సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగం పటిష్ట వ్యూహం.. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు సమన్వయంతో పని... పగలు రాత్రి లేకుండా అహర్నిశలు శ్రమ... ఫలితంగా ‘ఆపరేషన్ సభ’పూర్తిగా సక్సెస్ అయింది. ఆదివారం నాటి ప్రగతి నివేదన సభను అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పూర్తి చేశారు. అక్కడక్కడా ట్రాఫిక్ జామ్, కొంగరకలాన్‌లోని పార్కింగ్ ప్రాంతంలో చిన్న, చిన్న ఇబ్బందుల మినహా ఆద్యంతం సజావుగా పూర్తయింది. కార్యక్రమం ముగిసిన తర్వాత వాహనాలను క్రమపద్ధతిలో పంపించారు. భద్రత ఏర్పాట్లలో భాగంగా సభా వేదిక, చుట్టపక్కల ప్రాంతాల్లో మొత్తం 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్యాన్ టిల్ట్ జూమ్ (పీటీజెడ్) టెక్నాలజీతో పని చేసే కెమెరాలు అదనంగా అమర్చారు. వీటన్నింటినీ అనుసంధానిస్తూ కొంగరకలాన్‌లో ఓ కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు. మరోపక్క డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఇక్కడే ఉన్న డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆద్యంతం పర్యవేక్షించారు. రాత్రి సభ ముగిసిన తర్వాత సైతం గంటలపాటు డీజీపీ తన కార్యాలయంలోనే ఉండి తిరిగి వెళ్తున్న వాహనాల విషయంలోనూ శ్రద్ధ తీసుకున్నారు.
ఫలితాలు ఇచ్చిన హోల్డింగ్ ఏరియాలు...
సభకు వచ్చే లక్షలాది వాహనాల కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఓఆర్‌ఆర్, సర్వీసు రోడ్లు, ఇతర కీలక రహదారుల్లో హోల్డింగ్ ఏరియాలు కేటాయించారు. ప్రతి రెండు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఇవి ఉన్నాయి. వెనుక వచ్చే వారికై వేచి చూడటం, ముందున్న వాహనాలు వెళ్లే వరకు ఆగడం కోసం వాహనాలను రహదారిపై నిలిపేస్తుంటారు. ఇలా చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఈ ఏరియాలు కేటాయించారు. వాహనాలు వీటిలో నిలవడంతో పెద్దగా ఇబ్బందులు కలగలేదు. సర్వీసు రోడ్లతో పాటు ఎక్కడైనా వాహనాలు ఆగితే తరలించేందుకు 50 క్రేన్లు సిద్ధంగా ఉంచారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా భారీగా వచ్చిన వాహనాలతో అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ తప్పలేదు. ప్రధానంగా ఓఆర్‌ఆర్‌కు సమీపంలో ఉన్న సాగర్ రింగ్ రోడ్, ఎల్బీనగర్, నాగోల్, తెలంగాణ పోలీసు అకాడెమీ, గచ్చిబౌలి జంక్షన్లతో పాటు పెద్ద అంబర్‌పేట్, తూప్రాన్‌పేట్, కొంగర విలేజ్, రాచలూరు గేట్, పల్మాకుల, కండ్లకోయల్లోని ఎంట్రీ, ఎగ్జిట్‌పాయింట్స్ వద్ద వాహనాలు ఆగక తప్పలేదు. ఓ దశలో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగారు. తెలంగాణ పోలీసు అకాడెమీ జంక్షన్ వద్ద ఆయనే నిల్చుని పరిస్థితిని సమీక్షించారు. మరోపక్క శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో ర్యాంప్, పార్కింగ్ ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇవి మట్టితో నిర్మించినవి కావడంతో కొన్ని వాహనాలు దిగబడ్డాయి.
సోమవారమే ట్రాక్టర్ల పయనం
ప్రగతి నివేదన సభ నేపథ్యంలో ఆదివారం ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నగరం, సైబరాబాద్, రాచకొండ పరిధిలతో పాటు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) పైనా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. ఆదివారం ఓఆర్‌ఆర్‌పై ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల ప్రవేశం నిషే«ధించారు. ఈ నేపథ్యంలోనే సభకు ట్రాక్టర్లపై వచ్చేవారు శనివారం సాయంత్రానికే ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. వీటిని సోమవారం ఉదయమే తిరిగి వెళ్ళేందుకు అనుమతించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment