దేశ రక్షణలో పోలీస్ కీలకం: గవర్నర్
- ‘అమరుల సంస్మరణ’ పరుగు ప్రారంభించిన నరసింహన్
హైదరాబాద్: దేశరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమైందని, ఫ్రెండ్లీ పోలీస్‌తో ప్రజలకు మరింత చేరువయ్యారని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఆదివారం ఇక్కడి నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో భారతీయ పోలీసు అమర వీరుల తొలి సంస్మరణ పరుగును ఆయన ప్రారంభించారు. గవర్నర్ మాట్లాడు తూ దేశరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరుల సేవలు మరువలేనివన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారి త్యాగాలను గుర్తు చేసుకోవాలన్నారు.
పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా 10కె, 5కె, 2కె రన్‌లను నిర్వహించారు. వీటిలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ఔత్సాహికులు పాల్గొన్నారు. రన్‌లో పాల్గొన్న వారందరికీ పోలీసు శాఖ తరఫున ప్రోత్సాహక పతకాలను అందజేశారు. రన్‌లో 5వేల మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్‌శర్మ, జాతీయ పోలీస్ అకాడమీ డీజీ అరుణా బహుగుణ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహా పలువురు ఐపీఎస్ అధికారులు, ఏసీపీలు పాల్గొన్నారు.
రెండోరోజు ఆకట్టుకున్న ఎక్స్‌పో...
రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో రెండోరోజు ఏర్పాటుచేసిన పోలీస్ ఎక్స్‌పో ఎంతగానో ఆకట్టుకుంది. రన్‌లో పాల్గొన్న వారంతా ఎక్స్‌పోను సందర్శించి వివిధ స్టాళ్లల్లో ఏర్పాటుచేసిన ఆయుధాలతో పాటు ఫొటోలను తిలకించారు.