సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రేమ, పెళ్లి వ్యవహారపు కేసుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని అన్ని జిల్లాల పోలీసు అధికారులను పోలీసు శాఖ ఆదేశించింది. పరిస్థితులు చెయి దాటిపోయాక పోలీసు శాఖపై ఆరోపణలు వచ్చేలా వ్యవహరించొద్దని సూచించింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలతో ఆందోళనకరమైన పరిస్థితి ఉండటంతో పోలీసు శాఖ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు మార్గదర్శకాలు పంపినట్లు తెలిసింది.
ఫిర్యాదులు తీసుకోండి..
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మేజర్లయితే వారి ఫిర్యాదును స్వీకరించాలని, ఫిర్యాదులో ఆరోపించిన అంశాలపై దర్యాప్తు చేయాలని పోలీసు శాఖ సూచించింది. అలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట విషయంలో ఇరువురి తల్లిదండ్రులు, పెద్దలను స్టేషన్‌కు పిలిపించి తప్పనిసరిగా కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. గతంలో లాగా సాదాసీదాగా వ్యవహరించొద్దని, అవసరమైతే కేసుల నమోదుకు కూడా వెనుకాడొద్దని ఆదేశాలు జారీ అయినట్లు పోలీసు శాఖ వర్గాలు తెలిపాయి. ఘాతుకాలకు పాల్పడటానికి ముందే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమజాంలో హింసాత్మక ఘటనలు జరగకుండా ఉంటాయని భావిస్తోంది. నిజంగా ప్రాణహాని ఉందనుకున్న సమయంలో ప్రేమజంటపై, వారి కుటుంబీకులపై నిఘా పెట్టాలని ఆదేశించినట్లు తెలిసింది.
రోజుకు పది ఫిర్యాదులు అవే..
గడిచిన నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రేమ వ్యవహారాల్లో ఫిర్యాదులు పెరిగినట్లు పోలీసు శాఖ తెలిపింది. జిల్లాలతో పాటు రాజధాని కమిషనరేట్ల పరిధిలో రోజుకు కనీసం 10 నుంచి 15 ప్రేమ పెళ్లి ఫిర్యాదులు వచ్చినట్లు గుర్తించింది. ఈ ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ జరిపి వధూవరుల అభిప్రాయం తర్వాతే కేసుల నమోదుకు వెళ్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కొన్నిసార్లు కేసులు నమోదుచేయడం వల్ల సమస్య మరింత జఠిలమై దాడుల వరకు వెళ్లేలా ఉంటున్నాయని, అందువల్ల ఇరువర్గా లు సంయమనం పాటించేలా చేసి పెళ్లికి ఒప్పించే స్థితికి కౌన్సెలింగ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment