ఆశలు వదిలేసుకుంటున్న తరుణంలో.. ఏదో అద్భుతం జరిగినట్లు నలుగురు చిన్నారులు అమెజాన్ అడవుల నుంచి బయటపడ్డారు. ఓవైపు 40 రోజులు వాళ్లు ఎలా అడవిలో గడిపారనే దానిపై ప్రపంచం చర్చించుకుంటుండగా.. అదే టైంలో రెస్క్యూ టీం శ్రమపై కొలంబియాలో సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. రియల్ హీరోలుగా అభివర్ణిస్తోంది ఆ దేశమంతా. ఈ తరుణంలో..
సదరు రెస్క్యూ గ్రూప్ ఆదివారం ఓ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. శుక్రవారం సాయంత్రం చిన్నారుల జాడ దొరకగా.. వాళ్లను ప్రత్యేక విమానంలో రాజధాని బోగోటాకు తరలించి చికిత్స అందించడంతో వాళ్లు కోలుకున్నట్లు తెలిపింది. హుయిటోటోకు చెందిన ఆ పిల్లలు సర్వైవర్ స్కిల్స్(ఆపదలో తమను తాము రక్షించుకోవడం) ద్వారా బయటపడినట్లు చెప్పింది. అంతేకాదు.. రెస్క్యూ టీంలో సభ్యుల్లో చాలా మంది స్థానిక తెగకు చెందిన వాళ్లే కావడం గమనార్హం.
‘‘ఆ నలుగురిలో పెద్ద లెస్లీ. తన చేతిలో చిన్న పసికందు ఉంది. నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆకలిగా ఉందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. వెనకాల ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లలో ఒక పిల్లాడు మమ్మల్ని చూసి కిందపడిపోయాడు. దగ్గరికి వెళ్లగానే ఏడుస్తూ మా అమ్మ చనిపోయిందని చెప్పాడు. వెంటనే వాళ్లకు ధైర్యం అందించాలనుకున్నాం. మేం మీ నాన్న పంపితేనే వచ్చాం. మీమూ మీ కుటుంబం లాంటివాళ్లమే అని చెప్పాం అని బృందంలోని సభ్యులు ఒక్కొక్కరుగా వివరించుకుంటూ వచ్చారు.
పిల్లల్ని రక్షించాక వాళ్లను నవ్వించేందుకు తాము చేయని ప్రయత్నమంటూ లేదని చెబుతున్నారు వాళ్లు. వాళ్లు ఆరోగ్యంగానే కనిపించారు. అయినా తాగడానికి నీళ్లు, ఎనర్జీ డ్రింక్స్ అందించాం. సరదాగా మాట్లాడుతూ ఉన్నాం. కానీ, వాళ్ల ముఖాల్లో నవ్వు రాలేదు. తల్లి లేదన్న బాధ నెలరోజులైనా ఆ చిన్నారుల ముఖం నుంచి వీడిపోలేదు. సరదాగా వాళ్లతో కబుర్లు చెప్పాం. పొగాకు తాగుతూ.. పాటలు పాడుతూ వాళ్లను నవ్వించే యత్నం చేశాం. అక్కడున్న పవిత్రమైన చెట్ల ఆకుల్ని పూజించాం. కథలు చెప్పాం. అందులో చిన్నారితో పాటు ఐదేళ్ల బాబు కూడా ఈ 40 రోజుల గ్యాప్‌లోనే పుట్టినరోజులు అయిపోయాయట. అందుకే వాళ్లకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పాటలు పాడాం. వాళ్లు తేరుకుంటున్న సమయంలోనే ఎయిర్‌లిఫ్టింగ్ చేశాం. ఆస్పత్రిలో వాళ్లు కోలుకుంటున్నారు అని బృందం సభ్యులు చెప్పుకొచ్చారు.
నాలుగు రోజులపాటు కొనప్రాణంతో..
ఇదిలా ఉంటే.. చిన్నారుల తండ్రి పిల్లలతో మాట్లాడాక ఆ వివరాలను ఆదివారం సాయంత్రం మీడియాకు వివరించారు. తన భార్య ప్రమాదం జరిగిన వెంటనే చనిపోలేదని పిల్లలు ఆ విషయం తనకు చెప్పారని ఆయన వివరించారు. మాగ్దలీనా ముకుటుయ్ తెగ నాయకురాలు. ఆమె ప్రమాదానికి గురయ్యాక తీవ్రంగా గాయపడింది. నాలుగు రోజుల పాటు ఆమె కొనప్రాణంతో కొట్టుమిట్లాడింది. ఆ టైంలో పిల్లలు ఆమె వెంటే ఉన్నారు. ఊపిరి ఆగిపోయేముందు ఆమె వాళ్లను.. ఎలాగైనా అడవి నుంచి బయటపడమని చెప్పి కన్నుమూసింది.
మే 1వ తేదీన ఆ పిల్లలు, వాళ్ల తల్లి, ఓ తెగ నాయకుడు ప్రయాణిస్తున్న తేలికపాటి విమానం ప్రమాదానికి గురైంది. విమానం ముందు భాగం ధ్వంసం కావడంతో.. అక్కడ ఉన్న ముగ్గురు(పిల్లల తల్లి కూడా) మరణించారు. అయితే వెనకభాగంలో కూర్చున్న పిల్లలు సురక్షితంగా బయటపడి.. భయంతో అడవి నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. దాదాపు 40 రోజుల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత వాళ్ల జాడను గుర్తించింది ఓర్డోనెజ్ గోమెస్ నేతృత్వంలోని బృందం. ఆ నలభై రోజులపాటు అడవుల్లో దొరికే పండ్లు, గింజలు, దుంపలు, వేళ్లు తిని బతికారు వాళ్లు. ఆ చిన్నారుల ధైర్యానికి ముఖ్యంగా తన తోబుట్టువుల్ని రక్షించుకునేందుకు లెస్లీ చేసిన సాహసానికి అభినందనలు కురుస్తున్నాయి.
ఇదీ చదవండి: డాల్ఫిన్ కోసం వెళ్తే.. జరిగింది ఇది!
Comments
Please login to add a commentAdd a comment