రాష్ట్రంలో అంతులేని అఘాయిత్యాల పర్వం
నాలుగు నెలల్లోనే 91 మంది చిన్నారులు, బాలికలపై అత్యాచారాలు
వారిలో ఏడుగురి హత్య
చంద్రబాబు సొంత జిల్లా తిరుపతిలో 9 మంది చిన్నారులపై అత్యాచార ఘటనలు
రెడ్‌బుక్ సేవలో పోలీసు యంత్రాంగం
సాక్షి, అమరావతి: ఆకాశాన హరివిల్లు విరిస్తే అది తమకోసమేనని ఆనందించే పసిపాపలను కామ పిశాచాలు నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నాయి! పుస్తకాల బ్యాగు భుజాన వేసుకుని తుళ్లింతలతో స్కూల్‌కు వెళ్లే బాలికలపై పాశవికంగా లైంగిక దాడులకు తెగబడుతున్నాయి. భవిష్యత్‌పై కోటి ఆశలతో కాలేజీకి వెళ్లే విద్యార్థినులపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. చిన్నారులు, బాలికల ఆర్తనాదాలు అరణ్య రోదనగా మారుతున్నాయి. కూటమి సర్కారు చేతగానితనం తల్లిదండ్రులకు గుండెకోత మిగులుస్తోంది! రెడ్‌బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తున్న పోలీసు వ్యవస్థ చేష్టలుడిగి చూస్తోంది.
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో కామ పిశాచాలు ఓ చిన్నారిని అపహరించి హత్యాచారానికి తెVý బడ్డా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదు! నాలుగు నెలలు గడిచినా కనీసం మృతదేహాన్ని అయినా బాధిత కుటుంబానికి అప్పగించలేకపోయామనే అపరాధ భావన లేకపోవడం విభ్రాంతి కలిగిస్తోంది!! చంద్రబాబు సొంత జిల్లా తిరుపతిలో 9 మంది చిన్నారులపై అత్యాచారాలు వెలుగులోకి వచ్చాయి. చిత్తూరు జిల్లాలో ఐదుగురు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఓ విద్యార్థిపై సామూహిక లైంగిక దాడి చోటు చేసుకుంది. నాలుగు నెలల్లో రాష్ట్రంలో 91 మంది చిన్నారులు, విద్యార్థినులపై అత్యాచారాలు, లైంగిక దాడుల ఘటనలు జరిగాయి. వీరిలో ఏడు మందిపై అత్యాచారానికి పాల్పడి హతమార్చడం రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల దుస్థితికి నిదర్శనం.
ఆగని అత్యాచారకాండ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రౌడీమూకలు, అసాంఘిక శక్తులు విశృంఖలంగా రెచ్చిపోతున్నాయి. ఐదేళ్ల అజ్ఞాతవాసం తరువాత సంకెళ్లు తెగినట్టుగా యథేచ్చగా సంచరిస్తూ బరితెగించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నాయి.
పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో అచ్చోసిన ఆంబోతుల్లా దాడి చేస్తున్నాయి. ప్రధానంగా చిన్నారులు, విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని కీచక పర్వానికి ఒడిగడుతున్నాయి. వరుస అత్యాచారాలతో రాష్ట్రం హడలిపోతుంటే ప్రభుత్వం మాత్రం మొద్దునిద్రలో జోగుతోంది.
పోలీసుల అస్త్ర సన్యాసం
బాలికలు, విద్యార్థినులు, మహిళల భద్రతను టీడీపీ కూటమి ప్రభుత్వం గాలికి వదిలేయడంతో పోలీసులు పూర్తిగా అస్త్ర సన్యాసం చేశారు. అనంతపురం జిల్లాలో జరిగిన దారుణమే దీనికి తార్కాణం. పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ ఈ ఏడాది జూలైలో ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐషర్ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.
తాపీగా ఎనిమిది రోజుల తర్వాత కేసు నమోదు చేసినా ఉపసంహరించుకోవాలని బాధిత కుటుంబాన్ని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. ‘ముఖ్య’నేత ఆదేశించినట్టుగా రెడ్‌బుక్ రాజ్యాంగం అరాచకాలకు కొమ్ముకాయడం.. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడమే తమ కర్తవ్యంగా పోలీసు శాఖ భావిస్తోంది. చిన్నారులను అపహరించారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదు. అందుకు పుంగనూరులో మైనార్టీ బాలిక ఉదంతమే అందుకు నిదర్శనం.
బాలిక అపహరణకు గురైనా విస్తృత గాలింపు చర్యలు చేపట్ట లేదు. మూడు రోజుల తర్వాత నాలుగు కి.మీ. దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అదే పోలీసులు ఫిర్యాదు రాగానే స్పందించి ఉంటే ప్రాణాలతో కాపాడగలిగేవారు. యథా చేతగాని ప్రభుత్వం..తథా చేష్టలుడిగిన పోలీసు! అన్నట్టుగా తయారైంది రాష్ట్రంలో పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment