wcd India
-
ఎన్నారై భర్తలకు కేంద్రం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నారై పెళ్లిళ్ల వ్యవహారంలో వరకట్న వేధింపులు, మహిళల హత్యోదంతాలు తరచూ చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నారైతో పెళ్లి జరిగిన 48 గంటల్లో తప్పక రిజిస్టర్ చేయించాలనే నిబంధన తీసుకొచ్చింది. లేని పక్షంలో వారి వీసా, పాస్‌పోర్టు జారీని నిలిపేస్తామని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ గతంలోనే స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు చేపట్టారు. భార్యలను వదిలేసి తప్పించుకు తిరుగుతున్న ఎనిమిది మంది ఎన్నారై భర్తల పాస్‌పోర్టులను రద్దు చేసినట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు 70 ఫిర్యాదులు.. ఎన్నారై మోసాలను అరికట్టేందుకు నియమించిన కమిటీకి ఇప్పటి వరకు 70 ఫిర్యాదులు అందినట్టు సదరు అధికారి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది పాస్‌పోర్టులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈమేరకు సదరు వ్యక్తులకు నోటీసులు కూడా జారీ చేసినట్లు వెల్లడించారు. ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం..! ఎన్నారై పెళ్లిళ్ల వ్యవహారంలో జరుగుతున్న మోసాలను అరికట్టే దిశగా కేంద్ర మహిళా సంక్షేమ శాఖ, విదేశాంగ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఏడు రోజుల్లోగా పెళ్లి ధ్రువీకరణ పత్రం అందజేయకపోతే సదరు జంటకు వీసా, పాస్‌పోర్టు జారీ చేసేందుకు నిరాకరిస్తామని సంబంధిత శాఖ పేర్కొంది. అదే విధంగా ఎస్క్రో (వివాహం తర్వాత భార్యను తీసుకెళ్తానని మూడో వ్యక్తి సమక్షంలో పత్రము రాసుకుని ఆ తర్వాత అది చెల్లదని తప్పించుకోవడం) కేసుల్లో భార్యను వదిలేసి పారిపోయే ఎన్నారైల ఆస్తులను జప్తు చేసుకోవడంతోపాటు.. ఇలాంటి వివాహాల్లోని పలు సమస్యలను పరిష్కరించడంపైనా మంత్రివర్గ బృందం చర్చించింది. ఇందుకు నేర శిక్ష్మాస్మృతి నిబంధనలు, వివాహ చట్టం, పాస్‌పోర్ట్ చట్టాల్లో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. -
మీరిలా చేయడం సబబేనా..?
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా సీనియర్ ఉద్యోగి తనను ఆరేళ్ల పాటు లైంగికంగా వేధించారని, తన ఫిర్యాదుపై సంస్థ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఎయిర్‌హోస్టెస్ ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా, మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖ(డబ్ల్యూసీడీ) తప్పిదం వల్ల లైంగిక దాడికి గురైన ఆ ఎయిర్ హోస్టెస్ పేరు బహిర్గతమైంది. సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసిన డబ్ల్యూసీడీ.. ‘ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న మిస్***** మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీని కలిశారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధ చట్టం- 2013ను అనుసరించి ఆమె తన ఫిర్యాదును నమోదు చేశారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపించాల్సిందిగా మేనకా గాంధీ పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు, ఎయిర్ ఇండియా అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల(జూన్) చివరిలోగా విచారణ పూర్తి చేయాల్సిందిగా మేనకా గాంధీ ఆదేశించారంటూ’ నోట్‌ను విడుదల చేసింది. అయితే వెంటనే తప్పును తెలుసుకున్న డబ్ల్యూసీడీ.. బాధితురాలి పేరును తొలగించింది. అత్యాచార బాధితులు, అత్యాచారానికి గురైన మైనర్ల పేర్లు, ఫొటోలు బహిర్గతం చేయడం చట్టవిరుద్ధమన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచార ఘటన బాధితురాలి పేరు, ఫొటోను బహిర్గతం చేసిన మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టు ఆదేశించింది కూడా. అయితే ఇప్పుడు ఏకంగా మహిళా సంక్షేమ శాఖే బాధితురాలి పేరు బహిర్గతం చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నాలుగు రోజులు...3 వేల మంది
న్యూఢిల్లీ : అమ్మ తిట్టిందనో, మాష్టారు దండిచాడనో, స్నేహితులు గేలి చేశారనే కోపంలో క్షణికావేశంతో ఇల్లు విడిచి పారిపోతున్న చిన్నారులను తిరిగి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చాలనే ఉద్ధేశంతో ఢిల్లీ పోలీసులు ఒక నూతన విధానాన్ని రూపొందించారు. ఈ నూతన విధానంతో కేవలం నాలుగు రోజుల్లోనే దాదాపు 3000 మంది చిన్నారులను వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఇందుకుగాను ఈ ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్’కు కృతజ్ఞతలు తెలియజేసారు ఢిల్లీ పోలీసులు. ‘ఎఫ్ఆర్ఎస్’ కు సంబంధించిన పూర్తి వివరాలు... తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చాడానికి ఢిల్లీ పోలీసులు ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్’ (ఎఫ్ఆర్ఎస్) అనే ఒక నూతన విధానాన్ని రూపొందించారు. ఈ ‘ఎఫ్ఆర్ఎస్’ను పరీక్షించాల్సిందిగా ఢిల్లీ హై కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఈ ‘ఎఫ్ఆర్ఎస్’ను టెస్ట్ చేసేందుకు తప్పిపోయిన పిల్లల సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా పోలీసులు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖను కోరారు. కానీ వారు అందుకు నిరాకరించడంతో పోలీసులు ఈ ‘ఎఫ్ఆర్ఎస్’ ను పరీక్షించలేదు. ఈ నెల 5న కోర్టు ‘ఎఫ్ఆర్ఎస్’ పనితీరు గురించి ఢిల్లీ పోలీసుల ప్రత్యేక కమిషనర్ని (క్రైమ్) ప్రశించింది. కమిషనర్ కోర్టు ప్రశ్నకు బదులిస్తు ‘ఎఫ్ఆర్ఎస్’ను ఇంకా పరీక్షించలేదని తెలిపాడు. ఈ సమాధానంతో కోర్టు ఢిల్లీ పోలీసుల పనితీరు పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. అందుకు అధికారులు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి తమకు అవసరమయిన సమాచారం లభించలేదని తెలియజేసారు. అందువల్లనే ‘ఎఫ్ఆర్ఎస్’ను పరిక్షించలేదని తెలిపారు. దాంతో కోర్టు కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చింది. పిల్లలు తప్పిపోవడమనే సమస్య గత 20 సంవత్సరాల నుంచి చాలా తీవ్ర రూపం దాల్చిందని, ఇటువంటి విషయాన్ని మీరు తేలికగా తీసుకోవడం భావ్యం కాదని వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా కోర్టు ఆదేశాలను పాటించకపోతే మీ మీద కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు వెలువడిన కొన్ని గంటల్లోనే పోలీసు అధికారుల, మంత్రిత్వ శాఖ అధికారుల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రిత్వ శాఖ అధికారులు తమ వద్ద ఉన్న దాదాపు ఏడు లక్షల మంది తప్పిపోయిన చిన్నారుల వివరాలతో పాటు వారి ఫోటోలను కూడా పోలీసు అధికారులకు అందజేశారు. వివరాలను అందుకున్న అనంతరం పోలీసుల ‘ఎఫ్ఆర్ఎస్’ను పరీక్షించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ రాకేష్ శ్రీవాత్సవ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పొందుపర్చాడు. ఈ అఫిడవిట్లో ఉన్న వివరాల ప్రకారం పోలీసులు వివిధ సంస్థల్లో ఆశ్రయం పొందుతున్న దాదాపు 45 వేల మంది చిన్నారులను ఈ ‘ఎఫ్ఆర్ఎస్’ సాయంతో సరిపోల్చి వారిలో 2,930 మందిని తిరిగి వారి కుటుంబాలతో కలిపారని తెలిపారు. ఈ ‘ఎఫ్ఆర్ఎస్’లో ముందుగా పిల్లల ముఖ కవళికలను స్టోర్ చేసి అనంతరం వాటిని పిల్లల ఫోటోగ్రాఫ్‌లతో పోల్చి చూస్తారు. జాతీయ బాలల హక్కుల రక్షణ కమీషన్ సభ్యుడు యశ్వంత్ జైన్ తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారిని తిరిగి వారి కుటుంబాలతో కలపడానికి ఈ ‘ఎఫ్ఆర్ఎస్’ చాలా బాగా ఉపయోగపడుతుందంటూ దీని పనితీరును మెచ్చుకున్నాడు. ‘బచ్పన్ బచావో ఆందోళన్’ స్థాపకుడు భువన్ రిభూ ఈ ‘ఎఫ్ఆర్ఎస్’ను ఢిల్లీ పోలీసులకు ఉచితంగా ఇవ్వాలని ప్రతిపాదించాడు. దాంతో పాటు ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’ మాదిరిగానే ‘నేషనల్ చిల్డ్రన్స్ ట్రిబ్యునల్’ను ఏర్పాటుచేయాల్సిందిగా కోరాడు. -
భారత్ లో ‘మహిళా కార్పొరేట్ డెరైక్టర్ల గ్రూప్’ శాఖలు
ముంబై: కంపెనీల బోర్డుల్లోని మహిళా డెరైక్టర్ల గ్రూప్ (డబ్ల్యూసీడీ) తాజాగా భారత్‌లో అడుగుపెట్టింది. డబ్ల్యూసీడీఇండియా పేరిట ముంబై, ఢిల్లీలో తమ చాప్టర్స్ ప్రారంభించింది. ప్రస్తుత, కాబోయే మహిళా కార్పొరేట్ డెరైక్టర్లకు ఇది నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాంగా ఉపయోగపడగలదని డబ్ల్యూసీడీ తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూసీడీకి 70పైగా చాప్టర్లు ఉండగా, వచ్చే ఏడాది కాలంలో మరో ఏడు చాప్టర్లు ప్రారంభించనుంది. ఇందులో 3,500 మంది పైగా సభ్యులు ఉన్నారు. వీరు 7,000 పైచిలుకు బోర్డుల్లో డెరైక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.