పోలీసుల అదుపులో నిందితుడు శ్రీనివాసరావు
సాక్షి, విశాఖపట్నం : అంతర్జాతీయ విమానాశ్రయాల్లోకి ఎవరైనా అడుగుపెట్టాలంటే అనేక ఆంక్షలు, నిబంధనలు ఉంటాయి. తనిఖీల విషయంలో ప్రయాణికులనే కాదు అక్కడ పనిచేసే సిబ్బందిని కూడా విడిచిపెట్టరు. అణువణువూ తనిఖీచేస్తారు. అలాగే, అక్కడ పనిచేసే సిబ్బందికి పాసులు జారీచేసే విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై గురువారం జరిగిన హత్యాయత్నం ఘటనతో నిందితుడు శ్రీనివాసరావుకు పాసు జారీ విషయంలో రాష్ట్ర పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.
పోలీసులు ఎన్‌ఓసీ ఎలా ఇచ్చారు?
వాస్తవానికి ఎయిర్‌పోర్టులోని రెస్టారెంట్‌తో పాటు ఇతర విభాగాల్లో పనిచేసే సిబ్బందికి ప్రత్యేకంగా డ్యూటీ పాస్‌లు జారీచేస్తారు. రెస్టారెంట్‌లో పనిచేసే సిబ్బంది అయితే దాని యజమాని తమ వద్ద ఎవరెవరు పనిచేస్తున్నారు.. వారిని ఏ విధంగా నియమించుకున్నామో వివరిస్తూ లేఖ ఇవ్వాలి. లేఖ ఇచ్చిన తర్వాత వారిపై ఏమైనా కేసులున్నాయో లేదో విచారించి రిపోర్టు ఇవ్వాలని స్థానిక పోలీసు అధికారులకు ఎయిర్‌పోర్టు అధికారులు లేఖ రాస్తారు. ఒకవేళ వారు స్థానికులైతే వారు నివసిస్తున్న ప్రాంతాల పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో విచారించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పంపిస్తారు. వేరే జిల్లాలకు చెందిన వారైతే ఆయా జిల్లాలకు వారి వివరాలను పంపి అక్కడి ఎస్పీల ద్వారా ఎన్‌వోసీలు తెప్పించుకుంటారు. ఎలాంటి కేసులు లేవని సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో తేలితేనే ఎన్‌వోసీలు జారీచేస్తారు. ఒకవేళ ఉంటే వాటి తీవ్రత.. సెక్షన్లు.. ఏ సందర్భంలో ఆ కేసులు నమోదయ్యాయో వివరిస్తూ రిపోర్టు పంపిస్తారు. కేసులున్నాయని స్పష్టంగా రిపోర్టులో పేర్కొంటే మాత్రం ఎయిర్‌పోర్టు అధికారులు వాటిని తిరస్కరిస్తారు.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌పై దాడిచేసిన జనుపెల్లి శ్రీనివాసరావుకు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదై ఉన్నట్టు స్పష్టమైంది. గతేడాదే ఠానేలంకలో దాడిచేసిన ఘటనలో శ్రీనివాసరావుపై సెక్షన్–323, 506 (కొట్టడం, బెదిరించడం) కింద కేసులు నమోదయ్యాయి. శ్రీనివాసరావు ఏ–4 ముద్దాయిగా ఉన్న ఈ కేసు ముమ్మిడివరం కోర్టులో నేటికీ కొనసాగుతున్నప్పటికీ ఎయిర్‌పోర్టులోని రెస్టారెంట్ యజమాని నిందితుడు శ్రీనివాసరావును వెయిటర్‌గా నియమించుకున్నారు. అలాంటి నిందితునికి కేసుల్లేవంటూ రాష్ట్ర పోలీసులు ఎన్‌వోసీ జారీచేయడం, దాన్ని ఆధారంగా చేసుకుని ఎయిర్‌పోర్టు అధికారులు డ్యూటీ పాస్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు.. రాష్ట్ర పోలీసుల ఎన్‌వోసీ ఆధారంగానే డ్యూటీపాస్ ఇచ్చాం.. అందులో తమ తప్పేమీ లేదంటూ ఎయిర్‌పోర్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment