న్యూఢిల్లీ: రచయతలు, సినీ దర్శకులు, చరిత్రకారులు తీసుకున్న నిర్ణయంపై వ్యాఖ్యానించేందుకు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ తిరస్కరించారు. అవసరమైన వ్యాఖ్యానాలు చేసి లేనిపోని వివాదాలు సృష్టించడం తనకు ఇష్టంలేదన్నారు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీగాగా పేరున్న అమితాబ్.. సెలబ్రిటీలు బాధ్యతాయుతంగా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉందని సూచించారు.
సెలబ్రిటీ వీడియో బ్లాగింగ్ అప్లికేషన్ వాకౌను గురువారం లాంచ్ చేసిన అమితాబ్ అవార్డులను వెనక్కి ఇస్తున్న వైనం స్పందించాలని మీడియా కోరినపుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ''అది ఒక ప్రత్యేక పరిస్థితి. ఆచితూచి మాట్లాడాల్సిన సమయం. సెల్రబిటీలు విచక్షణ మర్చిపోయి వ్యాఖ్యానిస్తే పరిస్థితి విషమించే అవకాశం ఉంది'' అని ఆయన కామెంట్ చేశారు. కొంతమంది సెల్రబిటీలు మనసుకు తోచిన అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారన్నారు. రెండో ఆలోచన లేకుండా ఇలా చేస్తున్నారని, నిజంగా వాళ్ల ధైర్యానికి మెచ్చుకోవాలంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
ఇలాంటి వివాదాస్పద అంశాలపై మాట్లాడేటపుడు సంయమనాన్ని పాటిస్తానని చెప్పుకొచ్చారు. వివాదాన్ని సృష్టించడం తనకు ఇష్టం ఉండదని, అనసర రాద్ధాంతం చేయడం తనకు నచ్చదన్నారు. వివిధ అంశాలపై తన అభిప్రాయాలను, అనుభవాలను సోషల్ మీడియాలో అభిమానులతో తరచూ షేర్ చేసుకుంటూ సోషల్ మీడియా్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ టైటిట్ కొట్టేసిన బిగ్ బి.. మేధావులు, రచయితలు తమ ప్రతిష్ఠాత్మక అవార్డులను వెనక్కి ఇచ్చేయడంపై మాత్రం స్పందించడానికి నిరాకరించారు
కాగా కల్బుర్గి దారుణహత్య, దేశంలో పెరుగుతున్న మత ఘర్షణలు, అసహనానికి నిరసనగా చాలామంది రచయితలు సాహిత్య అకాడమీ అవార్డులను, సినీ దర్శకులు తమ ప్రతిష్ఠాత్మక అవార్డులను వెనక్కి ఇస్తున్నట్టు ప్రకటించారు. అటు ఈ వ్యవహారంపై భిన్న స్వరాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.