Kattangur
-
రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం
కట్టంగూర్ మండలంలోని పామనగుండ్ల గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా విజయవరం గ్రామానికి చెందిన ఈపూరి సత్యనారాయణరాజు (50)జహీరాబాదు నుంచి మహీంధ్రా ట్రాక్టర్‌ను డెలివరీ చేసేందుకు ఖమ్మం బయలుదేరాడు. మార్గమధ్యంలోని పామనగుండ్ల గ్రామశివారులోకి రాగానే అతివేగంగా వెళుతున్న లారీ ఓవర్టేక్ చేస్తూ ట్రాక్టర్‌ను వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ఫల్టీలు కొట్టుకుంటూ జాతీయరహదారి పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన క్షతగాత్రున్ని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
వృథాగా పోతున్న కృష్ణా జలాలు
కట్టంగూర్ : మండలంలోని ముత్యాలమ్మగూడెం శివారులోని సవుళ్లగూడెం స్టేజీ వద్ద జాతీయ రహదారి పక్కనే కృష్ణా జలాలు గత రెండు నెలలుగా వృథాగా పోతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంచినీరు లీకవుతూ కలుషితం అవుతున్నాయి. ఉదయ సముద్రం నుంచి కట్టంగూర్ మీదుగా ముత్యాలమ్మగూడెం, దుగినవెల్లి గ్రామాలకు మూడు సంవత్సరాల కిత్రం కృష్ణాజలాల పైపులైను ఏర్పాటు చేశారు. కట్టంగూర్ నుంచి ముత్యాలమ్మగూడెం వైపు వేళ్లే పైపులైన్‌కు సవుళ్లగూడెం వద్ద నాలుగు చోట్ల రంద్రం పడటంతో నీరు పదిఫీట్ల ఎత్తులో ఎగిసిపడుతూ ఆప్రాంతం చిన్నపాటి కుంటను తలపిస్తోంది. రెండు నెలలుగా మంచినీరు వృథాగా పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదు. మూగజీవాలు ఆప్రాంతంలో తిరగటంతో మంచినీరు కలుషిమవుతున్నాయి. మంచినీరు సక్రమంగా సరఫరా కాక ప్రజలు అల్లాడుతుంటే అధికారులు మంచినీటి లీకేజీని అరికట్టడంలో అలసత్వం వహిస్తున్నారు. నాణ్యతలోపం కలిగిన ఇనుపపైపులు ఏర్పాటు చేయటంతో మూడేళ్లకే తుప్పుపట్టి తరుచూ రంద్రాలు ఏర్పాడుతున్నాయి. ప్రజలకు అందాల్సిన త్రాగునీరు వృథాగా పోతూ కలుషితమవుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి నూతన పైపులను ఏర్పాటు చేసి లీకేజీని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
కట్టంగూర్: రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలైన సంఘటన మండలంలోని అయిటిపాముల గ్రామశివారులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నకిరేకల్‌కు చెందిన వీరవెళ్లి రఘనాథ్ తన కుటుంబసభ్యులతో కలిసి పుష్కరాలకు కారులో దర్వేశిపురం వెళ్లారు. పుష్కరస్నానాలు అనంతరం స్వగ్రామం బయలుదేరారు. మండలంలోని అయిటిపాముల శివారులోని సబ్‌స్టేషన్ సమీపంలోకి రాగానే కారు ముందు టైరు పగిలిపోవటంతో అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. అదే సమయంలో కారులోని బెలూన్స్ ఓపెన్ కావటంతో అందులో ఉన్న రఘనాథ్, శ్రీధర్, రజితతో పాటు ఇద్దరు చిన్నారులకు స్వల్పగాయాలయ్యాయి. -
అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య
కట్టంగూర్ : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని ముత్యాలమ్మగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కారింగు దుర్గయ్య(45) తనకున్న మూడు ఎకరాలతోపాటు మరో మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని మూడేళ్లుగా సాగు చేస్తున్నాడు. అయితే రెండేళ్లుగా వర్షాభావంతో సాగు చేసిన పత్తి ఎండిపోవటంతో రైతు అప్పులపాలయ్యాడు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఆరెకరాల్లో వేరుశనగ, కంది, పెసర, వరిపంటలు సాగుచేశాడు. అయితే సరిగ్గా వర్షాలు లేక పంటలు వాడుబారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చేసిన అప్పులు ఎలా తీరుతాయనే మనస్తాపంతో శుక్రవారం మధ్యాహ్నం వేరుశనిగచేను వద్దకు వెళ్లి పురుగుల మందు సేవించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు కొనఊపిరితో ఉన్న దుర్గయ్యను నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తమకు సుమారు రూ.5లక్షల అప్పు ఉన్నట్లు మృతుడి భార్య తెలిపింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు. కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య శ్యామల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బంధువులు తెలిపారు. -
చికిత్స పొందుతున్న యువకుడి మృతి
కట్టంగూర్ : చికిత్స పొందుతున్న యువకుడు మృతిచెందిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బొల్లేపల్లి గ్రామానికి చెందిన ఎర్ర ప్రశాంత్(22) 2016 జూన్ 7న కట్టంగూర్ నుంచి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యంలోని మీరాసాహెబ్‌గూడెం స్టేజీ సమీపంలో మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శుక్రవారం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రశాంత్ ఇటీవల నల్లగొండ ఎస్ఆర్టీఐ కళాశాలలో బీటెక్ ఈఈఈ పూర్తిచేశాడు. మృతుడి తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ యూసఫ్‌జానీ పేర్కొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం
కట్టంగూర్ : ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం కట్టంగూర్‌లో జరిగిన ఆపార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ వైఫల్యాలను నికరంగా నిలదేసే పార్టీ సీపీఎం మాత్రమేనన్నారు. పార్టీ మారే నాయకులు ఏం సాధించటానికి పార్టీలు మారుతున్నారో ప్రజలకు వివరించాలన్నారు. జీఓ 123ను హైకోర్టు కొట్టివేసినా ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లటం రైతులపై యుద్ధం చేయటమేనన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఎండీ జహంగీర్, బోళ్ల నర్సింహారెడ్డి, మామిyì సర్వయ్య,lకందాల ప్రమీల, మందుల విప్లవ్‌కుమార్, బొప్పని పద్మ, పెంజర్ల సైదులు, గద్దపాటి యాదగిరి, ధర్మారెడ్డి, యాదయ్య, మారయ్య, భిక్షం తదితరులున్నారు. -
కత్తులతో పొడిచి.. ఆపై గొంతుకోసి..
* నారెగూడెంలో వ్యక్తి దారుణ హత్య * పోలీసుల అదుపులో అనుమానితులు కట్టంగూర్ (నల్లగొండ): దుండగులు కత్తులతో పొడిచి.. ఆపై గొంతుకోసి ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన కట్టంగూరు మండలం నారెగూడెంలో శుక్రవారం వెలుగుచూసింది. శాలిగౌరారం రూరల్ సీఐ ప్రమీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి గ్రామానికి చెందిన కొండబత్తుల కృష్ణ (32) తన భార్య రమ్యతో కలిసి నాలుగు నెలల క్రితం గ్రామంలోని శ్యామల శేఖర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డికి చె ందిన సుమారు 100 ఎకరాల మామిడి, బత్తాయి తోటలో జీతం కుదిరారు. వీరితో పాటు మరో ఐదు కుటుంబాలు జీతం కుదిరి జీవనం సాగిస్తున్నాయి. కిరాణ సామాగ్రి కోసం వెళ్లి.. గురువారం సాయంత్రం కృష్ణ తన భార్య రమ్యతో చెప్పి సుమారు 6 గంటల ప్రాంతంలో కిరాణ సామగ్రి తెచ్చేందుకు గ్రామంలోకి వెళ్లాడు. రాత్రి పొద్దుపోయేంతవరకు భర్త ఇంటికి రాకపోవటంతో రమ్య విషయాన్ని తోటలోని తోటి కూలీలకు తెలియజేసింది. దీంతో కూలీలందరూ కలిసి బాట వెంట వెతుకుతుం డగా డొంక పక్కన స్కూటర్ కనబడింది. ఆ ప్రాంతం లో వెతకగా చెట్లపొదల్లో వ్యక్తి కనబడ్డా డు. దగ్గరికి వెళ్లి చూసే వరకు అప్పటికే కృష్ణ మృతి చెందాడు. తలపై తీవ్ర గాయాలతో పాటు, శరీరంలో నాలుగు కత్తిపోట్లు, గొంతు కోసి హతమార్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు హత్యోదంతం విషయం తె లుసుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్, కట్టంగూర్, శాలిగౌరారం, నార్కట్‌పల్లి ఎస్ఐలు సత్యనారాయణ, మోతిరాం సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అదే రాత్రి నకి రేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నల్లగొండ డీఎస్పీ సుధాకర్ శుక్రవారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్‌స్వాడ్‌ను రప్పించి పరిశోధించారు. మృతుడి భార్య, తోట సూపర్వైజర్తో తోటలోని కూలీలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కృష్ణ హత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉండవచ్చని పోలీసులు భావి స్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. మృతుడి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఇద్దరు కూలీల దుర్మరణం
కట్టంగూర్ మండలంలోని పామనగుండ్ల శివారు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం మండలంలోని పరడ గ్రామానికి చెందిన మాగి భిక్షం(60), కోనేటి యాదయ్య (55), సుంకరబోయిన వెంకన్నలు పామనగుండ్ల శివారులో రోజువారీగా కట్టెలు కొట్టేందుకు వెళ్లారు. తిరిగి సాయంత్రం స్వగ్రామం పరడకు వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై ముగ్గురు బయలుదేరారు. పామనగుండ్ల శివారులోని సబ్‌స్టేషన్ సమీపంలోకి రాగానే హైదరాబాదు నుంచి విజయవాడ వైపు వేగంగా వెళుతున్న కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భిక్షం, యాదయ్యలు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన వెంకన్నను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాల ను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపారు. -
విద్యార్థులకు అస్వస్థత
కట్టంగూర్ : మధ్యాహ్న భోజనం వికటించి 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మండలంలోని అయిటిపాముల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. ఈ విద్యా సంవత్సనం ప్రారంభం నుంచి పాఠశాలలో భోజన ఎజెన్సీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల కారణంగా ఇదే పాఠశాలలో జులై 19, 2014న ఫుడ్ పాయిజన్ కావటంతో 42 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. దీంతో మూడు నెలలుగా పాఠశాల ఎస్ఎంసీ కమి టీ ఆధ్వర్యంలో వంట చేసి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. చెర్వుఅన్నారం ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటన ఒక్క రోజైనా పూర్తి కాకముందే అయిటిపాములో రెండోసారి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అధికారుల పర్యవేక్షణ, సంఘాల మధ్య గొడవల కారణంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. వారం రోజు లుగా నూతన సంఘాలైన తిరుపతమ్మ, వరలక్ష్మి, లక్ష్మినర్సింహ్మ సంఘాలు వంట చేస్తున్నారు. శనివారం వంటల సమయం లో పప్పుదోసకాయ కూరలో సాంబారు మసాలకు బదులుగా చికెన్ మసాలా, పొ ట్లాల్లో తెచ్చిన కారాన్ని వేసి కూరను వండి విద్యార్థులకు వడ్డించారు. దోసకాయ ముక్కలు సరిగ్గా ఉడక లేదని విద్యార్థులు తెలిపారు. అన్నం తిన్న విద్యార్థులు తర గతి గదిలోకి వెళ్లి కూర్చున్నారు. సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో 6 నుంచి 9వ తరగతి వరకు 31,10వ తరగతి విద్యార్థి ఒక్క రు చొప్పున విద్యార్థులు కడుపునొప్పి, తల నొప్పితో పాటు వాంతులు చేసుకున్నారు. ఇది గమినించిన పాఠశాల హెచ్ఎం రేణుకాదేవి 108 వాహనంలో32 మంది విద్యార్థులను నకిరేక ల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. ఆసుపత్రిలో 14 మంది బాలికలు, 18 మంది బాలురకు వైద్య సిబ్బంది మెరుగైన చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులంతా క్షేమంగా ఉండటంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. విష యం తెలుసుకున్న డీఈఓ విశ్వనాథరావు, జెడ్పీటీసీ మాద యాదగిరి, ఎంపీపీ కొండ లింగస్వామి, ఎంఈఓ బి.మోహన్‌రెడ్డి, సర్పంచ్ పెద్ది మంగమ్మసుక్కయ్య, ఊ ట్కూరి ఏడుకొండలు, నిమ్మనగోటి సైదులు విద్యార్థులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం: డీఈఓ విశ్వనాథరావు విద్యార్థుల పట్ల అలసత్వంగా వ్యహరించిన వారిని కఠినంగా శిక్షిస్తాము. డిప్యూటీ డీఈ ఓతో విచారణ చేయిస్తాం, కలెక్టర్‌కు ఫిర్యా దు చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాండా చూస్తాం. -
ప్రాణం తీసిన అతివేగం
కట్టంగూర్ : అతివేగం ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. కట్టంగూర్ గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణ యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నాగాటి నారాయణ తన భార్య అమృత(52)తో కలిసి వోక్స్ వ్యాగన్ కారులో హైదరాబాదు నుంచి తన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం పెద్దబీరవెల్లికి ఆదివారం ఉదయం బయలుదేరారు. అతివేగంగా వెళ్తున్న వీరి కారు కట్టంగూరు సమీపంలోకి రాగానే అదుపుతప్పి డివైడర్ మీదుగా కుడివైపు దూసుకెళ్లింది. అదే సమయంలో హైదరాబాదు వైపు వెళ్తున్న లారీ కారును వెనుకవైపు నుంచి ఢీకొట్టింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న నారాయణ కారులో ఇరుక్కుపోగా ఆయన భార్య అమృత కారులోంచి ఎగిరి రోడ్డుపై పడ్డారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అమృత మృతి చెందారు. నారాయణ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. సీటుబెల్టు పెట్టుకొని ఉంటే కారు స్వయంగా నడిపిస్తున్న నాగాటి నారాయణతోపాటు ఆయన భార్య కూడా సీటు బెల్టు పెట్టుకోలేదని తెలుస్తోంది. దీంతో వారి కారు ప్రమాదానికి గురైనప్పుడు నారాయణ భార్య కారులోంచి ఎగిరి కింద పడ్డారు. ఒకవేళ సీటుబెల్టు పెట్టుకొని ఉంటే ప్రాణం పోయే పరిస్థితి ఉండక పోయేదని స్థానికులు పేర్కొంటున్నారు. దీనికి తోడు కారును లారీ వెనకనుంచి ఢీకొనడంతో ఎయిర్ బ్యాగ్స్ కూడా తెరుచుకోలేదు. సకాలంలో రాని అంబులెన్స్‌లు స్థానికులు ఫోన్ చేసినా ప్రమాదం జరిగిన అరగంట తర్వాత 108 వాహనం వచ్చింది. సిబ్బంది కూడా అమృత చనిపోయిందని నిర్ధారించి కేవలం నారాయణను మాత్రమే నార్కట్‌పల్లి సమీపంలోని కామినే ని ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన హైవే అంబులెన్స్ సిబ్బంది కూడా అమృత చనిపోయిందంటూ ఆమెను తీసుకెళ్లడానికి నిరాకరించారు. స్థానికుల ఒత్తిడి మేరకు ఆమెను నకిరేకల్ ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆమె బతికే ఉన్నట్లు నిర్థారించుకొని హుటాహుటినా నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. 108 సిబ్బంది గానీ, హైవే అంబులెన్స్ సిబ్బంది గానీ అమృత కొన ఊపిరితో ఉన్న విషయాన్ని గమనించక ఆస్పత్రికి తరలించడం ఆలస్యం చేయడం వల్లే ఆమె మృతి చెందిందని, ఒకవేళ నారాయణతో పాటే ఆమెను కూడా ఆస్పత్రికి తరలించి ఉంటే బతికేదని స్థానికులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో హైదరాబాదు వెళ్తుతున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు, హైవే సిబ్బంది సకాలంలో స్పందించకపోవటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి
కట్టంగూర్, న్యూస్‌లైన్ బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్ర శేఖర్ తెలిపారు. సోమవారం ఎరసానిగూడెం, కల్మెర గ్రామాలకు చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకలు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నరేంద్రమోడీ ప్రధాని అయితేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందన్నారు. పార్టీలో చేరిన వారిలో తలారి యాదగిరి, కటికం శ్రీను, కొరివి శివశంకర్, బంటు సుదర్శన్, శ్రావన్‌కుమార్‌రెడ్డి, సురేష్, కార్యక్రమంలో గోలి అమరేందర్‌రెడ్డి, గుండగోని గిరిబాబు, కూతురు లక్ష్మారెడ్డి, మండల వెంకన్న ఉన్నారు.