మహేందర్‌రెడ్డికి జ్ఞాపికను బహూకరిస్తున్న హోంమంత్రి మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్‌శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ) ఎం.మహేందర్‌రెడ్డి శనివారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మహేందర్‌రెడ్డి పదవీ విరమణ సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఉదయం 8:25 గంటలకు పరేడ్ నిర్వహించనున్నారు.
నూతన డీజీపీగా అంజనీకుమార్ శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు అంజనీకుమార్‌కు ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి గౌరవ లాఠీని అందిస్తారు. అనంతరం అంజనీకుమార్‌ను డీజీపీ కుర్చీలో గౌరవప్రదంగా కూర్చోబెట్టనున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మహేందర్‌రెడ్డికి సీనియర్ అధికారులు, ఇతర సిబ్బంది వీడ్కోలు పలకనున్నారు.
మహేందర్‌రెడ్డి సేవలు అభినందనీయం: హోంమంత్రి
డీజీపీగా పదవీ విరమణ పొందుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డిని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ శాలువాతో సత్కరించారు. ఈ మేరకు లక్డీకాపూల్‌లోని హోంమంత్రి కార్యాలయానికి వెళ్లిన డీజీపీ మహేందర్‌రెడ్డి హోంమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డికి మంత్రి చార్మినార్ జ్ఞాపికను అందించారు.
పోలీస్ అధికారిగా వివిధ హోదాల్లో మహేందర్‌రెడ్డి చక్కటి సేవలందించారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే రాష్ట్ర పోలీసు శాఖను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేశారని ప్రశంసించారు. విధినిర్వహణలో తనదైన ముద్రవేశారని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, డీజీపీగా, ఇతర అనేక హోదాల్లోనూ పనిచేసి అందరి మన్ననలు పొందారని హోంమంత్రి గుర్తు చేశారు.
డీజీపీగా మహేందర్‌రెడ్డి పనిచేసిన ఈ ఐదేళ్లలో తెలంగాణ పోలీసు శాఖను దేశంలోనే అగ్రభాగాన నిలిపారని పేర్కొన్నారు. గురువారం బదిలీలు పొందిన హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, అడిషనల్ డీజీపీలు జితేందర్, సంజయ్ కుమార్ జైన్ తదితరులు సైతం హోంమంత్రిని కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment