ఎన్నికలపై నక్సల్స్ కన్ను : డీజీపీ పసాదరావు
యాక్షన్ టీమ్స్ విరుచుకుపడే అవకాశం
ఈ కోణానికీ బందోబస్తులో ప్రాధాన్యం
గస్తీ, తనిఖీలు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: ‘నిత్యం ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చే మావోయిస్టులు ఆ ప్రక్రియను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తారు. సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్. ఒడిశాల్లో కేంద్రీకృతమైన క్యాడర్ నేరుగా చొచ్చుకు రాకపోయినా... ఇద్దరు, ముగ్గురితో కూడిన యాక్షన్ టీమ్‌లు రెక్కీలు నిర్వహించి మెరుపుదాడులు చేసే ప్రమాదం ఉంది’ అని రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు అన్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకునే బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. సార్వత్రిక, మున్సిపల్, పంచాయతీరాజ్ ఎన్నికలు ఒకేసారి రావడంతో రాష్ట్ర పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ వివరించారు.
గతంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి నమోదైన కేసుల్ని కొలిక్కి తెస్తున్నామని. అభియోగపత్రాల దాఖలుతో పాటు పెండింగ్‌లో ఉన్న 16 నాన్-బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించే పార్టీలు, అభ్యర్థులు కచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పు గోదావరి, విశాఖపట్నం రూరల్, శ్రీకాకుళంలో మావోయిస్టుల ప్రభావం ఉందన్నారు. విశాఖ, ఖమ్మం జిల్లాల్లో మారుమూల ప్రాంతాలకు ఎన్నికల సామగ్రి, సిబ్బందిని తరలించడానికి హెలి కాప్టర్లను వినియోగిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే వీఐపీలకు ఉన్న ముప్పును బట్టి భద్రతను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ఘర్షణల నిరోధంపై ప్రత్యేక దృష్టి
స్థానిక సంస్థల ఎన్నికల్లో అల్లర్లు, ఘర్షణలకు అవకాశం ఉండటంతో వాటి నిరోధంపై ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు. పరోక్షంగా జరిగే మండల, జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎంపికప్పుడు కిడ్నాపింగ్‌లకు ఆస్కారం ఉండడంతో వాటిని అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో అసాంఘిక శక్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. ఏ పార్టీకైనా అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేసే స్వేచ్ఛ ఉంటుందని, ఫలానా వ్యక్తిని ఫలానా ప్రాంతానికి రావద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదని అన్నారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని 26,135 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకంగా పరిగణిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 1,038 చెక్‌పోస్టులు, 942 ఫ్లైయింగ్ స్వ్కాడ్స్ ఏర్పాటయ్యాయని, ఇవి రానున్న రోజుల్లో పెరుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,085 మందిని బైండోవర్ చేయడంతో పాటు 3,576 లెసైన్డ్స్ ఆయుధాలను డిపాజిట్ చేయించినట్టు వెల్లడించారు.