కట్టంగూర్ : అతివేగం ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. కట్టంగూర్ గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణ యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నాగాటి నారాయణ తన భార్య అమృత(52)తో కలిసి వోక్స్ వ్యాగన్ కారులో హైదరాబాదు నుంచి తన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం పెద్దబీరవెల్లికి ఆదివారం ఉదయం బయలుదేరారు.
అతివేగంగా వెళ్తున్న వీరి కారు కట్టంగూరు సమీపంలోకి రాగానే అదుపుతప్పి డివైడర్ మీదుగా కుడివైపు దూసుకెళ్లింది. అదే సమయంలో హైదరాబాదు వైపు వెళ్తున్న లారీ కారును వెనుకవైపు నుంచి ఢీకొట్టింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న నారాయణ కారులో ఇరుక్కుపోగా ఆయన భార్య అమృత కారులోంచి ఎగిరి రోడ్డుపై పడ్డారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అమృత మృతి చెందారు. నారాయణ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు.
సీటుబెల్టు పెట్టుకొని ఉంటే
కారు స్వయంగా నడిపిస్తున్న నాగాటి నారాయణతోపాటు ఆయన భార్య కూడా సీటు బెల్టు పెట్టుకోలేదని తెలుస్తోంది. దీంతో వారి కారు ప్రమాదానికి గురైనప్పుడు నారాయణ భార్య కారులోంచి ఎగిరి కింద పడ్డారు. ఒకవేళ సీటుబెల్టు పెట్టుకొని ఉంటే ప్రాణం పోయే పరిస్థితి ఉండక పోయేదని స్థానికులు పేర్కొంటున్నారు. దీనికి తోడు కారును లారీ వెనకనుంచి ఢీకొనడంతో ఎయిర్ బ్యాగ్స్ కూడా తెరుచుకోలేదు.
సకాలంలో రాని అంబులెన్స్‌లు
స్థానికులు ఫోన్ చేసినా ప్రమాదం జరిగిన అరగంట తర్వాత 108 వాహనం వచ్చింది. సిబ్బంది కూడా అమృత చనిపోయిందని నిర్ధారించి కేవలం నారాయణను మాత్రమే నార్కట్‌పల్లి సమీపంలోని కామినే ని ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన హైవే అంబులెన్స్ సిబ్బంది కూడా అమృత చనిపోయిందంటూ ఆమెను తీసుకెళ్లడానికి నిరాకరించారు.
స్థానికుల ఒత్తిడి మేరకు ఆమెను నకిరేకల్ ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆమె బతికే ఉన్నట్లు నిర్థారించుకొని హుటాహుటినా నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. 108 సిబ్బంది గానీ, హైవే అంబులెన్స్ సిబ్బంది గానీ అమృత కొన ఊపిరితో ఉన్న విషయాన్ని గమనించక ఆస్పత్రికి తరలించడం ఆలస్యం చేయడం వల్లే ఆమె మృతి చెందిందని, ఒకవేళ నారాయణతో పాటే ఆమెను కూడా ఆస్పత్రికి తరలించి ఉంటే బతికేదని స్థానికులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో హైదరాబాదు వెళ్తుతున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు, హైవే సిబ్బంది సకాలంలో స్పందించకపోవటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాణం తీసిన అతివేగం
Published Mon, Sep 29 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM
Advertisement
Advertisement