మిర్యాలగూడ: ‘మేము 9వ తరగతినుంచి ప్రేమించుకున్నాం. మొదటినుంచీ మాకు నా తండ్రినుంచి బెదిరింపులు ఉన్నాయి. గతంలో నయీం గ్యాంగ్ ద్వారా బెదిరించాడు. నన్ను కూడా చంపి నాగార్జునసాగర్‌లో పడేస్తానని హెచ్చరించాడు. అయినా మేము భయపడలేదు. కానీ చివరికి అనుకున్నంత పనిచేశాడు. నా భర్తను అకారణంగా చంపేశాడు’అంటూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత రోదిస్తూ చెప్పింది. ప్రణయ్ హత్య అనంతరం మిర్యాలగూడలోని జ్యోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన భార్య అమృతను శనివారం పలువురు పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె విలపిస్తూ పలు సంచలన విషయాలు చెప్పింది. పలువురు రాజకీయనాయకులు సహా, అక్కడికి వచ్చిన వారు ఆమె పరిస్థితి చూసి కంటనీరు పెట్టుకున్నారు. ప్రణయ్‌ని హత్య చేసిన వారిని చంపేయాలంటూ అమృత విలపించింది. ప్రణయ్‌ని తన తండ్రి మారుతీరావే చంపినట్లు పేర్కొంది. తన భర్తను చంపించిన పుట్టింటికి వెళ్లేది లేదని, తనకు పుట్టే బిడ్డను ప్రణయ్ గుర్తుగా పెంచుకుంటానని వెల్లడించింది. ప్రణయ్‌తో తాను 9వ తరగతి నుంచి ప్రేమలో ఉన్నానని, తనను ఎంతో బాగా చూసుకునే వాడని, తనను కూడా ప్రణయ్ వద్దకు పంపించేయాలని రోదించింది.
మాట్లాడుకోవద్దని కొట్టారు..
తామిద్దరూ ప్రేమించుకున్న విషయం గతంలోనే ఇంట్లో వారికి తెలియడంతో తన తండ్రి మారుతీరావు ప్రణయ్‌ని నయీం గ్యాంగ్‌తో బెదిరించినట్లు అమృత తెలిపింది. దాంతో అప్పట్లో ప్రణయ్ కొద్ది రోజుల పాటు కళాశాలకు కూడా రాలేదని చెప్పింది. ఆ తర్వాత ప్రణయ్‌తో మాట్లాడవద్దని ఇంట్లో తండ్రి మారుతీరావు, బాబాయి శ్రవణ్‌కుమార్‌లు ఎన్నోసార్లు తనను కొట్టారని, కాలితో తన్నారని తెలిపింది. ఆ క్రమంలోనే ప్రణయ్‌తో మాట్లాడినట్లు తెలిస్తే తనను కూడా చంపి సాగర్‌లో పడేస్తామని బెదిరించినట్లు వెల్లడించింది. తాను ప్రేమ వివాహం చేసుకోవడం తండ్రికి, బాబాయికి ఇష్టం లేదంది. తన తండ్రి మారుతీరావు కొంతకాలంగా ఫోన్‌లో మాట్లాడుతున్నాడని, గర్భవతి అయిన విషయాన్ని చెప్పగా అబార్షన్ చేయించుకోవాలని కోరినట్లు తెలిపింది. ప్రణయ్ హత్య జరగడానికి ఐదు నిమిషాల ముందు ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్న సమయంలో తండ్రి మారుతీరావు ఫోన్ చేశాడని, కానీ ఫోన్ ఎత్తలేదని చెప్పింది. కాగా, రిసెప్షన్ సమయంలో ప్రణయ్, అమృతలు తీయించుకున్న వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దానిని చూసిన అమృత తండ్రి మారుతీరావు మరింత కక్ష పెంచుకున్నట్లు తెలిసింది.
కూతురులా చూసుకున్నాం ప్రణయ్ తండ్రి బాలస్వామి
గతంలో నయీం గ్యాంగ్‌తో బెదిరించారని ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి చెప్పారు. శనివారం తనను పరామర్శించడానికి వచ్చిన పలువురు రాజకీయ నేతలకు ఆయన గత విషయాలను చెబు తూ విలపించారు. అమృతను కూతురులా చూసుకుంటున్నా తన కొడుకును మారుతీరావు పొట్టనబెట్టుకున్నాడని కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి కోరిక మేరకు ఇంటికి వెళ్లాలని అమృతకు చెబితే, ఆత్మహత్య చేసుకుంటానేగానీ అక్కడికి వెళ్లేదిలేదని, ప్రణయ్‌తోనే ఉంటానని చెప్పిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అమృత తన తండ్రి ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment