబెడుతుంది. జీవితపు అనుభవం లేకపోవడం, జీవితానికి చేరువగా వెళ్లి వాక్యాలను పిండు కోవడం తెలియనివారు మాత్రమే స్టాక్, ప్లాస్టిక్ వ్యక్తీకరణలను ఏ ప్రయత్న బరువూ లేకుండా తమ రాతల్లోకి తెచ్చేసుకుంటారు. ఎవరిని చదివినా ఒకేలా అనిపించడానికి ఇదే కారణం.
Comments
Please login to add a commentAdd a comment