సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో భారీగా కానిస్టేబుళ్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుమారు 18 వేల వరకు కానిస్టేబుల్, ఎస్సై పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు ఏప్రిల్ రెండో వారం లేదా మూడో వారంలో నోటిఫికేషన్ రానుందని పోలీసుశాఖ ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015లో 9,600 కానిస్టేబుల్ పోస్టులు, 539 ఎస్సై పోస్టులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైనవారు రెండు నెలల క్రితమే శిక్షణ పూర్తిచేసుకుని ఉద్యోగాల్లో చేరారు. ఎస్సై పోస్టులకు ఎంపికైనవారికి మరో మూడు నాలుగు నెలల్లో శిక్షణ ముగియనుంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో.. భారీగా పోలీసు పోస్టులు భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో 3,500 కానిస్టేబుల్ పోస్టులకు ఆర్థికశాఖ గతేడాది అక్టోబర్‌లోనే ఆమోదం తెలపగా.. తాజాగా మరో 14 వేలకుపైగా పోస్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
వయసు సడలింపు ఉంటుందా?
పోలీసు పోస్టుల భర్తీలో ఈసారి కూడా అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఇవ్వాలా? వద్దా అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని పోలీస్ శాఖ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిసింది. వారం రోజుల్లో ఈ విషయం తేలే అవకాశముందని భావిస్తున్నారు. ఇక గతంలోలా రిజర్వేషన్ల అ మలు సమస్య వంటివి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చూడాలని ఉన్నతాధికారులు రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment