కార్యరూపం దాల్చని జీపీఎస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసుశాఖకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నూతన వాహనాలను కొనుగోలు చేసినా లక్ష్యం నెరవేరడం లేదు. కొత్త పుంతలు తొక్కుతున్న నేరస్తులను ఆటపట్టించేందుకు నూతన సాంకేతికతను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కె.చంద్రశేఖర్‌రావు మొదటగా పోలీసుశాఖపైనే దృష్టి సారించారు. సింగపూర్ తరహాలో పోలీసుశాఖను బలోపేతం చేసి తద్వారా శాంతిభద్రతలను అదుపుచేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.
అందుకు అనుగుణంగా అన్ని పోలీసుస్టేషన్లకు కొత్త వాహనాలు అందించాలని ప్రణాళికలు రూపొందించింది. దీని కోసం 340 కోట్ల రూపాయలు వెచ్చించి 15 వందల ఇన్నోవాలు, సుమోలు, అదేస్థాయిలో ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసింది. అయితే, వాహనాలు కొనుగోలు చేసి ఏడాది గడచినా వాటిల్లో ఉపయోగించాల్సిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) టెక్నాలజీని ఇప్పటి వరకు పొందుపరచలేదు. జీపీఎస్ కోసం ప్రయత్నించిన ప్రతీసారి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి.
తాజాగా అన్ని రాష్ట్రాలను కలుపుతూ నిర్భయ నిధులతో ఒక వ్యవస్థను రూపొందిస్తామంటూ కేంద్రం ప్రకటిం చింది. దీంతో జీపీఎస్ టెండర్ల ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది.
జీపీఎస్ ఉంటే..
ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా బాధితులు ‘డయల్ 100’కు కాల్ చేసిన వెంటనే కంట్రోల్ రూం ద్వారా దగ్గర్లోని పెట్రోలింగ్ వాహనానికి కాల్ కనెక్టు అవుతోంది. పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే స్పందించేలా రూపకల్పన చేశారు. వాహనంలో ల్యాప్‌టాప్, సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను చూసేందుకు సదుపాయం కల్పించారు. సంఘటనాస్థలంలో లభించే వేలిముద్రలు తదితర ఆధారాలను వెంటనే జీపీఎస్ ద్వారా కంట్రోల్‌రూం సహాయంతో పరిశీలించవచ్చు. జీపీఎస్ లేకపోవడంతో ఏడాది కింద కొనుగోలు చేసిన వాహనాలకు స్టిక్కర్లు వేసి, కూతలు పెట్టిస్తూ తిప్పుతున్నారు.
నిర్వహణ బాధ్యతపై సందిగ్ధత!
జీపీఎస్ టెక్నాలజీ కొనుగోలు చేసినా నిర్వహణ బాధ్యత ఎవరు చూడాలన్న ప్రశ్న పోలీసు ఉన్నతాధికారులను పట్టి పీడిస్తోంది. టెక్నాలజీ సమకూర్చినవారికే అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని మొదట్లో భావించినా, అలాంటి విధానం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
శాంతిభద్రతల విషయంలో బయటి వ్యక్తులకు అవకాశం ఇస్తే సమాచారం బయటకు పొక్కే ప్రమాదముందని భావిస్తున్నారు. పోలీసుశాఖలోని టె క్నికల్ సర్వీసును పర్యవేక్షించే విభాగానికి బాధ్యతలు అప్పగించాలనుకున్నా అది సాధ్యపడేలా లేదు. ఈ వ్యవస్థను నిర్వహించాలంటే పెద్దసంఖ్యలో సిబ్బంది అవసరమవుతారు. టెక్నికల్ సర్వీసు విభాగం వద్ద సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఉన్నతాధికారులు ఎటూ తేల్చలేకపోతున్నారు.