సాంస్కృతిక కేంద్రాలే నివాళులు | Telugu writers centers tribute to all | Sakshi
Sakshi News home page

సాంస్కృతిక కేంద్రాలే నివాళులు

Published Tue, Mar 29 2016 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 PM

సాంస్కృతిక కేంద్రాలే నివాళులు

సాంస్కృతిక కేంద్రాలే నివాళులు

తెలుగు భాషా, సంస్కృతులకు కొత్త చూపును, రూపును అందించిన సోమన్న, పోతనలు తెలంగాణ తత్త్వాన్ని తీర్చిదిద్దిన యుగ పురుషులు. వారి జన్మ స్థలాలనుఅభివృద్ధి పరడడానికి ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయం.
 
 పాశ్చాత్య దేశాలు తమ చారిత్రక, సాంస్కృతిక రంగాలను మలుపు తిప్పిన మహా పురుషుల స్మారక స్థలాలను భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా అభివృద్ధి పరిచాయి. మన దేశంలో తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర, సంస్కృతులున్నాయి. ఇక్కడి సంస్కృతి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. రాచరిక వ్యవస్థ కొనసాగిన కాలంలోనూ ప్రజలు  దాన్ని ప్రతిఘటించారు. ఒక జాతి చరిత్ర, సంస్కృతులు ఒక్క రోజులో నేర్పితేనో, నేర్చుకుంటేనో వచ్చేవి కావు.
 
 అవి ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమిస్తాయి. తెలంగాణలో ప్రజా సంస్కృతికి నాంది పలికిన యుగకర్తలు పాల్కురికి సోమన, బమ్మెర పోతన. సమైక్య రాష్ట్రంలో ఇక్కడి కవులకు, కళాకారులకు సముచిత స్థానం దక్కలేదన్నది వాస్తవం. పైగా మన సాహితీ వేత్తలకు తమ ప్రతిభ, పాటవాల పట్ల  ఉదాసీనత కూడా ఉంది. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండటమూ ఈ సంస్కృతి ప్రత్యేకతే కావచ్చు.  
 
 తెలుగు భాషా, సంస్కృతులకు ఒక కొత్త చూపును, రూపును అందించిన సోమన్న, పోతనలు తెలంగాణ తత్త్వాన్ని తీర్చిదిద్దిన యుగ పురుషులు. ఎక్కడో కన్నడ ప్రాంతంలో వ్యాపించిన వీర శైవాన్ని ఆలంబనగా చేసుకొని,  నన్నయ నుంచి సంప్రదాయబద్ధంగా వస్తున్న మార్గ కవితని కాదని దేశీ కవిత్వానికి పట్టం కట్టిన ప్రజాకవి పాల్కురికి సోమనాథుడు. కుల, మత, ప్రాంత, లింగ వివక్షతలకు అతీతంగా సాహిత్య సృజన కావించి సామాజిక వర్గాలకు ముఖ్యంగా అట్టడుగు, బడుగు బలహీన వర్గాలకు సాహిత్య స్థాయిని, స్థానాన్ని కల్పించిన వైతాళికుడాయన. సోమన, పోతనలకు మధ్య 200 సంవత్సరాల అంతరం ఉన్నా, భావజాలంలో అదే గుణాత్మకమైన మార్పు సాగడం విశేషం. సింగ భూపాలుని ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని రాచరిక వ్యవస్థను నిరసిస్తూ ‘ఇమ్మనుజేశ్వరాధముల్’ , ‘ధనమధాందుల కొలువేల తాపసులకు’ అనటం పోతనకే చెల్లింది. నన్నయ ఇత్యాధి కవులు రాజాస్థానాలలో ఉంటే సోమన, పోతనలు ప్రజాస్థానంలో నిలిచారు.
 
 అదే వీరి ప్రత్యేకత. వందల ఏళ్ళ క్రితమే ఇంతటి మహత్తరమైన భావజాలాన్ని తమ సాహిత్యం ద్వారా ప్రజలకు అందించిన మహాకవులను వారి జన్మ స్థలాలను విస్మరించి, వారి జయంతులను తూతూ మంత్రంగా ఇంత వరకు పట్టణాలలోనే జరిపారు. 1994లో నాటి తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య పేర్వారం జగన్నాథం వ్యక్తిగత చొరవ తీసుకొని పాలకుర్తిలో రెండు రోజులపాటు సోమనాథుని అర్ధ శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు.
 
 మహాకవుల జన్మ స్థలాలైన పాలకుర్తి, బమ్మెరలను చూడాలని ఎంతోమంది రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి సాహితీ ప్రియులు, పరిశోధకులు, ధార్మికులు వచ్చి ఆ గ్రామాలలో నెలకొన్న దయనీయ పరిస్థితులను చూసి చలించి పోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వాటి అభివృద్ధి దిశగా ముందడుగు వేయడం హర్షణీయం. ప్రధానంగా ఈ కర్తవ్యాన్ని పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారిపై కేసీఆర్ ఈ బాధ్యత మోపారు.
 
 సాహిత్య సాంస్కృతిక రంగాలంటే నిత్యం తపించే రమణాచారి కృషితో సోమన, పోతన నడయాడిన ప్రదేశాలు గొప్ప సాహిత్య సాంస్కృతిక కేంద్రాలుగా మారుతాయి. పవిత్ర స్థలాలను పర్యాటక కేంద్రాలుగా మార్చడం కన్నా, వాటిని పరిశోధనా కేంద్రాలుగా మార్చడం మంచిది. భాషా, సంస్కృతుల పరిరక్షణకు, పరిశోధనకు అవి నెలవులు కావాలి. తెలంగాణ భాష, చరిత్ర, సంస్కృతులు ప్రతిబింబించేలా అక్కడ ఒక మ్యూజియంలను ఏర్పాటు చేయాలి. నాటి నుంచి నేటి వరకు వచ్చిన సాహిత్యాన్ని ఆ ప్రాంతాలలోనే గ్రంథాలయాలను ఏర్పాటు చేసి, వాటిలో భద్రపరచాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో మరుగున పడిపోయిన మన కళారూపాలను వెలికి తీసేందుకు ఆడిటోరియంలను కూడా నిర్మించాలి. ఆ గ్రామాల్లోనీ మహాకవుల స్మారక చిహ్నాలను పరిరక్షించాలి. కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన హోదాను కల్పించిన నేపథ్యంలో తెలంగాణ కవుల రచనల్లోని విశేషాలను విశ్లేషించాలి. పాలకుర్తి, బమ్మెర గ్రామాలను సాంస్కృతిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. అప్పుడే మన భాషను, సంస్కృతిని సంరక్షించిన వారిమవుతాం.
 
 కడియం శ్రీహరి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. తెలంగాణ సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశానికి అభినందనలు. లండన్ పక్కన్నే ఉన్న షేక్స్‌పియర్ జన్మ స్థలాన్ని ఒక పుణ్య స్థలంగా చూస్తారు. చైనాలో, అనేక లాటిన్ అమెరికన్ దేశాలలో కవులను సాంస్కృతిక రాయబారులుగా చూస్తారు. మా వూరు పక్కననే బమ్మెర ఉంటుంది. కాబట్టి ఆనాటి మండలి చైర్మన్ చక్రపాణిని బమ్మెర తీసుకుపోయాను. బమ్మెర పోతన సమాధి దగ్గరకు కాలిబాటన నడచుకుంటూ పోయాం. ఆ మట్టిని చక్రపాణి తన సంచిలో వేసుకుని గర్వంగా వెళ్లాడు.
 
 ఇతర దేశాలలో మహాకవుల సమాధులను గొప్పగా చూసుకుంటారు. అలాంటి సత్కార్యాలకు  ఆర్థిక వ్యవస్థ దోహదం చేస్తుంది. తెలంగాణ ప్రజలు ఇక్కడి కవులను తమ గుండెల్లో దాచుకున్నారు.

ఇప్పటికీ బమ్మెరలోని గ్రామ బావిని పోతన బావి అనే ప్రజలు పిలుచుకుంటారు. ప్రజల నోటి నుంచి వచ్చే ఆ మాటే ఆ మహాకవికి నిత్య సన్మానం. పాల్కురికి సోమనాధుడు రాసిన కావ్యం తను నివసించే గుట్టకు, ప్రకృతికే అంకితమిచ్చారు. అందుకే ఇప్పుడది పాలకుర్తి సోమనాథుని గుట్ట అయ్యింది. వాల్మీకి కావ్యం అంకితమిచ్చింది వల్మిడికి అంటారు. బమ్మెర పోతన పుట్టిన ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగానే గాక సాంస్కృతిక కేంద్రంగా మార్చాలి. అక్కడ ఒక పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పాలి.
 -    వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త
శాసనమండలి మాజీ సభ్యులు
 చుక్కారామయ్య

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement