లోగో ఆవిష్కరిస్తున్న డీజీపీ
భువనేశ్వర్ : బాలికలపట్ల జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా రాష్ట్ర పోలీసు విభాగం ప్రత్యేక చైతన్య కార్యక్రమాన్ని ప్రారంభింది. ఈ కార్యక్రమం లోగోను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శర్మ ఆదివారం స్థానిక రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ నెల 28వ తేదీ సోమవారం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. యూనిసెఫ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు డీజీపీ వివరించారు. ఈ నెల 18వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బాలికలపట్ల అత్యాచారాల నివారణ కోసం చైతన్య కార్యక్రమం నిరవధికంగా కొనసాగుతుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఈ నెల 28న 15 పొరీ వ్యాన్‌లను ప్రారంభిస్తారు.
ఈ వ్యాన్‌లను రాష్ట్రవ్యాప్తంగా బాలికలపట్ల అత్యాచారాలకు వ్యతిరేకంగా అమల్లో ఉన్న చట్టాలు, ఇతరేతర సమగ్ర సమాచారాన్ని ప్రచారం చేస్తాయి. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో ఈ సమస్యతో సతమతమవుతున్న జిల్లాల్లో ఈ వ్యానులు ప్రచారం చేస్తాయి. ప్రతి జిల్లా కలెక్టర్, ఎస్పీ ఈ కార్యక్రమానికి సారథ్యం వహిస్తారు. ప్రచార రథం ఆగిన ప్రతి చోట 2 నుంచి 3 గంటలపాటు చైతన్య సమావేశాల్ని నిర్వహిస్తుందని డీజీపీ వివరించారు. ప్రజా ప్రతినిధులు, కమ్యూనిటీ సభ్యులు, ప్రతిష్టాత్మక వ్యక్తులు, స్వయం సహాయక బృందాలు, పిల్లల్ని ఈ సమావేశంలో పాల్గొనేందుకు ప్రేరేపిస్తారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎక్కడికక్కడ వీధుల్లో లఘు నాటికలు, జానపద సంగీత నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తారు. యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఈ కళాకారులకు శిక్షణ కల్పించారు. జిల్లా కళా సాంస్కృతిక సంఘం కార్యకర్తలను ఈ శిక్షణతో తీర్చిదిద్దారు.
Comments
Please login to add a commentAdd a comment