ఒక అసంపూర్ణ చిత్రం | An incomplete picture | Sakshi
Sakshi News home page

ఒక అసంపూర్ణ చిత్రం

Published Sun, Jan 7 2018 12:24 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

An incomplete picture - Sakshi

ఆమె పేరు అమృత.  జీవితం మాత్రం ఒక అసంపూర్ణ చిత్రం.  ఈ రంగుల ప్రపంచాన్ని నలుమూలల నుంచి ఆమె వీక్షించింది. ఆ అద్భుతమైన రంగులతో కాన్వాస్‌ మీద రసరమ్య దృశ్యాలనే ఆవిష్కరించింది. తన బతుకు చిత్రం మాత్రం ప్రపంచ చిత్రకళా చరిత్ర మీద ఒలికిన రంగులా మిగిలిపోయింది.  అమృత.. అమృతా షేర్గిల్‌ (జనవరి 30, 1913–డిసెంబర్‌ 7,1941) జీవనరేఖలను చూస్తే విస్మయంగా ఉంటుంది. పంజాబీ సిక్కు, సంస్కృతం, పర్షియన్, ఖగోళ శాస్త్రాలలో మహా పండితుడు– ఉమ్రావ్‌సింగ్‌ షేర్గిల్‌ మాజీతియా. కులీన కుటుంబానికి చెందినవాడు. ఆయన భార్య మేరీ ఆంటోనెట్‌ గోటెస్మాన్‌. ఈమె హంగెరీ దేశ యువతి. ఒపేరా గాయని. యూదు జాతీయురాలు. 1912లో మహారాజా దిలీప్‌సింగ్‌ కుమార్తె బాంబా సదర్‌ల్యాండ్‌తో కలసి భారతదేశానికి వచ్చినప్పుడు ఉమ్రావ్‌సింగ్‌ ఈమెను కలుసుకున్నాడు. ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరి కూతురే అమృత. హంగెరీ రాజధాని బుడాపెస్ట్‌లో పుట్టింది. ఈమెకు ఒక సోదరి– ఇందిర. ఎంతో అందంగా ఉండే హంగెరీలోనే దునాహరాస్టీ అనే పట్టణంలో అమృత బాల్యం గడిచింది. ఐదేళ్ల వయసులోనే చిత్రలేఖనం మీద ఆసక్తి చూపించింది. 

కానీ 1921లో వీరి కుటుంబం ఆ అందాల హంగెరీని విడిచిపెట్టి రావలసి వచ్చింది. కారణం ఆర్థిక ఇబ్బందులు. భారతదేశంలోనే ఉమ్రావ్‌సింగ్‌ సొంత ఎస్టేట్‌ ఉన్న సిమ్లాకు తరలివచ్చారు. హిమాలయ సానువులకు సమీపంగా ఉండే ఈ హిల్‌స్టేషన్‌ పట్టణం కూడా అంతే అందమైనది. అప్పటికి అమృతకు తొమ్మిదేళ్లు. సిమ్లాలో అమృత, ఆమె సోదరి ఇందిర పియానో నేర్చుకున్నారు. అనతికాలంలోనే సంగీత సభలను నిర్వహించే స్థాయికి ఎదిగిపోయారు. అలాగే అక్కడ ఉన్న గెయిటీ థియేటర్‌లో ప్రదర్శించే నాటకాలలో పాత్రలు కూడా ధరించేవారు. ఆ వయసులోనే అమృత తీవ్ర భావాలు కలిగి ఉండేది. ఇవే ఆమె భావి జీవిత చిత్రాన్ని చాలా వరకు మలిచాయి. నాస్తికురాలినని చెప్పినందుకు ఆమెను పాఠశాల నుంచి బహిష్కరించారు. ఇవన్నీ ఎలా ఉన్నా అమృత ఆసక్తి మాత్రం చిత్రలేఖనమే. ఇది సరిగానే గుర్తించింది తల్లి. 

మేరీ ఆంటోనెట్‌ కూతురును తీసుకుని 1924లో ఇటలీ వెళ్లిపోయింది. అక్కడ సాంటా అనున్‌జియాటా ఆర్ట్‌ స్కూల్‌లో చేర్పించింది. తరువాత అంటే, 1930లో పారిస్‌ వెళ్లి ఎకోల్‌ బ్యూ ఆర్ట్స్‌ సంస్థలో అమృత చేరింది. నాలుగేళ్ల పాటు చదువుకుంది. యూరోపియన్‌ చిత్రరంగ ప్రముఖులు పాల్‌ సెజానె, పాల్‌ గౌగిన్‌ శైలులంటే అపారమైన ఆసక్తి ఏర్పరుచుకుంది. ఇటాలియన్‌ గురువుల దగ్గర కానీ, పారిస్‌లో గానీ అమృత ఎంతో నేర్చుకుంది. నిజం చెప్పాలంటే ఒక తపస్సులా, నిర్విరామంగా చిత్రకళను అభ్యసించింది.  ప్రపంచ ప్రఖ్యాత చిత్రలేఖనా సంస్థలలో మెళకువలు నేర్చుకుంటున్నా, కుంచె చాలనంలో ఎంతో ప్రతిభ సాధిస్తున్నా, కాన్వాస్‌ మీదకు తీసుకురావలసిన ‘వస్తువు’ విషయంలో పెద్ద సంక్షోభానికి అమృత గురైందనిపిస్తుంది. కానీ ఆ సంఘర్షణ నుంచి, ఆ సంక్షోభం నుంచి అతి త్వరలోనే బయటపడగలిగే అవకాశం వచ్చింది.  పారిస్‌లో చదువుతుండగానే ఆమె ఇండియా వచ్చారు. అప్పుడే తొలిచిత్రం గీశారు. దాని పేరు ‘యంగ్‌ గర్ల్స్‌’. లాహోర్‌లో (అఖండ భారతంలో) తన ఇంటì  ఆవరణ లోని పచ్చిక బయలు మీద, ఒక రోలర్‌ మీద ముగ్గురు బాలికలను కూర్చోబెట్టి అమృత ఆ చిత్రాన్ని గీశారు. నిజానికి ఆ ముగ్గురు ఆమె పినతండ్రి పిల్లలు– బియాంత్‌ కౌర్, నర్వాయిర్‌ కౌర్, గుర్భజన్‌ కౌర్‌. ఈ మొదటి చిత్రంతోనే ఆమె అంతర్జాతీయ ఖ్యాతిని సాధించింది. చిత్రలేఖనంలో ప్రతిష్టాత్మక వేదిక గ్రాండ్‌ సెలూన్‌లో ఆమె సభ్యురాలైంది. యంగ్‌గర్ల్స్‌ చిత్రంలోని ప్రత్యేకతను ఆమె ప్రొఫెసర్‌ ఒకరు బాగానే గుర్తించారు కూడా. అదే విషయం ఆమెకు చెప్పారాయన. ‘నీవు పాశ్చాత్య శైలితో, ప్రాచ్య జీవితచిత్రాన్ని రచిస్తున్నావు, చాలా అద్భుతం’ అని శ్లాఘించారు. అప్పుడే అమృత పడుతున్న సృజనాత్మక సంక్షోభానికి సమాధానం దొరికింది. ఐదేళ్ల తరువాత కాస్త ఆలస్యంగా బాంబే ఆర్ట్‌ సొసైటీ కూడా యంగ్‌గర్ల్స్‌ చిత్రానికే బంగారు పతకం ప్రకటించింది.  1934లో చదువు పూర్తి చేసుకుని ఇండియా వచ్చేసింది అమృత. అక్కడ నుంచి భారతీయ జీవిత చిత్రాన్ని కాన్వాస్‌కు ఎక్కించడానికి కొత్త తపస్సునే ఆరంభించింది. వలస భారతదేశంలో, పాశ్చాత్య జీవనానికే మొగ్గు చూపుతున్న సంఘంలో అమృత తన ఇతివృత్తాల కోసం అన్వేషించడమే వింతనిపిస్తుంది. ఆమె పుట్టుక, పెరుగుదల, విద్య ఎంత పాశ్చాత్యమైనప్పటికీ, తన మూలాలు ఎక్కడ ఉన్నాయో ఆమె పిన్నవయసులోనే సులభంగా గ్రహించింది. 

అజంతా గుహలలోని కుడ్యచిత్రాలు, మొగల్‌ చిత్రకళ, దక్షిణ భారతదేశ జీవనం ఆమెను బాగా ప్రభావితం చేశాయి. కానీ అమృత ఏ చిత్రం గీసినా పాశ్చాత్య చిత్రకళలోని సౌందర్యదృష్టిని మాత్రం మిళితం చేసేవారు. అలా ఒక కొత్త శైలికి నాంది పలికారామె. అందుకే 20వ శతాబ్దపు చిత్రకళలో ఆమెకు ప్రత్యేక స్థానం దక్కింది. ఆమె చూపిన సృజనలో ఒక విప్లవ పథం దర్శనమిచ్చింది కూడా. 
తన కాన్వాస్‌ను సంపద్వంతం చేసుకునేందుకు అమృత భారతదేశమంతటా తిరిగింది. అప్పుడే మూడు చిత్రాలు గీసింది, అవే– ‘పెళ్లికూతురి ముస్తాబు’, ‘బ్రహ్మచారులు’, ‘సంతకు పోతున్న పల్లెజనం’. తన చుట్టూ ఉన్న ప్రజల రూపురేఖలనే కాన్వాస్‌ మీదకు తీసుకువచ్చిందామె. ఆ చిత్రాల అంతరంగాలేమిటో తన రంగులతో ఉన్మీలనం చేయగలిగింది. ఇదంతా పోస్ట్‌ ఇంప్రెషనిస్ట్‌ శైలితో అమృత సాధించారని విమర్శకులు చెబుతారు. ఆ మూడు చిత్రాలలో పాశ్చాత్య శైలి, భారతీయ సంప్రదాయ చిత్రకళా ధోరణి కూడా ప్రతిబింబిస్తాయని అంటారు. అమృత ఎక్కడ పుట్టినా, ఎక్కడ చదివినా, ఎక్కడ చిత్రకళలో మెళకువలు నేర్చినా, ఎన్ని చిత్రకళా ధోరణులను అధ్యయనం చేసినా, ఎలాంటి చిత్రకళా మూర్తులను ఆరాధించినా– చివరికి ఆమె కుంచె వయ్యారాలు పోయినది భారతీయ జన జీవనం చూశాకే. ఆ చిత్రాల వెనుక భారతదేశపు పేదరికపు నీలినీడలు కూడా కనిపిస్తుంటాయి. ఆమె చిత్రాలలో కనిపించే మానవాకృతులలో అణచివేత, బాధ కూడా కనిపిస్తాయి. ‘గ్రామీణ చిత్రం’, ‘మహిళలలో’ వంటి అమృత చిత్రాలు ఇందుకు సాక్ష్యం చెబుతాయి. ముదురు రంగులలోనే అయినా పలచటి ముఖాలతో కనిపించే ఆమె చిత్రాలలోని మహిళలు అణచివేతకు చిహ్నాలుగానే కనిపిస్తారు. ఆ రెండు పద్ధతులతో ఆమె తన మనోభావాన్ని వ్యక్తీకరించిందని చెబుతారు. 1938లో ఆమె వివాహం చేసుకుంది. హంగెరీ జాతీయుడు డాక్టర్‌ విక్టర్‌ ఇగాన్‌ ఆమె భర్త. ఇతడు తల్లి వైపు నుంచి సమీప బంధువే. పెళ్లికి ముందు, పెళ్లి తరువాత ఆమె చిత్రకళా జీవితం వైవిధ్యంగా కనిపిస్తుంది. రెండోదళ చిత్రాలలో బెంగాలీ కళాకారుల శైలి కనిపిస్తుందని చెబుతారు. ఇంకా చెప్పాలంటే రవీంద్రనాథ్‌ టాగూర్, అబనీంద్రనాథ్‌ టాగూర్, అబనీరాయ్‌ల ప్రభావం ఆమె చిత్రాలలో స్పష్టంగా కనిపిస్తుంది. తన మూలాలను వెతుక్కుంటూ రావడం వల్ల కావచ్చు, సహజంగా సృజనాత్మక జీవులకుండే స్పందన వల్ల కావచ్చు– అమృత స్వదేశం వచ్చిన తరువాత తనను తాను తెలుసుకుందనిపిస్తుంది. 

అమృత ఎంత గొప్ప చిత్రకారిణో, అంత సౌందర్యరాశి. అలాగే నేపథ్యం వల్ల కావచ్చు, ఒక రకమైన విశృంఖల జీవితం కూడా గడిపారు. జీవితంలో అనేక మందితో స్నేహం చేశారు. సంబంధాలు పెట్టుకున్నారు. తన పోర్ట్రెయిట్‌లతో పాటు ఆ మిత్రుల పోర్ట్రెయిట్లను కూడా విపరీతంగా చిత్రించారు. పుంఖానుపుంఖాలుగా బొమ్మలు వేశారు. ఆమె సన్నిహితులలో జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా ఒకరు. కానీ ఆయన చిత్రాన్ని అమృత చిత్రించలేదు. అందుకు కారణం కూడా చెప్పారు. ‘నెహ్రూ మరీ బాగా, చిత్రకళకు అందనంత బాగా కనిపిస్తారు’ అన్నారటామె. 1941 తరువాత అమృత దంపతులు భారతదేశానికి వచ్చి, గోరఖ్‌పూర్‌ దగ్గర నివాసం ఉన్నారు. అప్పుడు గీసిన చిత్రాలు ‘ఎర్ర ఇటుకల ఇల్లు’, ‘నులకమంచం మీద కూర్చున్న స్త్రీలు’, ‘కొండ దృశ్యం’, ‘పెళ్లి కూతురు’ వంటివి. ఆ సంవత్సరంలోనే డిసెంబర్‌లో అమృత గీసిన పెయింటింగ్స్‌తో లాహోర్‌లో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. అప్పుడు లాహోర్‌ చిత్రకారులకు, చిత్రకళకు పెట్టింది పేరు. అన్ని ఏర్పాట్లు జరిగాయి. మరో రెండురోజులలో ప్రదర్శన అనగా అమృత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కోమాలోకి వెళ్లిపోయి, తుదిశ్వాస విడిచారు. ఆ చిత్రకళా ప్రదర్శన, అందులో ఆమెకు దక్కే గౌరవం ఏమీ చూడకుండానే ఆమె కన్నుమూసింది. అప్పటికి ఆమె వయసు 28 సంవత్సరాలు. ఆనాటికే ప్రపంచ ప్రఖ్యాతి వహించిన ఆ చిత్రకారిణి ప్రదర్శన జరగడానికి రెండు రోజుల ముందే డాక్టర్‌ భర్త ఆమెకు గర్భస్రావం చేశాడు. అదే ఆమె మరణానికి దారితీసిందనీ, భర్తే చంపేశాడనీ అమృత తల్లి ఆరోపించింది. కానీ ఇప్పటికీ అమృత మరణం వెనుక అసలు రహస్యం బయటపడలేదు. లాహోర్‌లోని తన స్టూడియోలో ఆమె గీసిన చివరి చిత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది– ఆమె జీవితం వలెనే. పాలబిందెలు మోసుకుంటూ, రెండు బర్రెలను తోలుకు వెళుతున్న ఒక గ్రామీణుడిని ఆమె చిత్రిస్తుండగా జీవితం ముగిసిపోయింది. 

అమృత చిత్రాలకు ఇప్పటికీ ఆదరణ ఉంది. ఆమె చిత్రలేఖనంలో తెచ్చిన విప్లవానికి విలువ ఉంది. 2006లో ఢిల్లీలో నిర్వహించిన అమృత చిత్రకళా ప్రదర్శనలో ఆమె గీసిన ‘గ్రామీణ దృశ్యం’ చిత్రం 6.9 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. 2013వ సంవత్సరాన్ని అంతర్జాతీయ అమృత షేర్గిల్‌ సంవత్సరంగా యునెస్కో ప్రకటించింది. అది ఆమె శత జయంతి. ఢిల్లీలోని మోడరన్‌ ఆర్ట్స్‌ గ్యాలరీలో ఆమె పెయింటింగ్స్‌తో ఒక విభాగమే ఉంది. ఎన్నెన్ని వర్ణాలు... ఎన్నెన్ని దృశ్యాలు అనిపించే ఆమె జీవితం ఆధారంగా కొన్ని నవలలు, నాటకాలు కూడా వచ్చాయి. సల్మాన్‌ రష్దీ ‘ది మూన్స్‌ లాస్ట్‌ సై’ ఇతివృత్తం అమృత జీవితమే. అమృత ఒక మిత్రురాలికి రాసిన లేఖలో మాటలు ఏమిటో తెలుసా! ‘నేను భారతదేశంలో మాత్రమే బొమ్మలు గీయగలను. రంగులు వేయగలను. ఐరోపా పికాసో, మాటిస్సె, బ్రక్యూలది. భారతదేశం మాత్రం నాకే సొంతం’. 
∙డా. గోపరాజు నారాయణరావు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement