Management responsibility
-
బోధనాస్పత్రులపై స్పెషల్ ఫోకస్
సాక్షి, అమరావతి: ‘నాడు–నేడు’ ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చివేసిన ప్రభుత్వం... రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రుల నిర్వహణపై కూడా దృష్టి పెట్టింది. కార్పొరేట్ హాస్పిటల్స్ తరహాలో ప్రభుత్వాస్పత్రుల్లోనూ నిర్వహణ బాధ్యతలను చూసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 11 పాత బోధనాస్పత్రులకు ప్రత్యేకంగా జాయింట్ డైరెక్టర్(జేడీ) స్థాయి అధికారులను వైద్యశాఖ నియమించనుంది. వీరికి సహాయకులుగా మరో 88 మందిని నియమిస్తుంది. ఈ మేరకు కొత్తగా 99 పోస్టులను ఇటీవల సృష్టించింది. ఎవరి బాధ్యతలు ఏమిటంటే... ♦ సాధారణంగా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వైద్యపరమైన (క్లినికల్) అంశాలను మెడికల్ సూపరింటెండెంట్ పర్యవేక్షిస్తారు. నాన్–క్లినికల్ (ఆస్పత్రి నిర్వహణకు సంబంధించిన అంశాలు) వ్యవహారాలపర్యవేక్షణకు సీఈవో/జీఎం ఆపరేషన్స్/అడ్మినిస్ట్రేటర్ హోదాలో మరొకరు ఉంటారు. ♦ ఇప్పటి వరకు ప్రభుత్వాస్పత్రుల్లో క్లినికల్, నాన్ క్లినికల్ రెండింటి పర్యవేక్షణ బాధ్యత సూపరింటెండెంట్ చూస్తున్నారు. ♦ ఇకపై ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో మెడికల్ సూపరింటెండెంట్లను వైద్యపరమైన వ్యవహారాలకు పరిమితం చేస్తారు. ♦ పరిపాలన కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. జేడీ నేతృత్వంలో ముగ్గురు ఏడీలతోపాటు అసిస్టెంట్ ఇంజినీర్, ఫెసిలిటీ మేనేజర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్, డేటా అనలిస్ట్ వంటి సహాయక సిబ్బంది పనిచేస్తారు. వీరు ఆస్పత్రిలో భవనాల నిర్వహణ, సెక్యూరిటీ, శానిటేషన్, డైట్, ఉద్యోగుల హాజరు, జీతభత్యాలు, ఇతర నాన్ క్లినికల్ అంశాలను చూస్తారు. ♦ సూపరింటెండెంట్లకు ఇప్పటివరకు ఉన్న ఆస్పత్రి నిర్వహణ భారం తొలగిపోయి రోగుల సంరక్షణకు ఎక్కువ సమయాన్ని కేటాయించే అవకాశం లభిస్తుంది. వైద్యుల హాజరు, ఐపీ, ఓపీ, సర్జరీ సేవలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతారు. ఎన్ఏబీహెచ్ గుర్తింపే లక్ష్యంగా... ప్రభుత్వాస్పత్రుల్లో ప్రమాణాలు పెంచి మంచి వాతావరణంలో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. ఈ క్రమంలో మన ఆస్పత్రులకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్, హెల్త్‌కేర్(ఎన్ఏబీహెచ్) గుర్తింపు పొందడమే లక్ష్యంగా వైద్యశాఖ అడుగులు వేస్తోంది. ఈ దశగా చేపట్టిన చర్యల ఫలితంగా ఇప్పటికే విశాఖపట్నంలోని ఛాతీ, మెంటల్ కేర్ ఆస్పత్రులకు ఎన్ఏబీహెచ్ గుర్తింపు లభించింది. మరోవైపు రాష్ట్రంలోని అత్యధిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్–క్వా‹Ù) గుర్తింపు పొందాయి. ఎన్–క్వాష్ గుర్తింపులో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఇదే తరహాలో మిగిలిన ఆస్పత్రులను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించడానికి నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. -
IBR Report: మధ్యస్థాయి వ్యాపారాల్లో మహిళా సారథులు
ముంబై: దేశంలో మధ్యస్థాయి వ్యాపారాలకు సంబంధించి సీనియర్ మేనేజ్మెంట్ బాధ్యతలను 36 శాతం మేర మహిళలే నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా ఇది సగటున 32 శాతం ఉంటే, మన దేశం ఈ విషయంలో మెరుగ్గా కనిపిస్తోంది. ‘వుమెన్ ఇన్ బిజినెస్ 2023– ద పుష్ ఫర్ ప్యారిటీ’ పేరుతో గ్రాంట్ థార్న్టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఓ నివేదికను విడుదల చేసింది. ఇక అంతర్జాతీయంగా 9 శాతం మధ్యస్థాయి కంపెనీల్లో నాయకత్వ స్థాయి పోస్టుల్లో మహిళలకు ప్రాతినిధ్యమే లేకపోవడం గమనార్హం. ‘‘కార్యాలయాల్లో లింగ సమానత్వం కోసం ఎప్పటి నుంచో కృషి చేస్తున్నాం. ఈ విధమైన పురోగతి ఎంతో ఉత్సాహానిస్తుంది. మరింత మెరుగైన సమానత్వం కోసం సంస్థలు హైబ్రిడ్ లేదా సులభ విధానాలను అమలు చేయాలి. మద్దతునిచ్చే, అర్థం చేసుకునే సంస్కృతి ఏర్పాటు చేయాలి. ఉద్యోగుల శ్రేయస్సు, వారి మార్గదర్శకత్వంపై దృష్టి సారించాలి. అప్పుడు మహిళలకు మద్దతుగా నిలిచినట్టు అవుతుంది’’అని గ్రాంట్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ పల్లవి బఖ్రు పేర్కొన్నారు. సీనియర్ స్థాయి ఉద్యోగాల్లో వైవిధ్యాన్ని పెంచడం బాధ్యాతయుతమైన చర్యే కాదని, వాణిజ్యపరంగా పనితీరు మెరుగుపడడానికి దోహదం చేస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లో 10,000 సంస్థల ప్రతినిధులను ఈ నివేదిక కోసం గ్రాంట్ థార్న్టన్ ఇంటర్వ్యూ, సర్వే చేసింది. కంపెనీల ఎండీలు, సీఈవోలు, నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో ఉన్న వారి అభిప్రాయాలు తెలుసుకుంది. భారత్‌లో 281 కంపెనీల నుంచి సమాచారం సేకరించింది. మధ్యస్థాయి వ్యాపార సంస్థల్లో నాయకత్వ, సీనియర్ స్థానాల విషయంలో బ్రిక్ దేశాల్లో మహిళల శాతం 34గా ఉంటే, జీ7 దేశాలలో 30 శాతంగా ఉంది. -
కార్యరూపం దాల్చని జీపీఎస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసుశాఖకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నూతన వాహనాలను కొనుగోలు చేసినా లక్ష్యం నెరవేరడం లేదు. కొత్త పుంతలు తొక్కుతున్న నేరస్తులను ఆటపట్టించేందుకు నూతన సాంకేతికతను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కె.చంద్రశేఖర్‌రావు మొదటగా పోలీసుశాఖపైనే దృష్టి సారించారు. సింగపూర్ తరహాలో పోలీసుశాఖను బలోపేతం చేసి తద్వారా శాంతిభద్రతలను అదుపుచేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా అన్ని పోలీసుస్టేషన్లకు కొత్త వాహనాలు అందించాలని ప్రణాళికలు రూపొందించింది. దీని కోసం 340 కోట్ల రూపాయలు వెచ్చించి 15 వందల ఇన్నోవాలు, సుమోలు, అదేస్థాయిలో ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసింది. అయితే, వాహనాలు కొనుగోలు చేసి ఏడాది గడచినా వాటిల్లో ఉపయోగించాల్సిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) టెక్నాలజీని ఇప్పటి వరకు పొందుపరచలేదు. జీపీఎస్ కోసం ప్రయత్నించిన ప్రతీసారి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. తాజాగా అన్ని రాష్ట్రాలను కలుపుతూ నిర్భయ నిధులతో ఒక వ్యవస్థను రూపొందిస్తామంటూ కేంద్రం ప్రకటిం చింది. దీంతో జీపీఎస్ టెండర్ల ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. జీపీఎస్ ఉంటే.. ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా బాధితులు ‘డయల్ 100’కు కాల్ చేసిన వెంటనే కంట్రోల్ రూం ద్వారా దగ్గర్లోని పెట్రోలింగ్ వాహనానికి కాల్ కనెక్టు అవుతోంది. పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే స్పందించేలా రూపకల్పన చేశారు. వాహనంలో ల్యాప్‌టాప్, సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను చూసేందుకు సదుపాయం కల్పించారు. సంఘటనాస్థలంలో లభించే వేలిముద్రలు తదితర ఆధారాలను వెంటనే జీపీఎస్ ద్వారా కంట్రోల్‌రూం సహాయంతో పరిశీలించవచ్చు. జీపీఎస్ లేకపోవడంతో ఏడాది కింద కొనుగోలు చేసిన వాహనాలకు స్టిక్కర్లు వేసి, కూతలు పెట్టిస్తూ తిప్పుతున్నారు. నిర్వహణ బాధ్యతపై సందిగ్ధత! జీపీఎస్ టెక్నాలజీ కొనుగోలు చేసినా నిర్వహణ బాధ్యత ఎవరు చూడాలన్న ప్రశ్న పోలీసు ఉన్నతాధికారులను పట్టి పీడిస్తోంది. టెక్నాలజీ సమకూర్చినవారికే అవుట్సోర్సింగ్ పద్ధతిలో నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని మొదట్లో భావించినా, అలాంటి విధానం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. శాంతిభద్రతల విషయంలో బయటి వ్యక్తులకు అవకాశం ఇస్తే సమాచారం బయటకు పొక్కే ప్రమాదముందని భావిస్తున్నారు. పోలీసుశాఖలోని టె క్నికల్ సర్వీసును పర్యవేక్షించే విభాగానికి బాధ్యతలు అప్పగించాలనుకున్నా అది సాధ్యపడేలా లేదు. ఈ వ్యవస్థను నిర్వహించాలంటే పెద్దసంఖ్యలో సిబ్బంది అవసరమవుతారు. టెక్నికల్ సర్వీసు విభాగం వద్ద సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఉన్నతాధికారులు ఎటూ తేల్చలేకపోతున్నారు.