
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేశ్ అతిథి గృహం సహా కృష్ణా నది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన 3 భవనాలకు సీఆర్‌డీఏ తుది నోటీసులు జారీ చేసింది. నదీ పరిరక్షణ చట్టం, బిల్డింగ్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపారని వీటి యజమానులకు గతంలోనే నోటీసులిచ్చి వివరణ కోరిన విషయం తెలిసిందే. దానికి వారిచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో శుక్రవారం లింగమనేని రమేశ్, పాతూరి నాగభూషణం, ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ భవనాలకు తుది నోటీసులిచ్చారు. నిర్మాణాలకు అనుమతులు లేవని, సరైన అనుమతులు చూపించడంలో విఫలమయ్యారని పేర్కొంటూ వారంలో ఆ నిర్మాణాలను తొలగించాలని, లేకపోతే తామే తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. కరకట్ట లోపల అక్రమంగా నిర్మించినట్లు గుర్తించిన 26 కట్టడాలకు సీఆర్‌డీఏ గతంలోనే నోటీసులివ్వగా అందరూ వివరణ ఇచ్చారు.
తమ వద్ద ఉన్న అనుమతి పత్రాలు, ఇతర పత్రాలను అధికారులకు చూపించారు. సీఆర్‌డీఏ కమిషనర్ స్వయంగా వారితో మాట్లాడి అభ్యంతరాలను తెలుసుకున్నారు. చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం యజమాని లింగమనేని రమేశ్ కూడా సీఆర్‌డీఏకు వివరణ ఇచ్చారు. తనకు పంచాయతీ అనుమతి ఉందని చెప్పిన ఆయన తాను భవనం నిర్మించినప్పుడు సీఆర్‌డీఏ లేదని, కాబట్టి సీఆర్‌డీఏకు నోటీసులిచ్చే అధికారం లేదన్నారు. గోకరాజు గంగరాజు, చందన బ్రదర్స్ యజమానులు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు సీఆర్‌డీఏకు పలు సూచనలు చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, వారి వద్దనున్న పత్రాలను కూడా పరిశీలించిన తర్వాత ఈ భవనాలు అక్రమమేనని తేల్చిన సీఆర్‌డీఏ చంద్రబాబు నివాసం సహా మూడు భవనాలకు తుది నోటీసులు జారీ చేసింది. మిగిలిన అక్రమ నిర్మాణాలకు సోమవారం నుంచి నోటీసులు జారీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment