ఒకరు మెచ్చినంత మాత్రాన అది గొప్ప రచన అయిపోదు.... | instructions to write novels | Sakshi
Sakshi News home page

ఒకరు మెచ్చినంత మాత్రాన అది గొప్ప రచన అయిపోదు....

Published Sun, Dec 8 2013 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM

ఒకరు మెచ్చినంత మాత్రాన అది గొప్ప రచన అయిపోదు....

ఒకరు మెచ్చినంత మాత్రాన అది గొప్ప రచన అయిపోదు....

 కొమ్ములు మొలవకుండా చెయ్యి మాత్రమే బాగా వొంపు తిరిగిన రచయితలు ఈ రాతను చదవవలసిన అవసరం ఏమాత్రం లేదని ఇందుమూలముగా ప్రకటించడమైనది.
 
 సాహితీ వర్క్‌షాపుల్లో, పుస్తకావిష్కరణ సభల్లోనూ రచన ఎలా ఉండాలో ఎలా రాయాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా బడా రచయితలు చెబుతూనే ఉంటారు. సాహిత్యవ్యాసాలైతే మరిన్ని వొచ్చిపడ్డాయి కుర్ర రచయితల వెన్ను నిటారుగా ఉంచడానికి. మరి పాఠకుల సంగతో?
  నెమ్మదస్తులు మరియు నోరు పెగలని పాఠకులు మాత్రం కొందరు పత్రికలకు ‘లేఖ’లు రాస్తున్నా ఎక్కువ మంది ముక్కు మూసుకొని కిక్కురుమనకుండా ఎవరు ఏం రాసి పారేసినా ఎలా అచ్చయినా చదివి ఎవరికీ చెప్పుకొనలేక గింజుకు పోతుంటారు. అట్టావారి సణుగుడు/ నసుగుడుకు ప్రతినిధిగా నన్ను నేను ఈ మధ్యనే నియమించుకున్నాను. రచయితలు పరస్పరం పొగుడుకుంటున్న రచనలు మాకు అనగా పాఠకులకు గొప్పగా కనిపించడం లేదని తెలుప విచారించుచున్నాను.


  కథలు/ రచనలు ఎలా రాయకుండా ఉండవచ్చునో, ఎలా రాసి రంపాన పెట్టకూడదో నాకు ముక్కుపచ్చలారని వయసుకే తెలిసేట్టు ఘాటయిన అనుభవాలు కలిగాయి. నదురుగా ఉన్న ఆడపిల్లని ఎంచుకుని ప్రేమించిపడేసినట్టుగా అప్పట్లో నేను తోచిన ఆలోచనను కథగా రాసి పాడేయాలని నిశ్చయించుకున్నాను.
 
  పి.యు.సి.లో మార్కుల సంఖ్య కన్నా కథలే ఎక్కువ రాయడం మంచిదని నాకు నేనే బోధించుకున్నాను. తీరా రాసేను గదాని తాతగారి దగ్గరకెళ్లాను. ఆయన ఏదో పెద్ద పుస్తకమే చదువుతున్నారు. నా మానవప్రయత్నం ఫలించి ఆయన నా కథ విన్నారు. ఆపై చక్కని చిరు బోసి నవ్వొకటి ఇచ్చి, నా చేతికి మొపాసా, చెహోవ్ అనే ఆసాములు రాసిన కథల సంపుటాలు ఇచ్చి, కథ రాసే ముచ్చట ప్లస్ సౌలభ్యం కలవారు ఇలాంటి పుస్తకాలు చదివితే మంచి జరుగుతుందని తాను చదివే పుస్తకం లోంచి తల ఎత్తకుండా సెలవిచ్చి ఊరుకున్నారు. పెద్దలకి ఇక బాగుపడే అవకాశం లేదనిపించేంత కోపం వచ్చింది నాకు. ఈ తల్లావజ్ఘల శివశంకరశాస్త్రి గారితో పనేంటిలెమ్మని వసారాలో కట్టుడుపళ్లు గాజు గ్లాసులోంచి తీస్తోన్న మొక్కపాటి నరశింహశాస్త్రిగారి దగ్గరకెళ్లాను. కథ కొంత విన్నారు. ఎలెన్ పో, మామ్ వంటి పెద్దలిచ్చిన నిర్వచనాలు చెప్పి, చాప్లిన్ స్వీయచరిత్ర, ఒకూరా కుకుజో రాసిన ‘బుక్ ఆఫ్ టి’ చేతిలో పెట్టి, శ్రీపాదవారి కథ దాని శైలీ గురించి చెప్పి ఆశీర్వదించి వెళ్లారు. ఇది పాడిగాదనుకుని పతంజలి శాస్త్రిగారి ముందు నిలబడ్డాను.
 
 తాతల కన్నా అన్నలే నయమని సముదాయించుకున్నాను. ఆయన ఇంగ్లిషు పెద్దలతో పాటు తెలుగు మహామహుల కథల జాబితా నోటితో చెప్పి అవన్నీ చదివాకా నేను రాసింది మరోసారి చదువుకుంటే నాకు అదంతా టానిక్కులా పని చేస్తుందని షేక్‌హ్యాండ్ ఒకటిచ్చి తప్పుకున్నాడు. చావెరుగని ఇంట ఆవాలు సాధించాలని బయలుదేరిన ముసలమ్మలా గింజుకున్నాను.
 
 తుదకు నిగనిగలాడే నల్లటి మీసం, గడ్డం వచ్చేనాటికి రాయడం కన్నా చదవటమే సులువని అనవసరంగా తెలిసింది. అబ్బూరి వరద రాజేశ్వరరావు, ఏఆర్ కృష్ణ, తిరుమల రామచంద్ర, గోరా శాస్త్రి, రాంభట్ల, బూదరాజు, జి.కృష్ణ వంటి పెద్దలు కూడా కొత్తగా రాసే రచయితలను ప్రోత్సహించడం కోసం, ఎగసన తొయ్యడం కోసం, మంచి కోరి దీవిస్తారే తప్ప కథలు ఎలా రాయాలో చెప్పి, రాయించలేరని నా వరకు అర్థమయింది. కథ రాయాలంటే, ఎలా రాయడం తెలియడం కంటే కథ ఎలా రాయకూడదో తెలియడం ముఖ్యమని తెలిసొచ్చింది. ఇంకా చాలా తెలిసొచ్చాయి.
 మనకు తెలిసిందంతా, చదివిందంతా జ్ఞానం అనుకొని ఆ కషాయంలో కథను ముంచి ఆ డికాక్షన్‌ని అక్షరాల్లో పెడితే అది రాసినవాడికి, చదివినవాడికి, రాసిన విషయానికీ పెద్ద అపకారం అనీ- తెలివితేటలనీ పరిశోధన వంటి పరిశీలనలనీ సోయ లేకుండా కథలోకి చొప్పించరాదనీ- ఆర్ట్‌లెస్‌గా, ఏ మాత్రం కళాకాంతులు లేని వాక్యాలతో రాస్తే అది కథకు విద్రోహం అనీ- కథలో టన్నుల కొద్దీ ‘స్టాక్ ఎక్స్‌ప్రెషన్’లు గల జీడిపాకం వాక్యాలు సాగదీయడం పరమ ఘోరం, నేరం అనీ- కేవలం కథ, సారాంశం, అంశం, విషయం వగైరాలు దృష్టిలో పెట్టుకుని వ్యాసం, కరపత్రం, సంపాదకీయం, ఉపన్యాసం వంటి ధోరణిలో వాక్యాలు ఇటుకల్లా పేరుస్తూ పోవడాన్ని ‘రచన’గా భావించడం బెయిలు దక్కకూడని నేరం అనీ...  తెలుసుకొని నలుగురికీ చెప్పాలనిపించింది.
 
 చలం, శ్రీపాద, మల్లాది వగైరా అనేక పెద్ద రచయితలను మించి వెలిగిపోయే రచన చేయాలంటే మన కథలపై మనకి నిర్దాక్షిణ్యమైన సద్విమర్శ, విశ్లేషణ, సమీక్షా అవసరమని గమనించాను. అలాగే బాపుగారి బొమ్మ ఉన్నంత మాత్రాన, పాత పత్రికల్లో పూర్వం అచ్చయినంత మాత్రాన అవన్నీ గొప్ప రచనలు కాలేవని గ్రహించాను. మనం దళితులమో, స్త్రీవాదులమో, ఈశ్వర, నిరీశ్వర, వామ పక్షవాదులమో, అరస, విరస, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ వాదులమో, చరిత్రకారులమో అయినంత మాత్రానగాని, అట్టివారు మెచ్చినంత మాత్రానగానీ ఏ కథా, ఏ నవలా గొప్పదో, మంచిదో అయి తీరాల్సినదేమీ లేదని ఇవాళ అనేక కథలు, నవలలూ చదువుతోంటే అర్థమయింది. తెలుగువారి గుండెల్లో నిద్రపోయేంతటి కథ అనే ఖడ్గసృష్టి జరగడం అంత సులువుగా సాగే పని కాదనీ అర్థమైంది. అలాగే మనం నలుగురితో మంచిగా ఉన్నంత మాత్రాన, మనం మంచివారిగా నటించినంత మాత్రాన మన కథ గొప్ప కథ అయిపోదని కూడా తెలిసి వచ్చింది. అలాగే శైలి కథను, సారాంశాన్ని మింగేస్తోందని కొందరు రచయితలన్నారు. ఒక గొప్ప శైలి వొచ్చి వస్తువునో, కథనో మింగేస్తున్న దృశ్యం నాకయితే ఎక్కడా కనబడలేదు.  అసలు శైలి గురించి, శిల్పం గురించి దృష్టి పెడుతున్నారా?
 
 కొందరు కళ (సాహిత్యం) అనే పేరుతో ‘ఎంకరేజ్‌మెంట్’ అనే లేబుల్ కింద ప్రతి రచయితనూ మెచ్చుకోవడం వెనుక ప్రయోజనకరమైన పాలిటిక్సూ లేకపోలేదు. సమస్త పాఠకులారా చూసి అడుగు వేసినట్టే చూసి, ఆగి, ఆలోచించి రచయితను అభినందించాలని మనవి. చివరగా నిరాశ పరచడం, లేనిదానిని పెకైత్తుకుని దీవించడం రెండూ కుర్ర రచయితలకు ప్రమాదమే. పాఠకులం మనం చదువుతున్నట్టే రచయితలూ అనేకం చదివితే వారికీ మనకీ మంచిదేగదానిపించి ఇంత గోల చేసేను.
 - శివాజీ
 
 అద్దేపల్లికి నాగభైరవ అవార్డు
 సుప్రసిద్ధ కవి డా. నాగభైరవ కోటేశ్వరరావు పేరున గత నాలుగేళ్లుగా ప్రకటిస్తున్న ప్రతిష్టాత్మక ‘నాగభైరవ పురస్కారాన్ని’ 2013 సం.కుగాను ప్రసిద్ధ కవి అద్దేపల్లి రామమోహనరావుకు ప్రకటించారు. డిసెంబర్ 15న నెల్లూరులో పురస్కార ప్రదానం. దీంతోపాటు నాగభైరవ స్ఫూర్తి అవార్డులను- జలదంకి ప్రభాకర్, శైలజామిత్ర, వడలి రాధాకృష్ణ, షేక్ కరీముల్లాలకు అందిస్తారు. వివరాలకు: 94402 02942
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement