‘‘ఇదేమిటి బావా ఇలా రాశావు? ఆయుధాలూ పరివారమూ లేకుండా శ్రీమహావిష్ణువు అక్కడికి వెళ్లి గజేంద్రుడిని ఎలా రక్షించాలనుకున్నాడు’’ అన్నాడు ఎగతాళిగా. పోతన చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.
ఒకరోజు శ్రీనాథుడు తన కూతురిని వెంట పెట్టుకొని మందీ మార్బలంతో కలిసి పోతన యింటికి వచ్చాడు. ఆ సమయంలో పోతన.. భాగవతంలో గజేంద్ర మో„ ఘట్టాన్ని రాస్తున్నాడు. శ్రీనాథుడు.. ‘‘ఏమి రాస్తున్నావు బావా?’’ అంటూనే తాళపత్రాన్ని చేతిలోకి తీసుకొని పైకి గట్టిగా చదివాడు. సిరికిన్ జెప్పడు శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడే / పరివారంబును జీరడ భ్రగ పతిన్ బన్నింపడాకర్ణి కాం / తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచో / పరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావ నోత్సాహియై ..
.. అని చదివి గట్టిగా నవ్వాడు. ‘‘ఇదేమిటి బావా ఇలా రాశావు? ఆయుధాలూ పరివారమూ లేకుండా శ్రీమహావిష్ణువు అక్కడికి వెళ్లి గజేంద్రుడిని ఎలా రక్షించాలనుకున్నాడు’’ అన్నాడు ఎగతాళిగా. పోతన చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. తర్వాత అంతా భోజనాలకు కూచున్నారు. సగం భోజన మయ్యాక పోతన కొడుకు పరిగెత్తు కుంటూ వచ్చి ‘‘మామయ్యా మీ కూతురు బావిలో పడిపోయింది’’ అని చెప్పాడు.
శ్రీనాథుడు ‘అయ్యో’ అంటూ గబుక్కున లేచి ఎంగిలి చెయ్యి కూడా కడుక్కోకుండా పెరట్లోకి పరుగెత్తుకొని వెళ్లి బావి లోకి తొంగి చూస్తూ ‘‘అమ్మా సుశీలా సుశీలా’’ అని పిలుస్తున్నాడు. అంతలోనే చెట్టు చాటునుంచి ‘‘ఏమిటి నాన్నా’’ అంటూ పరిగెత్తుకొచ్చింది సుశీల.
‘‘ఇదేమి సరసం బావా?’’ అన్నాడు శ్రీనాథుడు కోపంగా. అప్పుడు పోతన ‘‘బావా! నీ కూతురు బావిలో పడిందని వినగానే అలాగే చేయి కూడా కడుక్కోకుండా, నీ వెంట వచ్చిన నీ సేవకులను పిలవకుండా, తాడూ బొక్కెన లేకుండా నీవెలా పరిగెత్తుకొని వచ్చావు? పిల్లనెలా కాపాడుదామనుకున్నావు? నీ బిడ్డ పట్ల నీకెంత ఆతురత ఉన్నదో భక్తులు ఆపదలో వుంటే భగవంతుడు కూడా అంతే.
ఆయన దేవుడు కనుక ఆయన వెంట శంఖమూ, చక్రమూ గద పరివారమూ అంతా వచ్చారు. ఆ చక్రంతో మొసలిని ఖండించి గజేంద్రుడిని రక్షించాడు. భగవంతుడికి తన నిజమైన భక్తుల పట్ల అంత ఆర్తి వుంటుంది’’ అన్నాడు పోతన. అప్పుడు శ్రీనాథుడు పోతనను క్షమించమని అడిగాడు.
– డి.వి.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment