ముస్లిం బాలిక అంజుమ్ అపహరణను పట్టించుకోని చంద్రబాబు
నాలుగు రోజుల తరువాత మృతదేహాన్ని అప్పగించి చేతులు దులుపుకున్న వైనం
మదనపల్లిలో కాగితాలు కాలితే తక్షణమే స్పందించిన సీఎం
ఆఘమేఘాలపై హెలికాప్టర్లోడీజీపీ, సీఐడీ చీఫ్‌లను పంపిన బాబు
సొంత జిల్లాలో బాలిక కిడ్నాప్, హత్యపై కనీస స్పందన లేదు
తిరుపతిలోనే ఉన్నా పట్టించుకోనిఉప ముఖ్యమంత్రి పవన్
ముచ్చుమర్రిలో బాలిక ఉదంతంలోనూ అదే నిర్లక్ష్యం
సీఎం చంద్రబాబు తీరుపైసర్వత్రా ఆగ్రహావేశాలు
సీఎం కనీసం పట్టించుకోలేదని బాధితుల ఆవేదన
సాక్షి, అమరావతి / పుంగనూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబబునాయుడు కాగితాలకు ఇచ్చిన విలువ రాష్ట్రంలో ప్రజల భద్రతపట్ల.. మరీ ముఖ్యంగా మహిళలు, బాలికల రక్షణకు ఇవ్వడంలేదనడానికి పుంగనూరులో ఏడేళ్ల ముస్లిం బాలిక హత్యోదంతం మరో నిదర్శనం. అగ్నిప్రమాదంలో నాలుగు ఫైళ్లు తగలబడితే తీవ్రంగా స్పంచించిన చంద్రబాబు.. రాష్ట్రంలో బాలికలు, మహిళలను అపహరించుకుని పోయి అత్యాచారాలు చేస్తున్నా, హత్యలకు తెగబడుతున్నా పట్టించుకోవడంలేదు.
సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారిక హోదాతో కూడిన బాధ్యతతోనే కాదు.. కనీసం మానవతా దృక్పథంతో కూడా స్పందించకపోవడంపట్ల సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. రాజకీయ కక్షలు, వేధింపులకు ఇస్తున్న ప్రాధాన్యం, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు దు్రష్పచారాలకు కేటాయిస్తున్న సమయంలో పదో వంతు కూడా బాలికలు, మహిళల రక్షణకు ఉపయోగించడం లేదని చిత్తూరు జిల్లా పుంగనూరులో ముస్లిం బాలిక అశ్వియ అంజుమ్ విషాదాంతం రుజువు చేస్తోంది.
రెండు నెలల క్రితం ముచ్చుమర్రిలో వాసంతి తప్పిపోయిందన్నా బాబు సర్కారు పట్టించుకోలేదు. చివరకు మృతదేహాన్ని కూడా అప్పచించలేక వాసంతి చనిపోయిందని ఓ మాట తల్లిదండ్రులకు చెప్పేసి ప్రభుత్వం తప్పించుకొంది. తమ కుమార్తె కనిపించడంలేదంటూ పుంగనూరుకు చెందిన ముస్లిం కుటుంబం మూడు రోజులు వేనోళ్ల వేడుకొన్నా బాబు ప్రభుత్వంలో కదలిక లేదు.
మూడు రోజుల తర్వాత బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పి అయిందనిపించేసుకుంది. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు కనీసం పట్టించుకోవడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీస స్పందన లేని చంద్రబాబు
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ముస్లిం బాలిక అశ్వియ అంజుమ్‌ను అపహరించి హత్య చేసినా ఆయన కనీసం స్పందించకపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. చిన్నారి విషాదాంతంపై ఆయన ఇప్పటి వరకు స్పందించనే లేదు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం సంభవించి కొన్ని కాగితాలు కాలిపోతే చంద్రబాబు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఆ ఉదంతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకు వైఎస్సార్‌సీపీపై దు్రష్పచారం చేశారు.
అంతేకాదు డీజీపీ ద్వారకా తిరుమల రావు, సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్‌ను వెంటనే ప్రత్యేక హెలికాప్టర్‌లో మదనపల్లి పంపించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియానూ అక్కడికి పంపారు. ఎలాగైనా వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించాలని ఒత్తిడి చేశారు.
కానీ పుంగనూరులో ఏడేళ్ల బాలిక అంజుమ్‌ను ఆగంతకులు అపహరించుపోతే ముఖ్యమంత్రిగా కనీసం స్పందించలేదు. డీజీపీతో మాట్లాడలేదు. సత్వరం స్పందించి బాలికను సురక్షితంగా తీసుకురావాలని జిల్లా ఎస్పీకీ చెప్పలేదు. అసలు ఆ విషయాన్నే పట్టించుకోలేదని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
తిరుపతిలోనే ఉన్నా.. స్పందించని పవన్
ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 34 వేలమంది బాలికలను అపహరించారని దు్రష్పచారం చేసి, మహిళల రక్షణ పట్ల పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గత మూడు నెలలుగా రాష్ట్రంలో యథేచ్ఛగా బాలికలు, మహిళల అపహరణ, అత్యాచారాలపై మౌనవత్రం పాటిస్తున్నారు. కళ్లెదుట జరుగుతున్న ఘోరాలపై స్పందించడమే లేదు.
నంద్యాల జిల్లా ముచ్చిమర్రులో వాసంతి కిడ్నాప్, హత్య ఉదంతంపై పవన్ పోలీసు శాఖను ప్రశ్నించలేదు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్ అపహరణ, హత్యకు బాధ్యత తీసుకోవడంలేదు. బుధ, గురువారాల్లో తిరుపతిలోనే ఉన్న ఆయన.. సమీపంలోని పుంగనూరులో జరిగిన దారుణాన్ని పట్టించుకోలేదని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
చిన్నారి అంజుమ్ హత్యపై ముస్లింల ఆగ్రహం
చిన్నారి అశ్వియ అంజుమ్(7) కిడ్నాప్, హత్యపై ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరు రోజులు గడుస్తున్నా నిందితుల ఆచూకి కనుగొనలేకపోయారని మండిపడ్డారు. శుక్రవారం నమాజ్ అనంతరం అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో వేలాది ముస్లింలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. జాతీయ పతాకాన్ని పట్టుకుని అశ్వియ ఫోటోలను ప్రదర్శిస్తూ ఎంబిటి రోడ్డులోని మదీన మసీదు నుంచి తూర్పు మొగసాల, సుబేదారు వీధి, పోస్టాఫీసు వీధి, నాగపాళెం, ఇందిరా సర్కిల్, పోలీస్‌స్టేషన్ మీదుగా గోకుల్ సర్కిల్ చేరుకున్నారు.
అక్కడ సమావేశమై చిన్నారి హత్య కేసులో నిందితులను వెంటనే పట్టుకొని, ఉరితీయాలని డిమాండ్ చేశారు. చిన్నారి కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ముస్లింల నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. ముస్లింల ప్రదర్శనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.
Comments
Please login to add a commentAdd a comment